డామిట్.. కథ అడ్డం తిరిగింది..
బంజారాహిల్స్: జూబ్లీహిల్స్‌లో నివసించే ప్రముఖ పారిశ్రామికవేత్త ఇంట్లో దోపిడీకి యత్నించిన ముఠాను జూబ్లీహిల్స్ పోలీసులు మంగళవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాల్లోకి వెళితే..జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–23లో నివసించే పారిశ్రామికవేత్త అజయ్‌అగర్వాల్ ఇంట్లో గుంతకల్లుకు చెందిన దయాచంద్ ఏడాదిన్నర కాలంగా సెక్యూరిటి గార్డుగా పనిచేస్తున్నాడు. ప్రతిరోజూ సనత్‌నగర్‌లోని ఫ్యాక్టరీ నుంచి డబ్బులు తీసుకుని రాత్రి ఇంటికి వచ్చే యజమాని అజయ్‌అగర్వాల్‌ను దయాచంద్ గమనిస్తుండేవాడు. అదంతా బ్లాక్ మనీ అని, దోపిడీ చేసినా ఎవరికీ చెప్పుకోలేడని భావించిన దయాచంద్ తన స్నేహితులతో కలిసి దోపిడీకి స్కెచ్ వేశాడు. ఇందులో భాగంగా గుంతకల్లుకు చెందిన తన స్నేహితులు సాయి అలియాస్ సత్య, షేక్ ఇర్ఫాన్, చరణ్, చైతన్య, కృష్ణకాంత్, గురుస్వామి తదితరులతో ముఠా ఏర్పాటు చేసి యజమాని ఇంట్లో దోపిడీకి పథకం వేశాడు. ప్రతిరోజూ రాత్రి 11 గంటల సమయంలో సనత్‌నగర్‌లోని 12 ఫ్యాక్టరీలను మూసివేసి నగదుతో యజమాని అజయ్‌అగర్వాల్ ఇంటికి వస్తాడని, ప్రతి శుక్ర, శనివారాల్లో యజమాని కొడుకు నితిన్‌అగర్వాల్ పబ్‌కు వెళ్తాడని, ఆ సమయంలో ఇంట్లో పని మనుషులను బంధించి భారీగా నగదు, నగలను దోచుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా శనివారం రాత్రి యజమాని కుమారుడు నితిన్ పబ్‌కు వెళ్లగానే వృద్ధుడైన అజయ్‌అగర్వాల్ ఇంట్లో ఒంటరిగా ఉన్నాడని, ఇదే సరైన సమయమని, ముందే వేసుకున్న పథకం ప్రకారం స్నేహితులను ఇంటికి పిలిపించాడు. అంతకు ఒక రోజు ముందు వారు యూసుఫ్‌గూడలో మూడు కత్తులు, నోట్లో కుక్కేందుకు గుడ్డలు, ప్లాస్టర్‌ను కొనుగోలు చేసి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలోని లాడ్జిలో మకాం వేసి దయాచంద్ పిలుపు కోసం ఎదురుచూస్తున్నారు. శనివారం రాత్రి దయాచంద్ ఫోన్ చేయగానే జూబ్లీహిల్స్‌కు చేరుకున్నారు. అజయ్‌అగర్వాల్ డ్రైవర్‌తో పాటు ఇంట్లో పనిచేసే నలుగురు పనివాళ్లు వేర్వేరు గదుల్లో పడుకున్నారు. మాస్క్‌లు ధరించి ముందుగా అజయ్‌అగర్వాల్ గదిలోకి వెళ్లి అతడిని తాళ్లతో బంధించి నోట్లో గుడ్డలు కుక్కి నోటికి ప్లాస్టర్ వేసేందుకు యత్నించగా ఆయన వారి నుంచి తప్పించుకుని కేకలు వేస్తూ బయటికి పరుగు తీశాడు. దీంతో పనివాళ్లు లేచి అప్రమత్తమయ్యారు. వారిని కూడా తాళ్లతో బంధించేందుకు యత్నించగా సాధ్యం కాలేదు. దీంతో నిందితులందరూ అక్కడి నుంచి పరారు కాగా సెక్యూరిటీగార్డు దయాచంద్ మాత్రం తమకేమీ తెలియనట్లు నటిస్తూ ఉండిపోయాడు. అదే సమయంలో పబ్‌నుంచి తిరిగి వస్తున్న నితిన్ పారిపోతున్న దొంగలను గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. జూబ్లీహిల్స్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. సెక్యూరిటీగార్డు ఉండే చోట మాస్క్‌ను గుర్తించిన పోలీసులు ఇదెక్కడిదని ప్రశ్నించారు. అతను పొంతనలేని సమాధానాలు చెప్పడంతో అదుపులోకి తీసుకుని విచారించగా వివరాలు వెల్లడించాడు. అతడిచ్చిన సమాచారంతో నిందితులందరినీ రైల్వేస్టేషన్‌లో అదుపులోకి తీసుకున్నారు. గురుస్వామి అనే వ్యక్తి పరారీలో ఉన్నట్లు తెలిపారు. మంగళవారం నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. తన యజమాని రోజూ ఫ్యాక్టరీల నుంచి తీసుకు వస్తున్న డబ్బు బ్లాక్‌మనీ అయ్యి ఉంటుందని, తాము కొల్లగొట్టినా పోలీసులకు చెప్పుకోలేడని భావించి ఈ పథకం వేసినట్లు ప్రధాన నిందితుడు దయాచంద్ పోలీసుల దర్యాప్తులో వెల్లడించాడు. వారి నుంచి మూడు కత్తులు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
సాక్షి,సిటీ బ్యూరో: టెక్నికల్ కోర్సు సర్టిఫికెట్ పరీక్షలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు హైదరాబాద్ జిల్లా విద్యాశాఖాధికారి ఆర్. రోహిణి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. డ్రాయింగ్, టైలరింగ్ – ఎంబ్రాయిడరీలలో లోయర్, హయ్యర్ గ్రేడ్ టెక్నికల్ సర్టిఫికేట్ కోర్సు పరీక్ష వచ్చే జనవరి, ఫిబ్రవరి నెలలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. లోయర్ గ్రేడ్ సర్టిఫికెట్ కు 7 తరగతి ఉత్తీర్ణులు అర్హులని, అలాగే సంబంధిత ట్రేడ్ లో లోయర్ గ్రేడ్ టెక్నికల్ సర్టిఫికేట్ కలిగిన వారు హయ్యర్ గ్రేడ్ పరీక్షకు అర్హులని తెలిపారు. పరీక్షా రుసుమును ప్రభుత్వ ట్రెజరీ చలాన్ ద్వారా చెల్లించాలన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు www.bse.telangana.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. డౌన్‌లోడ్ చేసిన దరఖాస్తు పత్రులను జిల్లా విద్యా అధికారి కార్యాలయంలో అందజేయాలని సూచించారు.
● పారిశ్రామికవేత్త ఇంట్లో దోపిడీకి విఫలయత్నం
● ఐదుగురు నిందితుల అరెస్టు
● పరారీలో మరొకరు


