భూసేకరణే సమస్య
గోపాల్‌దిన్నె రిజర్వాయర్..
అచ్చంపేట ఎత్తిపోతల..
కాల్వల హద్దులు పూర్తయ్యాయి..
సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలకు అడ్డంకులు
● పరిహారం చెల్లింపులో జాప్యం
● ఏళ్లుగా కొనసాగుతున్న ప్రక్రియ
● కల్వకుర్తి–కొల్లాపూర్
జాతీయ రహదారిదీ అదే పరిస్థితి
అచ్చంపేట: జిల్లాకు సాగునీరు అందించేందుకు చేపట్టిన ప్రాజెక్టు పనులు భూసేకరణ సమస్యతో ముందుకు సాగడం లేదు. కల్వకుర్తి ఎత్తిపోతల (కేఎల్‌ఐ), పాలమూరు–రంగారెడ్డి, అచ్చంపేట ఎత్తిపోతల పథకం, మార్కండేయ, సింగోటం లింక్ కెనాల్, డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ తదితర నీటి పారుదల ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ పెడింగ్‌లో ఉంది. చాలా రోజుల నుంచి భూసేకరణకు నిధులు విడుదల కాకపోవడంతో సమస్యలు ఉత్పన్నతున్నాయి. ప్రభుత్వం ఈ ఏడాది జూన్‌లో కేఎల్‌ఐకి రూ.25 కోట్లు, డిండి ప్రాజెక్టుకు రూ.24 కోట్లు చొప్పున నిధులు మంజూరు చేసినా అధికారుల ఈ ప్రక్రియను వేగవంతం చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించిన 14 ప్యాకేజీల పరిధిలో 11,930.22 ఎకరాల భూమి సేకరించాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 11,899.07 పూర్తయ్యింది. మిగిలిన 31.15 ఎకరాలు సేకరించాల్సి ఉంది. రాజీవ్ భీమా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కింద 142.98 ఎకరాలు సేకరించాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 129.52 ఎకరాలు సేకరించారు. ఇంకా 18.48 ఎకరాలు సేకరించాల్సి ఉంది. కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలోని ప్యాకేజీ 27లో 18.46 ఎకరాలు, ప్యాకేజీ 28లో 27.20 ఎకరాలు, ప్యాకేజీ 29లో 242 ఎకరాలు, ప్యాకేజీ 30లో 256.5 ఎకరాలు, కర్నెతండా లిఫ్ట్‌లో 23 ఎకరాలు, మార్కండేయ ఎత్తిపోతల పథకంలో 104.42 ఎకరాలు, డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పరిధిలో 244.15 ఎకరాల భూసేకరణ చేయాల్సి ఉంది.
అచ్చంపేట నియోజకవర్గంలో 57,200 ఎకరాలకు సాగునీరు అందించేందుకు బల్మూర్ మండలంలోని మైలారం శివారులో 2.67 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించనున్న ఉమామహేశ్వర రిజర్వాయర్ కాల్వ కోసం గుర్తించిన 730 ఎకరాల్లో ఇప్పటికే సర్వే పూర్తయ్యింది. రిజర్వాయర్ ఆనకట్టకు 147 ఎకరాలు, నీటి నిల్వ ప్రాంతం 2,038 ఎకరాలు మొత్తం 2,185 ఎకరాలకు సర్వే చేయాల్సి ఉంది. ముంపు భూముల రైతుల నుంచి వ్యతిరేకత రావడం, కోర్టును ఆశ్రయించడం వంటి సమస్యలతో రెండేళ్లుగా పనులు ముందుకు సాగడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ కోసం వారం రోజుల క్రితం జీఓ 42ను తీసుకొచ్చింది.
● పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా ఏదుల రిజర్వాయర్ నుంచి అచ్చంపేట ఎత్తిపోతల పథకం కింద రెండు దశల్లో లిఫ్ట్ పనులు చేపట్టాలని ప్రభుత్వం భావించింది. ఇందులో భాగంగా తొలి దశ పనులకు రూ.1,534.5 కోట్ల అంచనా వ్యయంతో 2023 మే 3న ప్రభుత్వం పరిపాలనా అనుమతి ఇచ్చింది. ఈ పనికి టెండర్ పిలువగా రూ.1,105.97 కోట్లకు బీఐపీఎల్, ఎఇపీపీఎల్ జాయింట్ వెంచర్ దక్కించుకుంది. 2023 సెప్టెంబర్ 22న టెండర్ ఒప్పందం చేసుకున్న కాంట్రాక్టర్ 30 నెలల్లో పని పూర్తి చేయాలి. 4,142 ఎకరాల భూసేకరణ చేపట్టాల్సి ఉంది. రెండేళ్లయినా ఇంత వరకు భూసేకరణనే పూర్తి కాకపోవడంతో తట్టేడు మట్టి కూడా తీయలేదు.
