గ్రేటర్‌..ఇక గ్రేటెస్ట్‌ | Merger of 27 municipalities into GHMC approved by Telangana Cabinet | Sakshi
Sakshi News home page

గ్రేటర్‌..ఇక గ్రేటెస్ట్‌

Nov 26 2025 5:29 AM | Updated on Nov 26 2025 5:29 AM

Merger of 27 municipalities into GHMC approved by Telangana Cabinet

మంత్రివర్గ నిర్ణయాలను వెల్లడిస్తున్న డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు వాకిటి శ్రీహరి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, జూపల్లి కృష్ణారావు, అడ్లూరి లక్ష్మణ్‌

గ్రేటర్‌ హైదరాబాద్‌లో 27 పురపాలికల విలీనం

మంత్రివర్గం కీలక నిర్ణయం

ఏకీకృత సదుపాయాలు, పన్నుల విధానం కోసమే

జీహెచ్‌ఎంసీలో రూ.14,725 కోట్లతో భూగర్భ విద్యుత్‌ కేబుల్‌ వ్యవస్థ 

3 వేల మెగావాట్ల సౌర, 2 వేల మెగావాట్ల పంప్డ్‌ స్టోరేజీ విద్యుత్‌ కొనుగోళ్లకు ఓకే 

10 వేల మెగావాట్ల పంప్డ్‌ స్టోరేజీ విద్యుత్‌ కేంద్రాలకు అనుమతి 

సర్కారీ విద్యుత్‌ కనెక్షన్ల కోసం కొత్తగా మూడో డిస్కం ఏర్పాటు

రామగుండంలో 800 మెగావాట్ల ఎనీ్టపీసీ కేంద్రం.. పాల్వంచ, మక్తల్‌లో సైతం.. 

నిర్ణయాలను వెల్లడించిన మంత్రులు 

విద్యుత్‌ చార్జీల పెంపు ప్రతిపాదన లేదని స్పష్టీకరణ..

కేబినెట్‌ నిర్ణయాలు లీకులిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక 

దేశంలోనే అతిపెద్ద మహానగరంగా అవతరించనున్న హైదరాబాద్‌

గ్రేటర్‌ను ఎన్ని కార్పొరేషన్లుగా విభజిస్తారో ఇంకా జరగని నిర్ణయం

జీహెచ్‌ఎంసీలో విలీనం కానున్న పురపాలికలివే...
మేడ్చల్‌–మల్కాజ్‌గిరి జిల్లా : బోడుప్పల్, పీర్జాదిగూడ, జవహర్‌నగర్, నిజాంపేట్, దమ్మాయిగూడ, నాగారం, పోచారం, ఘట్‌కేసర్, గుండ్లపోచంపల్లి, మేడ్చల్, తూముకుంట, కొంపల్లి, దుండిగల్‌  

రంగారెడ్డి జిల్లా: బడంగ్‌పేట్, బండ్లగూడ జాగీర్, మీర్‌పేట్, పెద్ద అంబర్‌పేట్, జల్‌పల్లి, శంషాబాద్, తుర్కయాంజాల్, నార్సింగి, మణికొండ, ఆదిభట్ల,
తుక్కుగూడ 
సంగారెడ్డి జిల్లా: బొల్లారం, తెల్లాపూర్, అమీన్‌పూర్‌  

సాక్షి, హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ)ను విస్తరించేందుకు రాష్ట్ర మంత్రివర్గం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.  హైదరాబాద్‌ తెలంగాణ కోర్‌ అర్బన్‌ ఏరియా పరిధిలో ఉన్న మున్సిపాలిటీలు, మున్సిపల్‌ కార్పొరేషన్లన్నింటినీ జీహెచ్‌ఎంసీలో విలీనం చేయాలని కీలక నిర్ణయం తీసుకుంది. ఔటర్‌ రింగ్‌ రోడ్‌(ఓఆర్‌ఆర్‌)కి లోపల, బయట, దానిని ఆనుకొని ఉన్న 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను జీహెచ్‌ఎంసీలో విలీనం చేయాలనే ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. ఇందుకోసం జీహెచ్‌ఎంసీ చట్టం, తెలంగాణ మున్సిపాలిటీల చట్టాలకు అవసరమైన సవరణలు చేయాలని తీర్మానించింది. ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి అధ్యక్షతన మంగళవారం సచివాలయంలో మంత్రివర్గం సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకుంది.

