ప్రణాళికాబద్ధంగా అభివృద్ధికి ఆస్కారముంటుందన్న ప్రభుత్వం
కోర్ ఏరియాతోపాటు శివారు మున్సిపాలిటీల అభివృద్ధి
పరిపాలన, నియంత్రణ ఏకీకృతం చేయడం
అభివృద్ధి అసమానతలు తగ్గించడం.. మౌలిక సదుపాయాల కల్పన
ఆస్తిపన్ను ద్వారా ఆదాయం పెంచుకునే వెసులుబాటు
భారీ కార్పొరేషన్ ఏర్పాటుతో నగరమంతా ఒకే తరహా పాలన ఉంటుందన్న అభిప్రాయం
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్‌లో విలీనం వెనుక ఆదాయం పెంచుకునే ఉద్దేశంతోపాటు సమతుల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన లో కోర్‌సిటీకి, శివారు ప్రాంతాల మధ్య వ్యత్యాసం లేకుండా చేయడంతో పాటు, ఒకే తరహా ప్రణాళికాబద్ధంగా నగరాభివృద్ధి చేసే ఆలోచన ఉన్నట్టు ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం కోర్ సిటీకి, శివారులో ముని సిపాలిటీల అభివృద్ధి మధ్య భారీ వ్యత్యాసం ఉందని గుర్తించిన నేపథ్యంలో.. నగరం మొత్తం ఒకే తరహా అభివృద్ధి కోసమే ఓఆర్‌ఆర్ పరిధిలోని, దానిని ఆనుకొని ఉన్న 27 పురపాలక సంఘాలు, కార్పొరేషన్లను జీహెచ్‌ఎంసీలో విలీనం చేయడానికి ప్రధాన కారణమని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (పురపాలక శాఖ) కె.రామకృష్ణారావు కేబినెట్‌కు సమర్పించిన నివేదికలో పొందుపరిచినట్టు సమాచారం. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరంలో నిర్దిష్ట ప్రణాళిక లేకుండా అభివృద్ధి జరుగుతుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. అడ్డగోలు నిర్మాణాలు, ఆక్రమణల నియంత్రణ ప్రస్తుతమున్న విధానంలో సాధ్యం కావడం లేదని పేర్కొన్నారు.
⇒ ఏకీకృత పట్టణాభివృద్ధి: శివారు మునిసిపాలిటీల్లో నియంత్రణ లేని అభి వృద్ధితో ప్రజలకు అందించే సేవల్లో వ్యత్యాసాలు ఉన్నాయి. అయితే మౌ లిక సదుపాయాల కల్పనలో నాణ్యత, ప్రణాళికలో స్టాండర్డ్స్, జీహెచ్‌ఎంసీలో విలీనం వల్ల గృహ, రహదారులు, పారిశుధ్యం, మంచినీటి సరఫరా, ప్రజా మౌలిక సదుపాయాల కల్పన మెరుగు అవుతుంది.
⇒ మెట్రోపాలిటన్ ప్లానింగ్ ఇంపారిటివ్: జీహెచ్‌ఎంసీ విస్తరణతో మెట్రోపాలిటన్ రీజియన్ పాలన సాగించడం, సమగ్ర మాస్టర్ ప్లాన్ అమలుకు వీలు, రవాణా సదుపాయం, ప్రజలకు మెరుగైన సేవలు, కాలుష్య నియంత్రణ, ప్రజా పెట్టుబడుల సమన్వయానికి వీలవుతుంది.
⇒ నియంత్రణ, పరిపాలన సామర్థ్యం: జీహెచ్‌ఎంసీలో విలీనం వల్ల పరిపాల నా సాధికారత, భారీ ప్రణాళికలు సిద్ధం చేయడం, లోపాలను తగ్గించు కునే అవకాశం, సేవలను మరింత మెరుగుపర్చడం, డిజిటల్ గవర్నెన్స్ పెంచడానికి అవకాశం ఏర్పడుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఫిబ్రవరి 10వ తేదీ తర్వాతే..
కార్పొరేషన్ విస్తీర్ణం భారీగా పెరగడం వల్ల పర్యవేక్షణ తగ్గే అవకాశం ఉంటుందన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. దీనికి తోడు ప్రజలపై ఆర్థిక భారం అధికం అవుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రతీ ఇంటిని ఇకపై జీఎస్‌ఐ మ్యాపింగ్ చేయడం, ఇంటి విస్తీర్ణం ఆధారంగా ఆస్తిపన్ను మదింపు చేయడం, స్థానిక ఉద్యోగుల జోక్యాన్ని తగ్గించి, పూర్తిగా సాంకేతిక వినియోగం చేయడం వల్ల కార్పొరేషన్ ఆదాయం భారీగా పెంచడానికి వీలుంటుందని చెబుతున్నారు. అదే సమయంలో ప్రస్తుతమున్న రాజకీయ పదవుల సంఖ్య తగ్గిపోయే అవకాశముంది. ప్రస్తుతానికి వీటిని విలీనం చేసినా.. ఒకటే కార్పొరేషన్‌గా ఉంచుతారా? లేక మూడు కార్పొరేషన్లుగా విభజిస్తారా అన్న విషయం ఇంకా తేలాల్సి ఉంది. ఫిబ్రవరి 10వ తేదీతో ప్రస్తుత జీహెచ్‌ఎంసీ పాలక మండలి ముగిసిన తర్వాతే జీహెచ్‌ఎంసీ భవితవ్యం తేలుతుందని సమాచారం.


