వ్యవస్థలు వైఫల్యం చెందిన వేళ.. | Telangana Government Bears Cost of Repatriating Gulf Migrants Body | Sakshi
Sakshi News home page

వ్యవస్థలు వైఫల్యం చెందిన వేళ..

Jan 14 2026 7:39 PM | Updated on Jan 14 2026 7:51 PM

Telangana Government Bears Cost of Repatriating Gulf Migrants Body

సీఎం ప్రజావాణి ఇంచార్జి డా. జి. చిన్నారెడ్డికి వినతిపత్రం

  • గల్ఫ్ మృతదేహం తరలింపు ఖర్చు భరించిన  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం
  • కంపెనీ యాజమాన్యం చేతులెత్తేసింది
  • నిధులు లేవంటూ చెప్పిన ఇండియన్ ఎంబసీ
  • రూ.10 లక్షల ప్రవాసీ బీమా ఉండి కూడా ఉపయోగం లేదు.
  • సీఎం సహాయనిధి ద్వారా రూ.1.50 లక్షల మానవీయ సాయం
  • ప్రవాసీ ప్రజావాణి ఇంచార్జి జి. చిన్నారెడ్డి, ఐఏఎస్ అధికారి దివ్యా దేవరాజన్ చొరవ

గల్ఫ్ దేశంలో మృతి చెందిన ఓ కార్మికుడి మృతదేహాన్ని భారత్‌కు తరలించేందుకు అయ్యే ఖర్చును భరించలేమని కంపెనీ యాజమాన్యం, అలాగే ఇండియన్ ఎంబసీ కూడా చేతులెత్తేసిన పరిస్థితిలో… తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి ఆ వ్యయాన్ని పూర్తిగా భరించిన అరుదైన మానవీయ ఘటన చోటు చేసుకుంది.

నిజామాబాద్ జిల్లా, నవీపేట మండలం యామ్చా గ్రామానికి చెందిన గొల్ల అబ్బులు (తొగరి అబ్బయ్య) అనే 40 ఏళ్ల కార్మికుడు,  నాలుగు నెలల క్రితం ఓమాన్ దేశంలోని సలాలా ప్రాంతంలో ఒక క్లీనింగ్ కంపెనీలో పని చేయడానికి వెళ్లాడు. యాజమాన్యం వైఖరి నచ్చక కంపెనీ నుంచి బయటకు వెళ్లిన కొంతకాలానికే, డిసెంబర్ 14న ఇబ్రి ప్రాంతంలో మృతి చెందాడు. అనుమతి లేకుండా కంపెనీ నుంచి వెళ్లిన కార్మికులను అక్కడి చట్టాల ప్రకారం ‘ఖల్లివెల్లి’ (అక్రమ నివాసి)గా పరిగణించడంతో, వారికి లభించాల్సిన కొన్ని హక్కులు, సౌకర్యాలు రద్దవుతాయి.  

ఈ నేపథ్యంలో, “అబ్బులు, కంపెనీ నుంచి వెళ్లిపోయాడు కాబట్టి అతనితో మాకు సంబంధం లేదు” అంటూ మృతదేహం తరలింపు ఖర్చును భరించబోమని కంపెనీ యాజమాన్యం స్పష్టం చేసింది. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో ఇండియన్ కమ్యూనిటీ వెల్ఫేర్ ఫండ్ (ఐసీడబ్ల్యూఎఫ్) నుంచి సహాయం అందిస్తారు. అయితే నిధుల కొరత ఉందని పేర్కొంటూ, మృతదేహం తరలింపుకు రూ.1.50 లక్షలు చెల్లించాలని మస్కట్‌లోని ఇండియన్ ఎంబసీ అధికారి ఒకరు కుటుంబానికి ఫోన్ చేసి తెలిపారు. ఆ మొత్తాన్ని చెల్లించలేని పరిస్థితిలో ఓమాన్‌లోనే అంత్యక్రియలు నిర్వహించాల్సి ఉంటుందని కూడా స్పష్టం చేశారు.

ఈ పరిస్థితుల్లో మృతుడి భార్య తొగరి చిన్న సావిత్రి తన కుమారుడు సంజయ్, యామ్చా గ్రామ సర్పంచ్ బేగారి సాయిలుతో కలిసి మంగళవారం (13.01.2026) హైదరాబాద్‌లోని సీఎం ప్రవాసీ ప్రజావాణిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరిట వినతిపత్రం సమర్పించారు. తన భర్త పార్థివదేహాన్ని స్వదేశానికి తీసుకురావడానికి అయ్యే ఖర్చును సీఎం సహాయనిధి నుంచి మంజూరు చేయాలని ఆమె వేడుకున్నారు. కాగా ఆమె ఇదివరకే డిసెంబర్ 29న మెయిల్ ద్వారా సీఎంఓ కు వినతిపత్రం పంపారు. దీనికి స్పందనగా జీఏడి ఎన్నారై విభాగం ఇండియన్ ఎంబసీకి వైర్ మెసేజ్ పంపింది.

