సాక్షి, హైదరాబాద్: నగరంలో మరో నకిలీ అధికారి సంచలనం రేపాడు. ఫిల్మ్‌నగర్ పోలీసుల పరిధిలో 2 ఏళ్లుగా తాను ఐఏఎస్, ఐపీఎస్, ఎన్‌ఐఏ అధికారి అంటూ ప్రజలను మోసం చేస్తున్న శశికాంత్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. షేక్‌పేట్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో అతడిని పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు.
నకిలీ అధికారిగా కనిపించేందుకు శశికాంత్ ప్రత్యేకంగా బాడీగార్డులు, వాకీ టాకీలతో పాటు సైరన్ అమర్చిన ఓ కారు ఉపయోగించినట్లు దర్యాప్తులో బయటపడ్డాయి. అధికారులను అనుకరించే విధంగా ఫేక్ ఐఏఎస్, ఐపీఎస్, ఎన్‌ఐఏ ఐడీ కార్డులు తయారు చేసి, అధికారిక లేఖల వరకు ఫోర్జరీ చేసినట్లు పోలీసులు తెలిపారు.
తాను డిప్యూటీ కమిషనర్ (మైన్స్)గా నమ్మపలికి పలువురు వ్యాపారుల వద్ద డబ్బులు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా గోల్డ్ జిమ్ మేనేజింగ్ డైరెక్టర్ నుండి ఏకంగా రూ.10.50 లక్షలు వసూలు చేసినట్టు సమాచారం.
ఈ మోసాల్లో శశికాంత్‌తో పాటు A–2 ప్రవీణ్, A–3 విమల్ ప్రస్తుతం పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. కాగా అరెస్ట్ సమయంలో రెండు మొబైల్ ఫోన్లు, ఆరు సిమ్ కార్డులు, రెండు వాకీ టాకీలు, నకిలీ ఐడీలు వంటి సామగ్రిని పోలీసులు సీజ్ చేశారు.
దీంతో తాము అధికారులమంటూ ఎవరైనా డబ్బు ఇవ్వాల్సిందిగా కోరితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని వెస్ట్ జోన్ డీసీపీ ప్రజలకు సూచించారు. సదరు ఘటనపై ఫిల్మ్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు.
ఇదీ చదవండి: ప్రేమించిన యువతి మోసం.. పవన్ కళ్యాణ్ ఆత్మహత్య


