అనూహ్యం..అనుమానాస్పదం
మిస్టరీగానే శాలిబండ అగ్ని ప్రమాద ఘటన
గౌలిపురా: పాతబస్తీ శాలిబండలో సోమవారం రాత్రి గోమతి ఎలక్ట్రానిక్ షోరూంలో చోటు చేసుకున్న అగ్నిప్రమాద ఘటనలో మిస్టరీ వీడలేదు. భారీ పేలుడుతో పాటు మంటలు చెలరేగడంతో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందగా, తొమ్మిది మంది గాయపడ్డారు. షోరూం యజమాని శివకుమార్ బన్సాల్ 80 శాతం కాలిన గాయాలతో డీఆర్‌డీవో అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దుకాణంలో పనిచేసే కార్మికులు గణేష్ విజయ్ కుమార్, కార్తీక్ మహదేవ్ ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. షోరూం ముందు నుంచి ఆటోలో వెళుతున్న డ్రైవర్ మహ్మద్ గౌస్, ప్రయాణికుడు సయ్యద్ సాబెర్, కారు డ్రైవర్ మణికంఠ, మరో ఇద్దరు చికిత్స అనంతరం డిశ్చార్జి అయ్యారు. ప్రమాదానికి సంబంధించి దుకాణ యజమాని బన్సాల్ మంగళవారం తెల్లవారుజామున మొఘల్‌పురా డీఐ అశోక్‌కు వాంగ్మూలం ఇచ్చాడు. సోమవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో శివకుమార్ కౌంటర్ వద్ద కూర్చుని ఉండగా ఒక్కసారిగా షాప్ లోపలి నుంచి భారీ పేలుడు శబ్ధం వినిపించింది. ఏమిటని ఆరా తీసేలోపే మళ్లీ పేలుళ్లు రావడంతో పాటు ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు ఎగిసి పడటంతో తనకు తీవ్ర గాయాలైనట్లు తెలిపాడు. పేలుడు ధాటికి దుకాణం షట్టర్లు 100 మీటర్ల దూరంలోని అవతలి రోడ్డుపై కార్లపై పడిపోయాయి. రోడ్డుపై ఎక్కడ చూసినా పగిలిన గాజు ముక్కలు నిండిపోయాయి. షోరూం సమీపంలో ఉన్న 1904 నాటి క్లాక్ టవర్ సైతం పెచ్చులూడింది.
ఆధారాలు సేకరించిన
క్లూస్ టీం, ఎన్‌ఐఏ అధికారులు
భారీ పేలుడు నేపథ్యంలో మంగళవారం ఉదయం ఎన్‌ఐఏ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. వీరితో క్లూస్ టీమ్ హైదరాబాద్ ఇన్‌ఛార్జి వెంకన్న షోరూంను పరిశీలించి శాంపిళ్లను సేకరించారు. ఎలక్ట్రానిక్ షోరూం కావడంతో పేలుడు స్వభావం కలిగిన వస్తువుల కారణంగా ప్రమాదం చోటు చేసుకుందా...? మరేదైనా విద్రోహ కోణం ఉందా...? అనే కోణంలో అధికారులు తనిఖీలు చేపట్టారు. జాయింట్ పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్, దక్షిణ మండలం డీసీపీ ఖరే కిరణ్ ప్రభాకర్, ఏసీపీ సీహెచ్.చంద్రశేఖర్, మొఘల్‌పురా ఇన్‌స్పెక్టర్ శ్రీను, అదనపు ఇన్‌స్పెక్టర్ అశోక్ పరిస్థితిని సమీక్షించారు.
స్థానికుల భయాందోళన
గోమతి షోరూంలో పేలుడుతో రోడ్డుపై వెళుతున్న వాహనదారులతో పాటు స్థానికులు భయకంపితులయ్యారు. దాదాపు 100 మీటర్ల వరకు భూమి అదిరిపోయింది. పెద్ద ఎత్తున మంటలు, దట్టమైన పొగలు వ్యాపించడంతో ఏమి జరుగుతుందో తెలియక బెంబేలెత్తారు. షోరూం వెనుక ఉన్న భవనానికి కూడా మంటలు వ్యాపించడంతో భవనంలోని ప్రజలు అతికష్టంపై కిందికి దిగి దూరంగా పరుగులు తీశారు. కొందరు పక్కన ఉన్న ప్రహరీ దూకి ప్రాణాలు దక్కించుకున్నారు. కాగా షోరూం వెనుక ఉన్న ఇంటి కుటుంబ సభ్యులు ప్రాణభయంతో పరుగులు తీయగా, ఇంట్లో ఉన్న సెల్‌ఫోన్లు, నగదు చోరీకి గురయ్యాయని పక్కింటి మహిళలు పోలీసుల దృష్టికి తీసుకొచ్చారు.
సీఎన్‌జీ కారులో పేలుడు సంభవించలేదు..
కుషాయిగూడకు చెందిన మోహన్ వంశీ ఎవరెస్ట్ ఫ్లీట్ కంపెనీ వద్ద వ్యాగనార్ కారు ను అద్దెకు తీసుకున్నాడు. ఖమ్మం జిల్లాకు చెందిన మణికంఠను డ్రైవర్‌గా నియమించుకుని క్యాబ్‌గా తిప్పుతున్నాడు. శాలిబండ సమీపం వరకు ప్యాసింజర్‌ను వదిలి....మరో ప్యాసింజర్ కోసం గోమతి షాప్ ముందు ఆగాడు. అదే సమయంలో ఒక్కసారిగా మంటలు వ్యాపంచడంతో కారులోనుంచి బయటికి దూకి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. కారు పల్టీ కొట్టి పూర్తిగా కాలిపోవడంతో కారులోని సీఎన్‌జీ సిలిండర్ పేలి ఉండవచ్చునని పోలీసులు భావించారు. మంగళవారం ఉదయం ఘటనా స్థలాన్ని పరిశీలించిన క్లూస్ టీమ్ అధికారులు కారులో సిలిండర్ పేలలేదని నిర్ధారించారు.
అర్ధరాత్రి తర్వాత ఒకరి మృతి
తొమ్మిది మందికి గాయాలు
తీవ్రంగా గాయపడిన యజమాని
ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎన్‌ఐఏ, క్లూస్‌టీమ్
అనూహ్యం..అనుమానాస్పదం


