తాగునీరు వృథా చేసినందుకు రూ. 10 వేలు జరిమానా
సాక్షి,సిటీ బ్యూరో: జలమండలి సరఫరా చేసే తాగునీటిని ఇతర అవసరాలకు వినియోగించిన వ్యక్తికి అధికారులు జరిమానా విధించారు. ఈ ఘటన బంజారాహిల్స్‌లో మంగళవారం చోటు చేసుకుంది. జలమండలి ఎండీ అశోక్ రెడ్డి బంజారా హిల్స్ ప్రధాన రహదారిపై వెళుతుండగా... రోడ్ నం. 12 లో ఓ వ్యక్తి నల్లా నీటితో కారు కడుగుతూ కనిపించారు. దీంతో ఎండీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. తాగునీటిని ఇతర అవసరాలకు వినియోగించవద్దని హెచ్చరించారు. తక్షణమే సదరు వ్యక్తికి నోటీసు అందించి, జరిమానా విధించాలని సంబంధిత మేనేజర్ ను ఆదేశించారు. ఎండీ ఆదేశాల మేరకు సదరు వ్యక్తికి రూ.10000 జరిమానా విధించారు. జలమండలి సరఫరా చేసే తాగునీరు ఇలా ఇతర అవసరాలకు వినియోగించద్ధని ఎండీ విజ్ఞప్తి చేశారు. ఎవరైనా ఇలాంటి పనులు చేస్తే.. తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


