
భర్తను హత్య చేసిన ఇద్దరు భార్యలు
జనగామ జిల్లాలో ఘటన
జనగామ జిల్లా: అతనికి ఇద్దరు భార్యలు. వారిద్దరూ తోబుట్టువులే. తమ తల్లిని చంపాడన్న పగతో ఉన్న ఆ ఇద్దరూ భర్తను గొడ్డలితో నరికి చంపారు. ఈ ఘటన జనగామ జిల్లా లింగాలఘణపురం మండలం పిట్టలోనిగూడెంలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి సీఐ శ్రీనివాస్‌రెడ్డి, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. పిట్టలోనిగూడేనికి చెందిన కాలియా కనకయ్యకు చొక్కమ్మ, గౌరమ్మలిద్దరూ భార్యలు. మే 18న కనకయ్య.. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సుద్దాలలో అత్త జున్నుబాయిని (చొక్కమ్మ, గౌరమ్మల తల్లి) మామిడి తోటలో ఉండగా తాగిన మైకంలో గొడ్డలితో నరికి చంపాడు. మరో గ్రామంలో మామిడితోటలో ఉన్న తన ఇద్దరు భార్యలకు విషయం చెప్పకుండా వారిని తీసుకొని సిద్దిపేటకు పారిపోయాడు.
తెల్లవారుజామున విషయం పోలీసులకు తెలిసి కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా కనకయ్య సిద్దిపేటలో ఉన్నాడన్న సమాచారం మేరకు పోలీసులు అక్కడకు వెళ్లి పట్టుకునేలోపు పారిపోయాడు. ఈ విషయం చొక్కమ్మ, గౌరమ్మలకు తెలియడంతో పిట్టలోనిగూడేనికి తిరిగివచ్చారు. అప్పటినుంచి కనకయ్య పోలీసులకు దొరకకుండా తప్పించుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి పిట్టలోనిగూడెం వచి్చన కనకయ్య భార్యలతో గొడవ పడ్డాడు. దీంతో గూడెంలోని ప్రజలంతా నిద్రలేచి అక్కడకు వచ్చారు. గొడవ తీవ్రంగా జరిగింది. దీంతో కోపోద్రిక్తులైన చొక్కమ్మ, గౌరమ్మలు.. వరుసకు సోదరులైన జనార్దన్, శ్రీనివాసులుతో కలిసి గొడ్డలితో కనకయ్యను హత్య చేశారు. మృతదేహాన్ని గ్రామంలో నుంచి కొద్ది దూరం తీసుకెళ్లి చెట్ల పొదల్లో పడేశారు. కనకయ్య తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు సీఐ చెప్పారు.
పీడ విరగడైంది..: నేర చరిత్ర కలిగిన కనకయ్య తాగిన మైకంలో ఏం చేస్తాడో తెలియదని, క్రూరమృగంలా ప్రవర్తించి.. మహిళలతో వావివరుసలు లేకుండా వ్యవహరిస్తాడని గ్రామస్తులు చెప్పుకొచ్చారు. మహిళలు ఇంట్లోనుంచి బయటకు రావాలంటే భయపడే పరిస్థితులు ఉండేవన్నారు. అతని చేష్టలపై గతంలో పంచాయితీలు పెట్టి పోలీసు స్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేసినట్టు గ్రామస్తులు చెప్పారు.