ఇదిలా ఉండగా, అబ్బులు చిన్నాపూర్ కు చెందిన ఒక గల్ఫ్ సబ్ ఎజెంట్ కు రూ.1.20 లక్షలు చెల్లించి ఓమాన్ కు వెళ్ళాడు. ఎమిగ్రేషన్ క్లియరెన్స్ మాత్రం అస్సాం రాజధాని గౌహతి లోని ఒక రిజిస్టర్ రిక్రూటింగ్ ఏజెన్సీ ద్వారా జరిగింది. ప్రవాసీ భారతీయ బీమా యోజన (పిబిబివై) అనే రూ.10 లక్షల విలువైన ప్రమాదం బీమా పాలసీ కూడా జారీ అయింది. వలస కార్మికుడు విదేశాల్లో మరణించినప్పుడు మృతదేహాన్ని తరలించేందుకు అయ్యే ఖర్చును ప్రవాసీ పాలసీ ద్వారా పొందే అవకాశాన్ని మస్కట్ లోని ఇండియన్ ఎంబసీ ఎందుకు వినియోగించలేదన్నది పెద్ద ప్రశ్న. చట్ట ప్రకారం శవాన్ని తరలించే బాధ్యత రిక్రూటింగ్ ఏజెన్సీ తీసుకోవాలి. సమస్య 'మదద్' పోర్టల్ లో నమోదు అయిన తర్వాత కూడా ఢిల్లీలోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ విషయం గురించి సరిగా పట్టించుకోలేదని స్పష్టం అవుతున్నది.

తెలంగాణ ప్రభుత్వం నియమించిన ఎన్నారై అడ్వయిజరీ కమిటీ వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి, కమిటీ సభ్యుడు నంగి దేవేందర్ రెడ్డి, ప్రవాసీ ప్రజావాణి వాలంటీర్ మహమ్మద్ బషీర్ అహ్మద్ ఈ అంశాన్ని సీఎం ప్రజావాణి ఇంచార్జి, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డా. జి. చిన్నారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. సమస్య తీవ్రతను గుర్తించిన డా. చిన్నారెడ్డి తక్షణ చర్యలు తీసుకోవాలని సీఎం ముఖ్య కార్యదర్శి వి. శేషాద్రిని ఆదేశించారు.

చలించిన ఐఏఎస్ అధికారిణి
ఇదే అంశాన్ని సీఎం ప్రజావాణి నోడల్ అధికారి, ఐఏఎస్ అధికారిణి దివ్యా దేవరాజన్‌కు వివరించగా, పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకొని వెంటనే స్పందించారు. ఓమాన్‌కు వెళ్లిన మూడు నెలలకే అబ్బులు మృతి చెందడం, నెలరోజులుగా ఆసుపత్రి శవాగారంలో మృతదేహం ఉండిపోవడం, భర్త పార్థివదేహం కోసం గ్రామం నుంచి హైదరాబాద్ వరకు వచ్చి మొరపెట్టుకున్న భార్య పరిస్థితి ఆమెను చలింపజేసింది.

ఫలితంగా, ఓమాన్ నుంచి మృతదేహాన్ని భారత్‌కు తరలించేందుకు అవసరమైన రూ.1.50 లక్షలను ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి కొన్ని గంటల వ్యవధిలోనే చెక్కుగా జారీ చేసి మృతుడి భార్య చిన్న సావిత్రికి అందజేశారు. ఓమాన్‌లో ఇండియన్ ఎంబసీ గుర్తింపు పొందిన ఇండియన్ సోషల్ క్లబ్ – తెలంగాణ విభాగం అధ్యక్షులు గుండేటి గణేష్ ఈ వ్యవహారంలో సమన్వయం చేస్తూ సహాయం చేయడానికి ముందుకు వచ్చారు.

ఈ మానవీయ సహాయానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ బోధన్ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డిని మృతుడి కుటుంబ సభ్యులు, గ్రామ సర్పంచ్ బెగారి సాయిలు, మంద భీంరెడ్డి తదితరులు ఆయన నివాసంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. సహకరించిన మానాల మోహన్ రెడ్డి, అనిల్ ఈరవత్రి, నాగేపూర్ మహిపాల్ రెడ్డికి వారు కృతఙ్ఞతలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement