పట్నం నుంచి మొదలైన పండుగ ప్రయాణాలు
ప్రయాణికులతో కిక్కిరిసిన బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు
3,500 రెగ్యులర్ బస్సులు... మరో 300 బస్సులు అదనం
60 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసిన దక్షిణ మధ్య రైల్వే
సాక్షి, హైదరాబాద్/చౌటుప్పల్/సూర్యాపేట టౌన్ : నగరం నుంచి పండుగ ప్రయాణాలు మొదలయ్యాయి. శనివారం ఉదయం నుంచే బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు జనంతో పోటెత్తాయి.ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్, ఎల్‌బీనగర్, మియాపూర్, కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు, ఈసీఐఎల్, మెహిదీపట్నం, అమీర్‌పేట, సాగర్ రింగ్ రోడ్డు, ఆరాంఘర్ తదితర ప్రాంతాల నుంచి శనివారం ప్రయాణికులు భారీ ఎత్తున సొంత ఊళ్లకు తరలి వెళ్లారు.
దూర ప్రాంతాలకు రాకపోకలు సాగించే సుమారు 3,500 రెగ్యులర్ బస్సులతోపాటు మరో 300 బస్సులను అదనంగా ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. సిటీ బస్సులను సైతం దూర ప్రాంతాలకు నడుపుతున్నారు. శనివారం 75 సిటీ బస్సులను విజయవాడ, నల్లగొండ, ఖమ్మం, సూర్యాపేట తదితర ప్రాంతాలకు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ప్రైవేట్ బస్సులు, సొంత వాహనాల్లో సైతం పెద్ద ఎత్తున తరలివెళ్లారు. దీంతో విజయవాడ, వరంగల్, కర్నూలు రహదారులు వాహనాలతో పోటెత్తాయి.
రైళ్లలో కిక్కిరిసిన జనరల్ బోగీలు...
సాధారణ రైళ్లతోపాటు వివిధ మార్గాల్లో సుమారు 60 ప్రత్యేక రైళ్లను నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే ఏర్పాట్లు చేసింది. రద్దీ దృష్ట్యా అన్ని రైళ్లలోనూ బెర్తులు బుక్ అయ్యాయి. దీంతో ప్రయాణికులు జనరల్ బోగీల్లో తరలి వెళ్లారు. సికింద్రాబాద్, చర్లపల్లి, లింగంపల్లి తదితర స్టేషన్‌ల నుంచి శనివారం పెద్ద సంఖ్యలో ప్రయాణికులు బయలుదేరారు. సాధారణంగా సికింద్రాబాద్ స్టేషన్ నుంచి నిత్యం సుమారు 1.85 లక్షల మంది ప్రయాణం చేస్తారు. శనివారం సుమారు 2.20 లక్షల మంది తరలి వెళ్లినట్లు అంచనా, లింగంపల్లి, చర్లపల్లి, నాంపల్లి స్టేషన్‌లలోనూ ప్రయాణికుల రద్దీ భారీగా పెరిగింది.

జాతీయ రహదారిపై రద్దీ
పండుగ నేపథ్యంలో ప్రజానీకం సొంతూళ్లకు బయలుదేరడంతో హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై రద్దీ ఏర్పడింది. ఈ రహదారిపై యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్‌ప్లాజా నుంచి శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల నుంచి శనివారం సాయంత్రం 5గంటల వరకు విజయవాడ వైపు 55వేల వాహనాలు వెళ్లాయి. పంతంగి టోల్‌ప్లాజా వద్ద మొత్తం 16టోల్‌బూత్‌లు ఉన్నాయి. ప్రస్తుతం రద్దీని దృష్టిలో ఉంచుకొని విజయవాడ వైపునకు 12బూత్‌లు కేటాయించారు. హైదరాబాద్ మార్గంలో నాలుగు బూత్‌ల ద్వారా వాహనాలను పంపిస్తున్నారు.
అయితే, అదనంగా కేటాయించిన టోల్‌బూత్‌లకు ఫాస్టాగ్ స్కానింగ్ చేసే అవకాశం ఉండదు. స్కానింగ్ వ్యవస్థ వెనుక భాగంలో ఉండడంతో విజయవాడ వైపునకు వెళ్లే వాహనాలకు ఆటోమెటిక్ స్కానింగ్‌కు అవకాశం లేదు. దీంతో ఆ నాలుగు బూత్‌ల వద్ద హ్యాండ్ మిషన్ ద్వారా స్కానింగ్ చేస్తున్నారు. ఇందుకుగాను అక్కడ ప్రత్యేకంగా సిబ్బందిని అందుబాటులో ఉంచారు. రద్దీని తట్టుకునేలా సిబ్బంది హ్యాండ్ గన్‌లతో సిద్ధంగా ఉంటూ స్కాన్ చేస్తున్నారు.


