
నాగర్‌కర్నూల్ జిల్లా: మండలంలోని ముకురాలలో గొంతులో గుడ్డు ఇరుక్కుని వ్యక్తి మృతిచెందిన ఘటన చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన వింజమూరి ఈశ్వరయ్య (52) ఆదివారం రాత్రి భోజనం చేసే సమయంలో గుడ్డు తిన్నాడు. అందులోని పచ్చసోన గొంతులో ఇరుక్కుపోవడంతో భార్య ఈశ్వరమ్మ తలపై కొట్టి గుడ్డును కక్కించే ప్రయత్నం చేయడంతోపాటు నీళ్లు తాపినా ప్రయోజనం లేక అక్కడికక్కడే మృతిచెందాడు. కాగా.. ఈశ్వరయ్యను ఆస్పత్రికి తీసుకెళ్లగా.. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందాడని చెప్పడంతో చేసేదేమి లేక ఇంటికి తీసుకెళ్లి సోమవారం అంత్యక్రియలు నిర్వహించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.
వ్యక్తి హఠాన్మరణం
పాన్‌గల్: కిందపడి ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన సోమవారం మండలంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ శ్రీనివాసులు కథనం మేరకు.. మండలంలోని కేతేపల్లికి చెందిన తోకల కృష్ణ పబ్లిసిటీ పెయింటింగ్ కాంట్రాక్టర్. ఆయన దగ్గర ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్టణానికి చెందిన జానీ రంగరావు, సదరం రమణ (58) పెయింటర్స్‌గా పని చేస్తున్నారు. ఏపీలోని అనంతపూర్‌లో పెయింటింగ్ పని ముగించుకొని ఈ నెల 16న రాత్రి కేతేపల్లికి చేరుకున్నారు. 18వ తేదీన సదరం రమణ బహిర్భూమికి వెళ్తూ గ్రామపంచాయతీ కార్యాలయ భవనం దగ్గర కళ్లు తిరిగి కిందపడిపోయాడు. వెంటనే గ్రామంలోని ఆర్‌ఎంపీ దగ్గరకు అటు నుంచి జిల్లా ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. తోకల కృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్‌ఐ వివరించారు.