breaking news
Economic resource
-
సబ్ కమిటీ నిర్ణయంతోనే ‘హిల్ట్ పి’
సాక్షి, హైదరాబాద్: ఆర్థిక వనరుల సమీకరణ కోసం ఏర్పా టైన మంత్రివర్గ ఉపసంఘం సిఫారసుల మేరకే పరిశ్రమల భూముల బదలాయింపు విధానం (హిల్ట్ పాలసీ) రూపొందించామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. కొందరు పారిశ్రామికవేత్తలకే లబ్ధి చేకూర్చకుండా అందరికీ లబ్ధి చేకూరేలా తెచ్చిన ఏకీకృత విధానాన్ని తప్పుపట్టడం సరికాదన్నారు. హైదరాబాద్‌లోని కాలుష్యకారక పరిశ్రమలను ఔటర్ రింగ్‌రోడ్డు వెలుపలికి తరలించడాన్ని వేగవంతం చేసేందుకే కొత్త పాలసీ తెచ్చినట్లు చెప్పారు. మంగళవారం కేబినెట్ సమావేశం అనంతరం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు.మంత్రివర్గ ఉపసంఘం సభ్యులైన శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావుతోపాటు ఇతర మంత్రులు వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కూడా మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ‘హైదరాబాద్ విస్తరణతో 50 ఏళ్ల క్రితం శివారులోని పారిశ్రామికవాడల చుట్టూ ప్రస్తుతం జనావా సాలు ఏర్పడ్డాయి. దీంతో ఢిల్లీ తరహాలో కాలుష్య సమస్య తో సతమతం కారాదనే ఉద్దేశంతో కాలుష్యకారక పరిశ్రమ లను ఓఆర్ఆర్ వెలుపలికి తరలించాలని దశాబ్దాలుగా కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు ప్రయత్నిస్తూ వస్తున్నాయి.ఈ ప్రయత్నాల కొనసాగింపులో భాగంగానే కొత్త పాలసీ తెచ్చాం. తద్వారా సమకూరే ఆదాయాన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఉపయోగిస్తాం. ఇండస్ట్రియల్ ల్యాండ్ కన్వర్షన్ అంశంపై ఉన్నతాధికారులతో లోతుగా విశ్లేషించాం. పారిశ్రామికవర్గాలతోనూ మాట్లాడటంతోపాటు కేబినెట్ లో సుదీర్ఘంగా చర్చించాం. బీఆర్ఎస్ నేతల మాదిరిగా కొందరి కోసం ఇండస్ట్రియల్ ల్యాండ్ కన్వర్షన్ చేయట్లేదు’ అని భట్టి స్పష్టం చేశారు. భూ బదలాయింపునకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామన్నారు.బీఆర్ఎస్ హయాంలో కేటాయింపులపై విచారణ: శ్రీధర్బాబుబీఆర్ఎస్ హయాంలో ఇతర అవసరాల కోసం మార్పిడి చేసిన పారిశ్రామిక భూ బదలాయింపులపై విచారణ జరుపు తామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రకటించారు. ‘గతంలో పారిశ్రామిక భూముల బదలాయింపు కోసం బీఆర్ఎస్ ఇచ్చిన జీవోల్లోనూ దరఖాస్తుకు 3 రోజు ల గడువు విధించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా రూ. 40 వేల కోట్లను ఈ విధానంతో సమీకరిస్తామని చెప్పింది. ప్రభుత్వానికి వనరులు సమకూరవద్దనేది బీఆర్ఎస్ ఉద్దేశం. కేబినెట్ సబ్ కమిటీ సభ్యుడైన నాకు పాలసీ గురించి తెలియదనడం సరికాదు’ అని శ్రీధర్‌బాబు పేర్కొన్నారు.మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయమే: ఉత్తమ్‘సుమారు ఏడాదిన్నరపాటు చర్చించి మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చిన ప్రతిపాదనల మేరకే హిల్ట్ పాలసీని కేబినెట్లో చర్చించి ఆమోదించాం. పారిశ్రామికవర్గాలతో చర్చించాక ఖజానాకు ఆదాయం సమకూరేలా 30 శాతం, 50 శాతం పేరిట రెండు శ్లాబ్‌లు నిర్ణయించాం. కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం మేరకే కొత్త పాలసీ తెచ్చినా బీఆర్ఎస్ నేతలు మాపై బట్టకాల్చి మీద వేస్తున్నారు’ అని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగు కోసం చేస్తున్న ప్రయత్నాలను సీఎం, ఆయన సోదరులకు అంటగట్టడం సరికాదన్నారు. -
‘భారం’ ప్రజలపైనే!