అనంతరం ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్‌ బాబు.. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరితో కలిసి సచివాలయంలో మీడియాకు మంత్రివర్గ నిర్ణయాలను వెల్లడించారు. పరిపాల న వ్యవహారాలు, అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, పన్నుల విషయంలో ఏకీకృత విధానాన్ని తెచ్చేందుకే శివారు పురపాలికలను జీహెచ్‌ఎంసీలో విలీనం చేయాలని నిర్ణయించినట్టు శ్రీధర్‌ బాబు తెలిపారు. విలీనం తర్వాత జీహెచ్‌ఎంసీని విభజించి ఎన్ని కార్పొరేషన్లు చేయాలో ఇంకా నిర్ణయించలేదన్నారు.  

మూడో డిస్కం ఏర్పాటు 
రాష్ట్రంలో ప్రస్తుతం ఉత్తర/దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (టీజీఎనీ్పడీసీఎల్‌/ టీజీఎస్పీడీసీఎల్‌)లు ఉండగా, కొత్తగా మూడో డిస్కం ఏర్పాటు చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఉచిత వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లతోపాటు ఎత్తిపోతల పథకాలు, మిషన్‌ భగీరథ, తాగునీటి పథకాలు, హైదరాబాద్‌ మెట్రో వాటర్‌ సప్లయ్‌ సీవరేజ్‌ బోర్డుకి సంబంధించిన విద్యుత్‌ కనెక్షన్లు అన్నింటినీ కొత్త డిస్కం పరిధిలోకి తీసుకురావాలని నిర్ణయించింది. రాష్ట్రంలో విద్యుత్‌ చార్జీలు పెంచాలని డిస్కంల నుంచి తమకు ఎలాంటి ప్రతిపాదనలు అందలేదని శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. పెరుగుతున్న విద్యుత్తు డిమాండ్, వచ్చే పదేళ్లకు సంబంధించిన విద్యుత్‌ అవసరాలు, విద్యుదుత్పత్తి అంచనాలపై మంత్రివర్గం విస్తృతంగా చర్చించింది.  

విద్యుత్‌ కొనుగోళ్లు 
కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రాష్ట్రంలో పునరుత్పాదక విద్యుత్‌ వినియోగాన్ని పెంచేందుకు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా 3,000 మెగావాట్ల సౌర విద్యుత్‌ కొనుగోలుకు వీలైనంత తొందరగా టెండర్లు పిలవాలని నిర్ణయించింది. సౌర విద్యుత్‌ తరహాలోనే పంప్డ్‌ స్టోరేజీ విద్యుత్‌ వినియోగం పెంపులో భాగంగా 2,000 మెగావాట్ల పంప్డ్‌ స్టోరేజీ విద్యుత్‌ కొనుగోలు చేసేందుకు టెండర్లు పిలవాలని నిర్ణయించింది. ఐదేళ్ల కాలపరిమితితో ఈ రెండు కొనుగోలు ఒప్పందాలు చేసుకోవాలని ఆదేశించింది. 

పంప్డ్‌ స్టోరేజీ విద్యుత్‌ కేంద్రాలు 
రాష్ట్రంలో పలుచోట్ల పంప్డ్‌ స్టోరేజీ విద్యుత్‌ కేంద్రాల ఏర్పాటుకు అనువైన ప్రాంతాలున్నాయి. వీటి ఏర్పాటుకు ముందుకొచ్చే కంపెనీలు, పెట్టుబడిదారులకు అనుమతి ఇచ్చేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఇప్పటికే డిస్కంలు చేసుకున్న ఎంవోయూలను కూడా పరిశీలించాలని నిర్ణయించింది. రాష్ట్రంలో 10 వేల మెగావాట్ల పంప్డ్‌ స్టోరేజ్‌ విద్యుత్‌ కేంద్రాల ఏర్పాటు చేసేందుకు అనుమతులు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ ప్లాంట్ల ఏర్పాటుకు ఆసక్తి ప్రదర్శించే కంపెనీలకు ప్రభుత్వమే అవసరమైన భూమిని కేటాయించి, నీళ్లను అందిస్తుంది. ఈ ప్లాంట్లలో ఉత్పత్తి చేసే విద్యుత్‌ను ముందుగా మన డిస్కంలకే విక్రయించాలనే షరతుతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటుంది.  

కొత్త పరిశ్రమలు.. సొంత విద్యుదుత్పత్తి 
క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ ఎనర్జీ పాలసీలో భాగంగా మంత్రివర్గం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కొత్తగా స్థాపించే పరిశ్రమలు తమకు అవసరమైన విద్యుత్తును తామతంట తామే సొంతంగా ఉత్పత్తి చేసుకునే అవకాశం కల్పించింది. కొత్త పరిశ్రమలు సొంత అవసరాలకు క్యాప్టివ్‌ పవర్‌ జనరేషన్‌ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తు చేసుకుంటే గరిష్ట పరిమితులు లేకుండా వెంటనే అనుమతి ఇవ్వాలని నిర్ణయించింది. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలకు ప్రస్తుత విధానంలోనే విద్యుత్‌ సరఫరా జరుగుతుంది. 

