హిల్ట్–పి విధానంపై అధికారిక ఉత్తర్వులకు, మంత్రుల వివరణకు కుదరని పొంతన
ఆదాయ వనరుల సమీకరణ సబ్‌కమిటీగా హిల్ట్–పిని తామే సిఫారసు చేశామన్న మంత్రులు
ప్రజలకు మేలు కోసమే నిర్ణయం తీసుకున్నామని విలేకరుల సమావేశంలో వివరణ
జీవోలో మాత్రం ఎక్కడా కేబినెట్ సబ్‌కమిటీ సిఫారసు ప్రస్తావన లేని వైనం
టీజీఐఐసీ వీసీఎండీ ప్రతిపాదన ఆధారంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వెల్లడి
సాక్షి, హైదరాబాద్: హిల్ట్–పి విధానం కింద వేల ఎకరాల పారిశ్రామిక భూములను బహుళ వినియోగం కోసం మార్పిడి చేసుకునేలా ఎవరి సిఫారసు మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నది ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. వాస్తవానికి ఈ నెల 22న విడుదల చేసిన జీవో నం.27లో తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ (టీజీఐఐసీ) వీసీఎండీ చేసిన ప్రతిపాదన ఆధారంగా హైదరాబాద్ పారిశ్రామిక భూముల మార్పిడి విధానాన్ని అమల్లోకి తెస్తున్నామని ప్రభుత్వం వెల్లడించింది. టీజీఐఐసీ ప్రతిపాదన మేరకే ప్రభుత్వం ముందుకెళ్లిందని ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్న దాన్ని బట్టి అర్థమవుతోంది.
కానీ మంగళవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆదాయ వనరుల పెంపు కోసం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు అందుకు పూర్తి భిన్నంగా మాట్లాడారు. హిల్ట్–పి విధానంపై ఆదాయ వనరుల పెంపు కేబినెట్ సబ్–కమిటీలో ఏడాదిన్నరపాటు చర్చించామని.. దీని గురించి భాగస్వామ్య పక్షాలతో చర్చించడంతోపాటు నిపుణులతో మాట్లాడి అన్నీ తెలుసుకున్నాకే హైదరాబాద్ ప్రజల మేలు కోసం సరైన నిర్ణయం తీసుకున్నామని ఉపసంఘం సభ్యులైన భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, జూపల్లి కృష్ణారావు వివరణ ఇచ్చారు.
ఎస్‌ఆర్‌వో ధరల్లో 30–50 శాతం తీసుకునే నిర్ణయం కూడా తమదేనని.. పారిశ్రామిక వర్గాలు ఇంకా తక్కువ ధరకు కావాలని అడిగాయని చెప్పారు. ఉచితంగా భూముల మార్పిడి చేయాలని ఒత్తిడి తెచ్చాయని.. కానీ రాష్ట్ర ప్రభుత్వ అవసరాల నిమిత్తం ఖజానాకు డబ్బులు కావాలనే ఆలోచనతో తాము రెండు శ్లాబుల్లో ఫీజులు నిర్ధారించామని వివరించారు. కేబినెట్ సబ్‌కమిటీ సభ్యుల హోదాలో మంత్రులు ఘంటాపథంగా చెప్పిన ఈ విషయాన్ని మాత్రం హిల్టప్ జీవోలో ప్రభుత్వం ఎక్కడా పేర్కొనలేదు. కనీసం ఉపసంఘం ప్రస్తావన కూడా తీసుకురాకపోవడం గమనార్హం. కేవలం టీజీఐఐసీ గురించే పేర్కొన్న ఈ జీవోలో కనీసం సబ్–కమిటీ సిఫారసు గురించి ఎందుకు ప్రస్తావించలేదన్నది ఆసక్తిగా మారింది.
సీఎస్ పేరుకు బదులు..
ప్రభుత్వ ఉత్తర్వుల విడుదలలో పాటించే విధానాన్ని కూడా హిల్ట్–పి జీవో జారీ విషయంలో ప్రభుత్వం విస్మరించడం అధికార వర్గాల్లోనూ చర్చకు దారితీస్తోంది. అటు పరిశ్రమల శాఖ, ఇటు మున్సిపల్ శాఖ (హెచ్‌ఎండీఏ)లతో సంబంధముండే ఈ ప్రక్రియ అమలుకు సంబంధించిన జీవోను కేవలం పరిశ్రమల శాఖ నుంచి ఇవ్వడం ఏమిటనే ప్రశ్న తలెత్తుతోంది. రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు సంబంధించి ఒకటి కంటే ఎక్కువ శాఖలతో సంబంధముంటే జీవోలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) పేరిట ఇవ్వడం ఆనవా యితీగా వస్తోంది. కానీ ఆ ఆనవాయితీని కాదని కేవలం పరిశ్రమల శాఖ కార్యదర్శి ద్వారా ఈ ఉత్తర్వులు జారీ చేయించడం వెనుక మర్మం ఏమిటనే చర్చ అధికార, రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.


