సాక్షి, హైదరాబాద్: పాలన చేతగాని సర్కారు.. పండగ పూట జర్నలిస్టులపై కక్ష సాధింపు చర్యలకు దిగటం సిగ్గుచేటని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ సీనియర్ నేత హరీష్‌రావు అన్నారు. తెలంగాణవ్యాప్తంగా మీడియా ప్రతినిధులను, డిజిటల్ జర్నలిస్టులను పోలీసులు టార్గెట్ చేయడంపై ఆయన మండిపడ్డారు. ఎలాంటి నోటీసులు లేకుండా అరెస్టు చేయడం అక్రమమని అన్నారు.
‘‘మీ రాజకీయ వికృత క్రీడల్లో తెలంగాణ ఉద్యమకారులైన జర్నలిస్టులను బలి చేస్తారా? ఇళ్లల్లో చొరబడి అర్ధరాత్రి వేళ అరెస్టులు చేయడానికి వాళ్లేమైన తీవ్రవాదులా? జర్నలిస్టుల వరుస అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ప్రజాస్వామ్యంపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న దాడి. తెలంగాణ జర్నలిస్టుల ఆత్మగౌరవం పై పని గట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రత్యక్ష దాడి.
.. జర్నలిస్టుల అరెస్టులు, మీడియా- డిజిటల్ మీడియా పై సిట్‌లతో ఎవర్ని కాపాడుతున్నారు? ఎవరిని వేటాడుతున్నారు? మీ స్వార్థ రాజకీయాల కోసం ప్రజాస్వామ్య హననానికి పాల్పడటం దుర్మార్గం. రేవంత్ రెడ్డి.. ఇదేనా నీ ప్రజాపాలన? ఇదేనా మీరు చెప్పిన ప్రజాస్వామ్య పునరుద్ధరణ? అరెస్ట్ చేసిన జర్నలిస్టులను తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం’’ అని ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారాయన. అంతేకాదు డీజీపీ శివధర్‌రెడ్ఢికి ఫోన్ చేసి జర్నలిస్టులను విడుదల చేయాలని కోరారు.
పాలన చేతగాని సర్కారు.. పండగ పూట జర్నలిస్టులపై కక్ష్య సాధింపు చర్యలకు దిగటం సిగ్గుచేటు.
మీ రాజకీయ వికృత క్రీడల్లో తెలంగాణ ఉద్యమకారులైన జర్నలిస్టులను బలి చేస్తారా?
ఇళ్లల్లో చొరబడి అర్ధరాత్రి వేళ అరెస్టులు చేయడానికి వాళ్లేమైన తీవ్రవాదులా?
జర్నలిస్టుల వరుస అరెస్టులను తీవ్రంగా…— Harish Rao Thanneeru (@BRSHarish) January 14, 2026
ఈ అరెస్టులను తెలంగాణ పీసీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి ఖండించారు. ‘‘అర్ధరాత్రిళ్లు అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు. సదరు జర్నలిస్టులకు నోటీసులు ఇచ్చి వివరణ తీసుకుని ఉంటే బాగుండేది. జర్నలిస్టుల అరెస్టుతో యుద్ధ వాతావరణం ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. ఇది కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి మంచిది కాదు’’ అని అభిప్రాయపడ్డారు.
ఓ మంత్రి-ఐఏఎస్ అధికారిణి అంటూ.. ప్రముఖ చానెల్‌లో కథనం ప్రసారం అయ్యింది. దాని ఆధారంగా అటు సోషల్ మీడియాలో విస్తృత కథనాలు ప్రసారం అయ్యాయి. ఈ ప్రచారాన్ని తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. మంత్రి కోమటిరెడ్డి, ఇతర కాంగ్రెస్ నేతలు ఆ ప్రచారాన్ని ఖండించారు. ఈ క్రమంలో సదరు ప్రముఖ మీడియా సంస్థకు చెందిన జర్నలిస్టులను గత అర్ధరాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు.
అర్ధరాత్రి ఇంటికెళ్లి తలుపులు బద్ధలు కొట్టి మరీ అరెస్ట్ చేశారని.. ఎలాంటి ప్రొసీజర్, నోటీసులు ఫాలో కాలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో.. రాష్ట్రంలో మరికొన్ని చోట్లా పోలీసులు పాత్రికేయుల్ని టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటిదాకా పలు చానెల్స్, 40కి పైగా యూట్యూబ్ చానెల్స్‌పై పోలీసులు దృష్టిసారించినట్లు సమాచారం. అయితే అక్రమ అరెస్టులు.. పోలీసుల ప్రతాపంపై జర్నలిస్టుల సంఘాలతో పాటు పౌర హక్కుల సంఘాలు మండిపడుతున్నాయి.


