సబ్‌ కమిటీ నిర్ణయంతోనే ‘హిల్ట్‌ పి’ | Bhatti says telangana land policy is transparent accuses brs govt of acting on self interest | Sakshi
Sakshi News home page

సబ్‌ కమిటీ నిర్ణయంతోనే ‘హిల్ట్‌ పి’

Nov 26 2025 5:41 AM | Updated on Nov 26 2025 5:41 AM

Bhatti says telangana land policy is transparent accuses brs govt of acting on self interest

కాలుష్యకారక పరిశ్రమలను తరలించేందుకే పాలసీ

తద్వారా సమకూరే ఆదాయాన్ని అభివృద్ధి, సంక్షేమానికి ఖర్చు చేస్తాం

విలేకరుల సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

ప్రభుత్వానికి ఆర్థిక వనరులు సమకూరొద్దనే పాలసీపై బీఆర్‌ఎస్‌ ఆరోపణలు: మంత్రి శ్రీధర్‌బాబు

సాక్షి, హైదరాబాద్‌: ఆర్థిక వనరుల సమీకరణ కోసం ఏర్పా టైన మంత్రివర్గ ఉపసంఘం సిఫారసుల మేరకే పరిశ్రమల భూముల బదలాయింపు విధానం (హిల్ట్‌ పాలసీ) రూపొందించామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. కొందరు పారిశ్రామికవేత్తలకే లబ్ధి చేకూర్చకుండా అందరికీ లబ్ధి చేకూరేలా తెచ్చిన ఏకీకృత విధానాన్ని తప్పుపట్టడం సరికాదన్నారు. హైదరాబాద్‌లోని కాలుష్యకారక పరిశ్రమలను ఔటర్‌ రింగ్‌రోడ్డు వెలుపలికి తరలించడాన్ని వేగవంతం చేసేందుకే కొత్త పాలసీ తెచ్చినట్లు చెప్పారు. మంగళవారం కేబినెట్‌ సమావేశం అనంతరం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు.

మంత్రివర్గ ఉపసంఘం సభ్యులైన శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, జూపల్లి కృష్ణారావుతోపాటు ఇతర మంత్రులు వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ కూడా మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ‘హైదరాబాద్‌ విస్తరణతో 50 ఏళ్ల క్రితం శివారులోని పారిశ్రామికవాడల చుట్టూ ప్రస్తుతం జనావా సాలు ఏర్పడ్డాయి. దీంతో ఢిల్లీ తరహాలో కాలుష్య సమస్య తో సతమతం కారాదనే ఉద్దేశంతో కాలుష్యకారక పరిశ్రమ లను ఓఆర్‌ఆర్‌ వెలుపలికి తరలించాలని దశాబ్దాలుగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాలు ప్రయత్నిస్తూ వస్తున్నాయి.

ఈ ప్రయత్నాల కొనసాగింపులో భాగంగానే కొత్త పాలసీ తెచ్చాం. తద్వారా సమకూరే ఆదాయాన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఉపయోగిస్తాం. ఇండస్ట్రియల్‌ ల్యాండ్‌ కన్వర్షన్‌ అంశంపై ఉన్నతాధికారులతో లోతుగా విశ్లేషించాం. పారిశ్రామికవర్గాలతోనూ మాట్లాడటంతోపాటు కేబినెట్‌ లో సుదీర్ఘంగా చర్చించాం. బీఆర్‌ఎస్‌ నేతల మాదిరిగా కొందరి కోసం ఇండస్ట్రియల్‌ ల్యాండ్‌ కన్వర్షన్‌ చేయట్లేదు’ అని భట్టి స్పష్టం చేశారు. భూ బదలాయింపునకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామన్నారు.

బీఆర్‌ఎస్‌ హయాంలో కేటాయింపులపై విచారణ: శ్రీధర్‌బాబు
బీఆర్‌ఎస్‌ హయాంలో ఇతర అవసరాల కోసం మార్పిడి చేసిన పారిశ్రామిక భూ బదలాయింపులపై విచారణ జరుపు తామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రకటించారు. ‘గతంలో పారిశ్రామిక భూముల బదలాయింపు కోసం బీఆర్‌ఎస్‌ ఇచ్చిన జీవోల్లోనూ దరఖాస్తుకు 3 రోజు ల గడువు విధించారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కూడా రూ. 40 వేల కోట్లను ఈ విధానంతో సమీకరిస్తామని చెప్పింది. ప్రభుత్వానికి వనరులు సమకూరవద్దనేది బీఆర్‌ఎస్‌ ఉద్దేశం. కేబినెట్‌ సబ్‌ కమిటీ సభ్యుడైన నాకు పాలసీ గురించి తెలియదనడం సరికాదు’ అని శ్రీధర్‌బాబు పేర్కొన్నారు.

మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయమే: ఉత్తమ్‌
‘సుమారు ఏడాదిన్నరపాటు చర్చించి మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చిన ప్రతిపాదనల మేరకే హిల్ట్‌ పాలసీని కేబినెట్‌లో చర్చించి ఆమోదించాం. పారిశ్రామికవర్గాలతో చర్చించాక ఖజానాకు ఆదాయం సమకూరేలా 30 శాతం, 50 శాతం పేరిట రెండు శ్లాబ్‌లు నిర్ణయించాం. కేబినెట్‌ సబ్‌ కమిటీ నిర్ణయం మేరకే కొత్త పాలసీ తెచ్చినా బీఆర్‌ఎస్‌ నేతలు మాపై బట్టకాల్చి మీద వేస్తున్నారు’ అని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగు కోసం చేస్తున్న ప్రయత్నాలను సీఎం, ఆయన సోదరులకు అంటగట్టడం సరికాదన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement