ఆటో డ్రైవర్లు...డెలివరీ బాయ్స్‌! | - | Sakshi
Sakshi News home page

ఆటో డ్రైవర్లు...డెలివరీ బాయ్స్‌!

Nov 26 2025 11:10 AM | Updated on Nov 26 2025 11:10 AM

ఆటో డ్రైవర్లు...డెలివరీ బాయ్స్‌!

ఆటో డ్రైవర్లు...డెలివరీ బాయ్స్‌!

వీళ్లే మనీమ్యూల్స్‌ను వెతికి పట్టుకునే దళారులు

సాక్షి, సిటీబ్యూరో: వివిధ రకాలైన సైబర్‌ నేరాలు చేసే ఉత్తరాది ముఠాలు నగరంలో ఉన్న ఆటో డ్రైవర్లు, డెలివరీ బాయ్స్‌ను దళారులుగా మార్చుకుంటున్నాయి. వీరి ద్వారా అమాయకులకు ఎర వేసి బ్యాంకు ఖాతాలు తెరిపిస్తున్నాయి. సహకరించిన వారికి నామమాత్రపు మొత్తం చెల్లిస్తూ ఆ ఖాతాలను వినియోగించి రూ.కోట్లు కొల్లగొడుతున్నాయి. ఇలాంటి ఓ ముఠాకు చెందిన ఎనిమిది మంది నిందితులను ఈస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌, సైబర్‌ క్రైమ్‌ పోలీసులు సంయుక్తంగా పట్టుకున్నారు. మంగళవారం అదనపు సీపీ (నేరాలు) శ్రీనివాసులు డీసీపీ, అదనపు డీసీపీలు వి.అరవింద్‌ బాబు, అందె శ్రీనివాసరావులతో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.

ఆటో ప్రయాణంతో పరిచయం...

బోడుప్పల్‌కు చెందిన పూజారి జంగయ్య వృత్తిరీత్యా ఆటోడ్రైవర్‌. చిలకలగూడ, సికింద్రాబాద్‌ సహా వివిధ ప్రాంతాల్లో ఆటో నడుపుతూ ఉంటాడు. రాజస్థాన్‌కు చెందిన కన్నయ్య 2023 అక్టోబర్‌లో హైదరాబాద్‌ వచ్చినప్పుడు సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ వద్ద జంగయ్య ఆటో ఎక్కాడు. బేగంపేట వరకు ప్రయాణించే క్రమంలో జంగయ్య ఆర్థిక స్థితిగతుల్ని ఆరా తీశాడు. తాను ఆటో డ్రైవర్‌గా రోజుకు రూ.500 నుంచి 600 వరకు సంపాదిస్తానని అతడు చెప్పడంతో జాలి చూపించాడు. తాము గేమింగ్‌ యాప్స్‌ లావాదేవీలు చేస్తుంటామని, దీనికోసం బ్యాంకు ఖాతాలు అవసరం అవుతాయని కన్నయ్య చెప్పాడు. ఓ ఖాతా తెరిచి ఇస్తే రూ.10 వేల చొప్పున చెల్లిస్తామని చెప్పడంతో జంగయ్య అంగీకరించాడు. దీంతో ఇద్దరూ ఫోన్‌ నెంబర్లు ఇచ్చిపుచ్చుకున్నారు.

కుటుంబంతో మొదలెట్టి ఏజెంట్ల వరకు..

దాదాపు నెల రోజుల తర్వాత మరోసారి కన్నయ్య నగరానికి రావడంతో ఇద్దరూ ప్యారడైజ్‌ వద్ద కలుసుకున్నారు. ఆసమయంలో ఓ ప్రీ యాక్టివేటెడ్‌ సిమ్‌ కార్డు ఇచ్చిన అతగాడు ఆ నెంబర్‌ ఆధారంగా బ్యాంకు ఖాతా తెరిచి ఇవ్వాలన్నాడు. అందుకుగాను జంగయ్యకు రూ.10 వేలు ఇచ్చిన కన్నయ్య ఖాతాకు సంబంధించిన వివరాలు తీసుకున్నాడు. ఆపై జంగయ్య ఇదే పంథాలో తన భార్య, తల్లి, బంధువులు, స్నేహితుల పేర్లతో ఫెడరల్‌ బ్యాంక్‌, కర్ణాటక బ్యాంక్‌, ఉత్కర్ష్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర, మహావీర్‌ బ్యాంక్‌, తమిళనాడు మర్కంటైల్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌, కరూర్‌ వైశ్యా బ్యాంక్‌ల్లో ఖాతాలు తెరిచి కన్నయ్యకు ఇచ్చి డబ్బు తీసుకున్నాడు. కొన్నాళ్లకు ఈ దందాను వ్యవస్థీకృతంగా చేయాలని నిర్ణయించుకున్న జంగయ్య తన బంధువైన బోడుప్పల్‌ వాసి గురుదాస్‌ సునీల్‌ కుమార్‌తో కలిసి మరికొందరు అమాయకులను మనీ మ్యూల్స్‌గా మార్చి ఖాతాలు తెరిచాడు.

