లెక్కల్లో మార్కులు రావడం లేదని..
భవనం పైనుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య
లాలాపేట: గణిత శాస్త్రంలో ఎక్కువ మార్కులు రాకపోవడంతో పాటు ఈ విషయమై తండ్రి మందలించినందుకు మనస్తాపానికి లోనైన 10 తరగతి విద్యార్థిని అపార్ట్‌మెంట్‌పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మంగళవారం ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్టేషన్ పరిధిలోని హబ్సిగూడలో మంగళవారం చోటు చేసుకుంది. ఓయూ పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. హబ్సిగూడ స్ట్రీట్ నెంబర్ 1లోని జ్యోతి ఎమరాల్డ్ అపార్టుమెంట్‌లో నివాసం ఉంటున్న సాప్ట్‌వేర్ ఇంజినీరు సుకుమార్‌రెడ్డి కుమార్తె శ్రీ వైష్ణవి(15) హబ్సిగూడలోని శ్రీ చైతన్య స్కూల్‌లో 10వ తరగతి చదువుతోంది. సోమవారం రాత్రి వైష్ణవికి మ్యాథమెటిక్స్‌లో తక్కువ మార్కులు వచ్చాయని తండ్రి మందలించాడు. మెథమెటిక్స్‌లో మంచి మార్కులు తెచ్చుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుందని బాగా చదువుకోవాలని సూచించారు. దీంతో ఒత్తిడికి లోనైన శ్రీ వైష్ణవి మంగళవారం ఉదయం అపార్టుమెంట్ భవనం నాల్గో అంతస్తు నుంచి కింది దూకింది. తీవ్రంగా గాయడిన ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న ఓయూ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


