సాక్షి,హైదరాబాద్: విజయవాడ జాతీయ రహదారిపై వాహన రద్దీ భారీగా పెరిగింది. సంక్రాంతి పండుగకు ముందు శనివారం, ఆదివారం రావడంతో హైదరాబాద్‌లో నివసించే ప్రజలు తమ స్వగ్రామాల బాట పట్టారు. ఒకే సమయంలో వాహనాలు వేల సంఖ్యలో తరలిరావడంతో యాదాద్రి జిల్లా పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాలు అర కిలోమీటరు మేర నిలిచిపోయాయి.
ఒక దశలో ట్రాఫిక్ కిలోమీటరు మేర నిలిచిపోయింది. ఫాస్టాగ్ విధానం అమలులో ఉన్నప్పటికీ వాహనాలు పరిమితికి మించి రావడం, కొన్ని వాహనాల ఫాస్టాగ్‌లు స్కాన్ కాకపోవడంతోనే కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోతున్నాయని టోల్ ప్లాజా నిర్వాహకులు, పోలీసులు చెబుతున్నారు. రాచకొండ పోలీసులు, జీఎంఆర్ టోల్‌గేట్ సిబ్బంది వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరిస్తున్నారు.
కేతేపల్లి మండలం కొర్లపహాడ్ వద్ద ఫాస్టాగ్ సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. టోల్ చెల్లింపులు సక్రమంగా జరగకపోవడంతో వాహనాలు నిలిచిపోయి, రద్దీ మరింత పెరిగింది. మరోవైపు జాతీయ రహదారి-65 పై వాహనాల జాతర కొనసాగుతోంది. పలు ప్రాంతాల్లో వాహనాల సంఖ్య పెరగడంతో రహదారి బ్లాక్ స్పాట్స్ వద్ద జాగ్రత్త చర్యలు కనిపించకపోవడం వాహనదారులను ఆందోళనకు గురి చేసింది.

టోల్ ప్లాజా వద్ద ఆలస్యం, ఫాస్టాగ్ సమస్యలు, రహదారి బ్లాక్ స్పాట్స్ వద్ద జాగ్రత్త చర్యలు లేకపోవడం వల్ల వాహనదారులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.