2,400 మెగావాట్ల ఎన్టీపీసీ కేంద్రాలు 
రామగుండం థర్మల్‌ విద్యుత్‌ కేంద్రంలో కొత్తగా నిర్మించే 800 మెగావాట్ల విద్యుత్‌ కేంద్రాన్ని ఎనీ్టపీసీ అధ్వర్యంలో చేపట్టాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఎనీ్టపీసీ ఆధ్వర్యంలో పాల్వంచ, మక్తల్‌లోనూ చెరో 800 మెగావాట్ల విద్యుత్‌ ప్లాంట్ల నిర్మాణానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని అధికారులకు సూచించింది. ఎన్టీపీసీ ఆధ్వర్యంలో, జెన్‌కో ఆధ్వర్యంలో  వీటిని నిర్మిస్తే ఏ ధరతో విద్యుత్‌ లభిస్తుందో అంచనా వేసి తుది పరిశీలన చేయాలని చెప్పింది. 

భూగర్భ విద్యుత్‌ కేబుల్‌ వ్యవస్థ 
జీహెచ్‌ఎంసీ పరిధిలో రూ.14,725 కోట్లతో భూగర్భ విద్యుత్‌ కేబుల్‌ వ్యవస్థను ఏర్పాటు చేయాలని కేబినెట్‌ నిర్ణయించింది. ఇప్పటికే బెంగళూరులో భూగర్భ విద్యుత్‌ కేబుల్‌ వ్యవస్థ ఉండగా, ఇటీవల అధికారులు అక్కడికి వెళ్లి అధ్యయనం చేసి వచ్చారు. హైదరాబాద్‌ నగరాన్ని విద్యుత్‌ సర్కిళ్ల వారీగా మూడు విభాగాలుగా విభజించుకుని.. ఈ ప్రాజెక్టు చేపట్టాలని మంత్రివర్గం నిర్ణయించింది. విద్యుత్‌తోపాటు టీ–ఫైబర్, వివిధ కేబుల్‌ నెట్‌వర్క్‌ తీగలను భూగర్భంలోనే ఉండేలా చేయాలని, ఆయా కంపెనీలతో సంప్రదింపులు జరపాలని నిర్ణయం తీసుకుంది.  

దేశంలోనే అతిపెద్ద మహా నగరం 
దేశంలోనే అతిపెద్ద మహా నగరంగా హైదరాబాద్‌ అవతరించనుంది. శివార్లలోని 27 మున్సిపాలిటీలను జీహెచ్‌ఎంసీలో విలీనం చేయాలని రాష్ట్ర కేబినెట్‌ నిర్ణయించడంతో 1,982.9 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం, 1.69 కోట్ల జనాభాతో దేశంలోనే అతిపెద్ద నగరంగా రూపాంతరం చెందనుంది. మన తర్వాతే ముంబై, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై మున్సిపల్‌ కార్పొరేషన్లు ఉన్నాయి. ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ 625 చ.కి.మీ., 1.45 కోట్ల జనాభాతో ఉంది.  

6 కొత్త ఐటీఐల స్థాపన 
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం పెద్ద నల్లబెల్లి గ్రామంలో ఎస్సీ, ఎస్టీ బీసీ యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటేడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌ నిర్మాణానికి 20.28 ఎకరాలను, ములుగు జిల్లా ములుగు మండలంలోని జగ్గన్నపేట గ్రామంలో స్పోర్ట్స్‌ స్కూల్‌ ఏర్పాటుకు 40 ఎకరాలను కేటాయించేందుకు కేబినెట్‌ అంగీకారం తెలిపింది. జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో కొత్తగా అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇప్పుడున్న 56 ఏటీసీలకు తోడుగా కొత్తగా 6 ఐటీఐలలో ఏటీసీలను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. 

లీకులిస్తే మంత్రులపైనా చర్యలు 
మంత్రివర్గ నిర్ణయాలు రహస్యమైనవని,  జీవోలు రాక ముందే వాటిపై లీకులిచ్చే వారిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని శ్రీధర్‌బాబు చెప్పారు. కొందరు సహచర మంత్రులే లీకులిస్తున్నారని ఓ విలేకరి పేర్కొనగా, ఎంతటి వారైనా చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement