డీసీసీ అధ్యక్షుడిగా సైఫుల్లా బాధ్యతల స్వీకరణ
సాక్షి,సిటీ బ్యూరో: హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్షుడిగా సయ్యద్ ఖలీద్ సైఫుల్లా మంగళవారం గాంధీభవన్‌లో బాఽ ద్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. నగరానికి చెందిన సైఫుల్లా ప్రస్తుతం అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సీనియర్ డేటా నిపుణుడిగా వ్యవహరిస్తున్నారు. ఆయనకు ఏఐసీసీ డేటా అనలిటిక్స్, టెక్నాలజీ సెల్‌తో సుదీర్ఘ అనుబంధం ఉంది. ఏఐసీసీ క్రౌడ్ ఫండింగ్ పోర్టల్, మహిళా కాంగ్రెస్, ప్రొఫెషనల్స్ కాంగ్రెస్, సేవాదళ్ వంటి ఫ్రంట్‌లైన్ సంస్థల కోసం సభ్యత్వ అప్లికేషన్లు, సర్వే సాధనాలు, భారత్ జోడో యాత్ర కోసం ఫొటో, మ్యాచింగ్ ఏఐ అప్లికేషన్లను అభివృద్ధి చేశారు. ఆయన ’ఓట్ చోరీ’ గుర్తింపులో ముఖ్యమైన పాత్ర పోషించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసి పూర్వవైభవం తెచ్చేందుకు కృషి చేస్తానన్నారు. నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన పార్టీ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు.


