సాక్షి, హైదరాబాద్: నగర పోలీస్ శాఖలో ఓ ఎస్సై నిర్వాకం తీవ్ర కలకలం రేపుతోంది. బెట్టింగ్ వ్యసనంతో చేసిన అప్పులు తీర్చేందుకు ఏకంగా తన సర్వీస్ తుపాకీతో పాటు, ఓ కేసులో స్వాధీనం చేసుకున్న బంగారాన్ని తాకట్టు పెట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అంబర్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న ఎస్సై భాను ప్రకాశ్ బరితెగింపు పోలీస్ శాఖ ప్రతిష్టకు మచ్చ తెచ్చేలా మారింది.
వివరాల్లోకి వెళ్తే, ఎస్సై భాను ప్రకాశ్ బెట్టింగ్‌లకు బానిసై భారీగా అప్పుల పాలైనట్లు తెలుస్తోంది. ఈ ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేందుకు అడ్డదారులు తొక్కాడు. ఓ రికవరీ కేసులో(ఈ ఏడాది జనవరిలో జరిగింది) భాగంగా స్వాధీనం చేసుకున్న ఐదు తులాల బంగారాన్ని తన సొంత అవసరాలకు వాడుకున్నట్లు విచారణలో తేలింది. ఈ విషయం వెలుగులోకి రావడంతో ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు.
అంతేకాకుండా, భాను ప్రకాశ్ వద్ద ఉండాల్సిన సర్వీస్ గన్ కనిపించకపోవడంతో ఉన్నతాధికారులకు అనుమానం వచ్చింది. ఈ విషయంపై వారు నిలదీయగా, ఎస్సై నుంచి సరైన సమాధానం రాలేదు. దీంతో లోతుగా విచారించగా, బంగారంతో పాటే తుపాకీని కూడా ఓ బ్రోకర్ వద్ద తాకట్టు పెట్టి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఈ ఘటన పోలీస్ శాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలాంటి పనులకు పాల్పడటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ఎస్సై భాను ప్రకాశ్‌ను టాస్క్‌ఫోర్స్ పోలీసులు తమ అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.