కర్నూలు(అర్బన్): ఆర్థిక వనరులను పెంపొందించుకునేందుకు ప్రభుత్వం ప్రజలపైనే భారం మోపుతోంది. ప్రధానంగా రిజిస్ట్రేషన్ల శాఖపై దృష్టి సారించింది. భూముల ధర పెంచడం ద్వారా ఆదాయం రాబట్టేందుకు నిర్ణయించింది. ఆగస్టు 1వ తేదీ నుంచి సవరించిన ధరలను అమల్లోకి తీసుకొచ్చేందుకు ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆ మేరకు జిల్లా రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు కసరత్తు పూర్తి చేసి ఉన్నతాధికారుల అనుమతికి నివేదిక పంపారు. ఇందుకు సంబంధించిన ఫైలు ముఖ్యమంత్రి వద్దకు వెళ్లినట్లు సమాచారం. పెంపు భారం అందరిపై వేస్తే ప్రభుత్వంపై పూర్తి స్థాయిలో వ్యతిరేకత తప్పదనే ఉద్దేశంతో ముందుగా మున్సిపల్ ప్రాంతాల్లో మాత్రమే పెంపునకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో జిల్లాలోని కర్నూలు నగరపాలక సంస్థతో పాటు నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూరు, డోన్, నందికొట్కూరు మున్సిపాలిటీలు.. గూడూరు, ఆత్మకూరు, ఆళ్లగడ్డ నగర పంచాయతీల్లో భూముల రేట్లను పెంచాలని నిర్ణయించారు. అయితే ఈ ప్రాంతాల్లో 0 నుంచి 30 శాతం వరకు పెంచేందుకు ఆయా ప్రాంతాలను బట్టి అధికారులు ధరలను నిర్ణయించినట్లు సమాచారం. పెంచిన రేట్లపై నేటి(గురువారం) సాయంత్రానికి స్పష్టత రానుంది. ప్రాంతాన్ని బట్టి చదరపు గజానికి రూ.1000 నుంచి రూ.2వేల వరకు పెంపు ఉండొచ్చని అధికారులు పేర్కొంటున్నారు. ఇదిలాఉండగా భూముల ధరతో పాటు రిజిస్ట్రేషన్ చార్జీలు పెరగనున్నాయనే సమాచారంతో ప్రజలు క్రయవిక్రయాలు జోరుగా సాగిస్తున్నారు. ఫలితంగా రిజిస్ట్రార్ కార్యాలయాలకు తాకిడి పెరిగింది. గత నెల ఆషాడం కావడం.. ప్రస్తుతం శ్రావణ మాసం మొదలవడంతో లావాదేవీలు జోరందుకున్నాయి. జిల్లాలోని కర్నూలు, నంద్యాల పరిధిలోని రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ ఆర్థిక సంవత్సరం మూడు నెలలకు రూ.3,889.07 లక్షలు లక్ష్యం కాగా.. ఇప్పటికే రూ.2483.18 లక్షల పురోగతి సాధించినట్లు అధికారుల ద్వారా తెలిసింది. నగరపాలక సంస్థలో పెరగనున్న రేట్లు నగరపాలక సంస్థలో ఇటీవల విలీనమైన స్టాంటన్‌పురం, మామిదాలపాడు, మునగాలపాడు గ్రామ పంచాయతీలతో పాటు జోహరాపురంలోని ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ చార్జీలు స్వల్పంగా పెరగనున్నాయి. స్టాంటన్‌పురం గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రాంతాల్లో ప్రస్తుతం ఒక చదరపు గజం రూ.2,500 ఉండగా.. చార్జీలు పెరిగితే రూ.5 వేలకు చేరుకోనుంది. 45వ వార్డు పరిధిలో రూ.7 వేల నుంచి రూ.8 వేలు.. మామిదాలపాడులో రూ.2,500 నుంచి రూ.3 వేలు.. మునగాలపాడులో రూ.700 నుంచి రూ.1000 వరకు, జోహరాపురంలోని పలు ప్రాంతాల్లో రూ.1200 నుంచి రూ.3 వేలు.. ప్రకాష్‌నగర్, బంగారుపేటలో రూ.7 వేల నుంచి రూ.8 వేలకు ధర పెరగనుంది. నగరంలోని మిగిలిన ప్రాంతాల్లో చార్జీల పెంపు ఉండకపోవచ్చని తెలుస్తోంది. మిగిలిన అన్ని మున్సిపల్, నగర పంచాయతీల్లో భూముల ధర పెంపు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేయనుంది


