నేడు సుబ్రహ్మణ్యస్వామి కల్యాణం
నారాయణపేట రూరల్: శ్రీ సుబ్రహ్మణ్యస్వామి షష్ఠి సందర్భంగా పట్టణంలోని బాపునగర్ హనుమాన్ ఆలయంలో బుధవారం శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి వారి కల్యాణం వైభవంగా నిర్వహిస్తున్నట్లు సామాల మాణిక్యప్ప తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రత్యేక పూజలు, కల్యాణం తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తులు, పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరారు.
రాష్ట్ర స్థాయి క్రాస్ కంట్రీ పోటీలకు ఎంపికలు
నారాయణపేట టౌన్: జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో ఈ నెల 30న ఆదివారం ఉదయం 9 గంటలకు జిల్లా స్థాయి క్రాస్ కంట్రీ ఎంపికలు ఉంటాయని జిల్లా అథ్లెటిక్ అసోషియేషన్ ప్రధాన కార్యదర్శి రమణ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాస్థాయిలో విజేతలుగా నిలిచిన వారు డిసెంబర్ 4న రంగారెడ్డి జిల్లాలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అండర్–20 బాలురకు 8 కి.మీ, బాలికలలకు 6 కి.మీ, అండర్–18 బాలురకు 6 కి.మీ, బాలికలకు 4 కి.మీ, అండర్–16 బాలికలకు, బాలురకు 2 కి.మీ.ల చొప్పున పరుగు పందెల పోటీ లు ఉంటాయన్నారు. ఆసక్తి గల వారు జనన ధృవీకరణ పత్రం, పదో తరగతి మెమో తీసుకొని రావాలని సూచించారు. మరిన్ని వివరాలకు 91007 53683, 90593 25183, 90635 00718 నంబర్లకు సంప్రదించాలన్నారు.
యువత సన్మార్గంలో నడవాలి
నారాయణపేట రూరల్: భారత ప్రభుత్వ యువజన, క్రీడా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న మేరా యువభారత్ కార్యక్రమాల నిర్వహణకు నారాయణపేట జిల్లా కోఆర్డినేటర్‌గా మండలంలోని తిరుమలాపూర్ గ్రామానికి చెందిన భాస్కర్‌ను నియమించారు. ఈ మేరకు ఆ శాఖ డిప్యూటీ డైరెక్టర్ దేవేందర్ వ్యాస్ భాస్యర్‌కు నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ.. జిల్లాలో యువతను ప్రోత్సహించి సన్మార్గంలో నడిపేందుకు కృషి చేస్తానని, వికసిత్ బారత్ లక్ష్యాన్ని నెరవేర్చేందుకు అందరితో సమన్వయంతో ముందుకు వెళ్తానని తెలిపారు. తనకు అవకాశం కల్పించిన ఎంపీ డీకే అరుణ, బీజేపీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.


