
చెరువు మధ్యలో స్తంభమెక్కి మరమ్మతు
మూడు గ్రామాలకు విద్యుత్ సరఫరా పునరుద్ధరణ
యువకుడికి సోషల్ మీడియాలో అభినందనల వెల్లువ
నారాయణపేట జిల్లా: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనం ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడుతున్న క్రమంలో చెరువు మధ్యలో ఉన్న విద్యుత్ స్తంభంపై వైరు తెగిపోయి తన పరిధిలో ఉన్న గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఈదుకుంటూ వెళ్లి వైర్లు సరిచేసి సరఫరా పునరుద్ధరించి శభాష్ అనిపించుకున్నాడు యువకుడు వెంకటేశ్.
సంబంధిత గ్రామాలకు కొన్నేళ్లుగా విద్యుత్ శాఖ నుంచి అధికారికంగా లైన్‌మెన్ లేకపోయినా కరెంట్ బిల్లుల వసూలుకు నియమించబడిన సదరు యువకుడు తన పని కాకపోయినా ధైర్యం చేసి విద్యుత్ మరమ్మతులు చేశాడు. ముశ్రీఫా, ముంగిమళ్ల, ముక్తిపాడ్‌కు సంబంధించిన కరెంట్ బిల్లుల వసూలుకు స్పాట్‌బిల్లర్‌గా కొంతకాలంగా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి ముశ్రీఫా శివారులో ఉన్న చెరువు మధ్యలో విద్యుత్ వైరు తెగిపోయింది.
దీంతో ముశ్రీఫా, ముంగిమళ్ల, ముక్తిపాడ్‌కు విద్యుత్ సరఫరా నిలిచి గ్రామాల్లో చీకటి అలుముకుంది. సోమవారం ఉదయం విద్యుత్ లైన్‌ను పరిశీలించగా.. చెరువు మధ్యలో వైరు తెగినట్లు గుర్తించారు. స్పాట్‌బిల్లర్ వెంకటేశ్ ఎల్‌సీ తీసుకొని చెరువులో ఈదుకుంటూ వెళ్లి మధ్యలో ఉన్న స్తంభం ఎక్కి వైర్లు సరిచేసి విద్యుత్ సరఫరా పునరుద్ధరించాడు. దీంతో ఆయా గ్రామాల ప్రజలు వెంకటేశ్‌ను అభినందించారు. ప్రమాదకరమని తెలిసినప్పటికీ ధైర్యం చేసి చెరువు మధ్యలోకి వెళ్లి మరమ్మతు పనులు పూర్తి చేసిన వీడియోలు వాట్సాప్ గ్రూపుల్లో హల్‌చల్ చేయడంతో వెంకటేశ్‌కు సోషల్ మీడియాలో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.