
కన్నతండ్రి బాలయ్యను హత్య చేసిన కుమారుడు బీరయ్య
మొండెం, తల వేరు చేసి.. డిండిచింతపల్లి,
డీఎల్‌ఐ కాల్వల్లో పారవేత
కేసు వివరాలు వెల్లడించిన డీఎస్పీ వెంకట్‌రెడ్డి
కల్వకుర్తి టౌన్: మూఢనమ్మకాల అనుమానంతోనే కన్నతండ్రిని హత్య చేయాలని కుమారుడు పథకం రచించాడని.. ఈ ప్రణాళికలో భాగంగానే పొలం వద్ద పంచాయితీ పెట్టుకొని హత్య చేశాడని.. అనంతరం తల, మొండెంను వేరుచేసి డిండిచింతపల్లి, డీఎల్‌ఐ కాల్వలో పారవేశారని కల్వకుర్తి డీఎస్పీ వెంకట్‌రెడ్డి తెలిపారు. సంచలనం సృష్టించిన ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను ఆయన ఆదివారం కల్వకుర్తిలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. కల్వకుర్తి పట్టణంలోని వాసవినగర్ కాలనీలో నివాసం ఉండే బాలయ్య (70)కు ముగ్గురు కుమారులు ఉండగా.. ఇందులో ఒకరు గతంలో చనిపోయారు.
మిగిలిన ఇద్దరిలో చిన్న కుమారుడు బీరయ్య. అయితే, బీరయ్యకు ఒక కుమార్తె ఉండగా.. మూడు నెలల క్రితం బాలిక ఆత్మహత్య చేసుకుంది. నాటి నుంచి బాలిక తండ్రి బీరయ్య నిత్యం ఆలోచనలో ఉంటూ.. కూతురి మృతికి గల కారణాలను అన్వేషిస్తూ ఉన్నాడు. ఈక్రమంలో ఓ మాంత్రికుడి వద్దకు వెళ్లిన బీరయ్యకు నీ కూతురి మృతికి నీ తండ్రి బాలయ్యనే కారణమని చెప్పాడు. దీంతో నాటి నుంచి తండ్రిపై పగ పెంచుకున్నాడు బీరయ్య ఎలాగైనా చంపాలని నిర్ణయించుకున్నాడు.
ఈక్రమంలో ఈ నెల 3వ తేదీన పొలం వద్ద పశువులను మేపుకుంటూ ఉన్న తండ్రి బాలయ్య గొడవకు దిగాడు. పంచాయితీ కాస్త పెద్దగా కావడంతో అక్కడే ఉన్న కర్రతో తండ్రి బాలయ్య తలపై కుమారుడు బీరయ్య విచక్షణారహితంగా దాడి చేశాడు. రక్తపు మడుగులో ఉన్న బాలయ్య స్పృహతప్పి పడిపోయాడు. ఇదే అదునుగా అతన్ని చనిపోయే వరకు దాడిచేశాడు. ఈ దాడిని బాలయ్య వద్ద పనిచేసే రామచంద్రి చూడగా, అతని వద్దకు వెళ్లి ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే నిన్ను కూడా చంపేస్తా అనడంతో అతడు అక్కడి నుంచి భయపడి పారిపోయాడు.
హత్యకు ముందు నుంచే ప్రణాళిక..
ఇదిలాఉండగా, తండ్రి బాలయ్యని ఎలాగైనా చంపాలని బీరయ్య ముందే పక్కా ప్రణాళిక వేశాడు. గొడవ చోటుచేసుకోవడంతో ఇదే అదునుగా హత్య చేశాడు. అయితే, వరుసకు మేనల్లుడు అయిన వంగూర్ మండలం రంగాపూర్‌కు చెందిన అంజికి బీరయ్య విషయాన్ని అంతా ఫోన్ ద్వారా వివరించాడు. తండ్రిని హత్య చేసిన తర్వాత అంజి అప్పటికే సిద్ధంగా ఉండటంతో అతని కారు డిక్కీలో బాలయ్య మృతదేహాన్ని వేసుకొని అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇదిలాఉండగా, పొలం వద్దకు వెళ్లిన తండ్రి బాలయ్య రాత్రి అయినా ఇంటికి రాకపోవటంతో మరో కుమారుడు మల్లయ్య పొలం వద్దకు వెళ్లి వెతికాడు. ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని అక్కడ ఉన్న రక్తపు మరకలు, రామచంద్రి తెలిపిన వివరాలతో విచారణ చేపట్టారు. నిందితులు బీరయ్య, అంజి ఫోన్ లొకేషన్ ద్వారా వారు పట్టణంలోని జేపీనగర్ నుంచి కొట్రకు వెళ్లే దారిలో అనుమానంతో సంచరిస్తుండగా వారిని పట్టుకొని విచారించగా తండ్రిని హత్య చేశానని ఒప్పుకున్నాడు.
విచారణలో విస్తుపోయే విషయాలు
పోలీసుల విచారణలో తండ్రి బాలయ్యపై దాడి చేసి తానే హత్య చేశానని, మృతిచెందాడని నిర్ధారించుకున్న తర్వాత మృతదేహాన్ని కారు డిక్కీలో తీసుకెళ్లామని బీరయ్య ఒప్పుకున్నాడు. అనంతరం శరీరం నుంచి తలను చిన్న రంపంతో వేరుచేసి, మొండెంను వంగూర్ మండలం డిండిచింతపల్లి కాల్వలో, తలను డీఎల్‌ఐ కెనాల్‌లో పడేశానని తెలిపాడన్నారు. తలను వేరు చేసే సమయంలో బాలయ్య చెవికి ఉన్న బంగారు రింగులను రంపంతోనే కట్‌చేసి వారితో పాటుగా తీసుకెళ్లారు. ఈ వివరాలతో రెండు కాల్వల్లో గాలింపు చర్యలు చేపట్టి మొండెం, తలను స్వా«దీనం చేసుకొని పోస్టుమార్టం నిర్వహించి వారి కుటుంబసభ్యులకు అందజేశామన్నారు. నిందితులు ఇద్దరిని కల్వకుర్తి జడ్జి ఎదుట హాజరుపర్చగా వారి ఆదేశానుసారంగా రిమాండ్‌కు తరలించామని డీఎస్పీ తెలిపారు. హత్యకు ఉపయోగించిన కర్రతో పాటుగా, రంపం, కారు, బైక్, బంగారు చెవిపోగులు, సెల్‌ఫోన్లు స్వా«దీనం చేసుకున్నామన్నారు. హత్య కేసును చేదించిన కల్వకుర్తి సీఐ నాగార్జున, ఎస్‌ఐలు మాధవరెడ్డి, మహేష్, వెంకట్‌రెడ్డి, సిబ్బంది, గ్రామస్తులకు నగదు రివార్డులను అందజేశారు.