కొల్లాపూర్ నియోజకవర్గంలోని ఐదు మండలాల పరిధిలో 34 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో 2018లో ప్రభుత్వం సింగోటం–గోపల్‌దిన్నె లింక్ కెనాల్‌కు శ్రీకారం చుట్టారు. 2022లో రూ.147.7కోట్ల నిధులు మంజూరు చేయగా.. 2023లో పనులు ప్రారంభమైనా భూసేకరణ సమస్య కారణంగా నిలిచిపోయాయి. సింగోటం రిజర్వాయర్ నుంచి గోపల్‌దిన్నె రిజర్వాయర్ వరకు 22.5 కి.మీ కెనాల్ తవ్వకాలు చేపట్టారు. ఇందులో వనపర్తి జిల్లా పరిధిలో 18 కి.మీ, నాగర్‌కర్నూల్ జిల్లా పరిధిలో 4.5 కి.మీ కాల్వ తీయాల్సి ఉంది. వనపర్తి పరిధిలో 200 ఎకరాలు, నాగర్‌కర్నూల్ పరిధిలో 100 ఎకరాల మేర భూసేకరణ చేపట్టాల్సి ఉంది. ఎకరాకు రూ.20 లక్షలు ఇస్తేనే భూములు ఇస్తామని రైతులు నిర్ణయించడంతో కాల్వ పనులు రెండేళ్లు క్రితం నిలిచిపోయాయి. గోపల్‌దిన్నె రిజర్వాయర్ నుంచి దాదాపు 5కి.మీ మేర మాత్రమే కాల్వ పనులు చేపట్టారు.
రెండేళ్లయినా..
జిల్లాలో కొనసాగుతున్న జాతీయ రహదారి 167కె నిర్మాణ పనులు మొదలై రెండేళ్లవుతున్నా నేటికీ భూసేకరణ పూర్తి కాలేదు. కల్వకుర్తి (కొట్రగేట్), నాగర్‌కర్నూల్–కొల్లాపూర్‌లోని మండలం చౌటపల్లి వాగు మీదుగా సోమశిల వైపు 79.3 కిలోమీటర్ల రహదారి పనులు మొదలయ్యాయి. 106.7 హెక్టార్ల విస్తీర్ణం భూమి అవసరం కాగా ఇప్పటి వరకు 77.5 హెక్టార్ల భూసేకరించారుది. కొల్లాపూర్ బైపాస్ మినహా ఇంకా 29.2 హెక్టార్ల భూసేకరణ చేయాల్సి ఉంది. ఇదే మార్గంలో 3వ ప్యాకేజీలో భాగంగా సోమశిల, సిద్ధేశ్వరం గుట్టల మధ్య వంతెన నిర్మించే నదీ తీరం వరకు 8 కిలోమీటర్ల అప్రోచ్ రోడ్డు నిర్మాణానికి 132 హెక్టార్ల భూసేకరణ చేపట్టాల్సి ఉంది. ఇప్పటి వరకు 44 హెక్టార్ల భూసేకరణ చేసినట్లు అధికారులు చెబుతున్నారు.
ఉమామహేశ్వర రిజర్వాయర్ కింద చేపట్టే కాల్వ హద్దులు నిర్ణయించి సర్వే పూర్తి చేశాం. రిజర్వాయర్ నిర్మించే ప్రాంతంలో కొంత భాగం సర్వే చేయాల్సి ఉంది. రైతుల నుంచి భూసేకరణకు అడ్డంకులు ఎదురువుతున్నాయి. మొత్తం 2,700 ఎకరాలు సేకరించాల్సి ఉంది. కలెక్టర్ నుంచి భూసేకరణ గెజిట్ నోటిఫికేషన్ వస్తే ప్రక్రియ మొదలవుతుంది. త్వరలోనే భూసేకరణ పూర్తి చేసి రైతులకు నష్టపరిహారం అందజేస్తాం.
– అమర్‌సింగ్, ఈఈ,
ఇరిగేషన్‌శాఖ, అచ్చంపేట