ప్రధాన సూత్రధారుల పరిచయంతో...

తాను అందిస్తున్న బ్యాంక్‌ ఖాతాలను కన్నయ్య రాజస్థాన్‌కే చెందిన పూనమ్‌, రమేష్‌లకు ఇస్తున్నాడని జంగయ్య తెలుసుకున్నాడు. దీంతో అతడిని పక్కన పెట్టి తానే ఆ ఇద్దరికీ టచ్‌లోకి వెళ్లాడు. ఆపై కొరియర్‌ డెలివరీ బాయ్‌ పర్లపల్లి నిఖిల్‌, ఆటోడ్రైవర్‌ గంటి మణిదీప్‌లతో ముఠా ఏర్పాటు చేశాడు. వీరంతా కలిసి ఆయా ప్రాంత్లాలో ఉన్న చిరుద్యోగులు, నిరుద్యోగులకు ఎర వేసి వారితో బ్యాంకు ఖాతాలు తెరిపించారు. కొన్నాళ్లకు జంగయ్య నుంచి వేరుపడిన నిఖిల్‌, మణిదీప్‌ సొంతంగా హార్డ్‌వేర్‌ టెక్నీషియన్‌ బొల్లు బాలు, కొరియర్‌ డెలివరీ బాయ్‌ పోలాస్‌ ప్రవీణ్‌లతో జట్టు కట్టి దందా కొనసాగించారు. వీరికి కరూర్‌ వైశ్యా బ్యాంక్‌లో బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ ఎగ్జిక్యూటివ్‌గా పని చేసిన బిలావత్‌ బాలాజీ నాయక్‌ సహకరించాడు. సూత్రధారుల నుంచి ఒక్కో ఖాతాకు రూ.10 వేలు తీసుకునే వీరు బ్యాంకు ఖాతా తెరవడానికి తమ ఆధార్‌, పాన్‌కార్డులు ఇచ్చే వారికి రూ.6 వేలు చొప్పున చెల్లిస్తున్నారు. ఇలా మొత్తం 127 బ్యాంక్‌ ఖాతాలు తెరిచి సూత్రధారులకు అందించారు.

అమాయకులకు ఎర వేసి వారితో బ్యాంక్‌ ఖాతాలు

ఉత్తరాదిలో ఉన్న ప్రధాన సూత్రధారులకు సరఫరా

గుట్టురట్టు చేసిన ఈస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు

ఎనిమిది మంది అరెస్ట్‌, పరారీలో మరో ముగ్గురు

చిలకలగూడలో దొరికిన ఆధారం...

జంగయ్య కొన్నాళ్ల క్రితం చిలకలగూడకు చెందిన ఓ వ్యక్తిని సంప్రదించి బ్యాంకు ఖాతా తెరిచి ఇస్తే రూ.7 వేలు ఇస్తానని చెప్పాడు. ఇతడి ద్వారా విషయం ఈస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌కు చేరింది. దీంతో ఇన్‌స్పెక్టర్‌ చంద్రశేఖర్‌ నేతృత్వంలో ఎస్సైలు పి.నాగరాజు, ఎం.అనంతాచారి, ఎస్‌.కరుణాకర్‌రెడ్డిలతో కూడిన బృందం రంగంలోకి దిగింది. లోతుగా ఆరా తీసి ఎనిమిది మంది నిందితులను పట్టుకుంది. వీరు ఇచ్చిన బ్యాంకు ఖాతాల్లో బాధితులకు సంబంధించిన రూ.24.10 కోట్లు డిపాజిట్‌ కాగా... సూత్రధారులు రూ.23.99 కోట్లు డ్రా చేసుకున్నారు. వీటికి సంబంధించి రాచకొండ, రాజేంద్రనగర్‌లతో పాటు కర్ణాటక, రాజస్థాన్‌ల్లో ఆరు కేసులు నమోదై ఉన్నాయి. మరో 21 పిటిషన్లు సైబర్‌ పోర్టల్‌లో ఉన్నాయి. వీరు అందించిన మ్యూల్‌ ఖాతాల ద్వారా మరిన్ని నేరాలు జరిగి ఉంటాయని అనుమానిస్తున్న పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. తదుపరి చర్యల నిమిత్తం నిందితులను సిటీ సైబర్‌ క్రైమ్‌ ఠాణాకు అప్పగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement