సాక్షి, మేడ్చల్ జిల్లా: పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఇన్ఫోసిస్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న 26 ఏళ్ల పవన్ కళ్యాణ్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు.
పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. గుంటూరు జిల్లా సంగడిగుంట ఐపీడీకాలనీకి చెందిన ఆటో డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి కుమారుడు పవన్ కళ్యాణ్ రెడ్డి, పోచారం ఇన్ఫోసిస్ సమీపంలోని సంస్కృతి టౌన్‌షిప్‌లో స్నేహితులతో కలిసి నివసిస్తూ గత నాలుగేళ్లుగా ఇన్ఫోసిస్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే పవన్ కళ్యాణ్ ఒక యువతిని ప్రేమించేవాడు.
ఇద్దరూ పెళ్లి చేసుకునే ఉద్దేశంతో శారీరకంగా దగ్గరైనట్లు తెలుస్తోంది. అయితే ఇటీవల ఆమె ఫోన్‌లో మరో వ్యక్తితో తీసుకున్న ఫొటోలు కనిపించడంతో పవన్ కళ్యాణ్ తీవ్రంగా అనుమానపడ్డాడు. సదరు ఫొటోలను యువతి కుటుంబ సభ్యులకు పంపించాడు. దీంతో ఆ యువతి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో పవన్ కళ్యాణ్‌పై ఫిర్యాదు చేసింది.
ఆ ఘటన తర్వాత పవన్ కళ్యాణ్ రెండు రోజులుగా ఆమెకు కాల్ చేసినా స్పందించకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. స్నేహితులు ఈ విషయం అతని తండ్రికి తెలియజేయడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన నగరానికి చేరుకున్నారు.
ప్రేమించిన యువతి మోసగించిందన్న బాధతోనే నా కుమారుడు ప్రాణాలు తీసుకున్నాడు అంటూ మృతుడి తండ్రి పోచారం ఐటీ కారిడార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.


