
కృష్ణా: ప్రేమించిన మరదలితో కుటుంబ సభ్యులు వివాహం చేయడం లేదని మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఇక సెలవు (మిస్‌యూ మా, మిస్‌యూ ఆల్ మై ఫ్రెండ్స్, ఫ్యామిలీ) అంటూ తన ఫొన్‌లో స్టేటస్ పెట్టి అదృశ్యమయ్యాడు. ఈ ఘటన నారాయణపేట జిల్లా కృష్ణా మండలంలోని చేగుంటలో మంగళవారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, స్థానికుల వివరాల మేరకు.. చేగుంటకు చెందిన సంగెంబండ బస్సప్ప – తిమ్మవ్వ దంపతులకు మల్లప్ప, భీమ్‌రాయ, పరశివ సంతానం. వీరి తల్లి తిమ్మవ్వ కొన్నేళ్ల క్రితం మృతిచెందగా.. మొదటి కొడుకు మల్లప్ప తన భార్యతో కలిసి జీవనోపాధి నిమిత్తం బెంగళూరుకు వలస వెళ్లారు.
ఆరేళ్ల క్రితం పదో తరగతి పూర్తిచేసుకున్న చిన్నకొడుకు పరశివ (22) కూడా ఉపాధి నిమిత్తం బెంగళూరులోని తన అన్న మల్లప్ప వద్దకు వెళ్లాడు. బెంగళూరులో పరశివ పనిచేసుకుంటూ.. తన రెండో అన్న భీమ్‌రాయ భార్య సునీత చెల్లెలు నిఖితతో ప్రేమలో పడ్డాడు. వీరిద్దరు వరుసకు బావమరదలు కావడంతో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని స్వగ్రామంలో ఉన్న తన సోదరుడు భీమ్‌రాయ, వదిన సునీతకు చెప్పేందుకు గాను వారం రోజుల క్రితం పరశివ బెంగళూరు నుంచి చేగుంటకు వచ్చాడు. ఈ క్రమంలో పరశివ, నిఖిత వివాహానికి అన్న, వదినలు అడ్డు చెప్పారు. ప్రేమించిన యువతి ఆరోగ్యం బాగా లేదని, నీకు మరో అమ్మాయితో వివాహం చేస్తామని పరశివకు సర్దిచెప్పారు.
ఇక వీరి మాటకు ఎదురు చెప్పలేక తిరిగి బెంగళూరుకు బయలుదేరాడు. ఆదివారం బెంగళూరు నుంచి మళ్లీ బయలుదేరిన పరశివ.. రాష్ట్ర సరిహద్దులోని దేవసూగూర్‌లో గల కృష్ణానది తీరానికి చేరుకున్నట్లు తెలిసింది. అక్కడ తన ఫోన్‌లో ‘మీస్‌యూ ఆల్ మై ఫ్రెండ్స్, అండ్ ఫ్యామిలీ’ అంటూ స్టేటస్ పెట్టాడు. అలాగే తాను ప్రేమించిన నిఖితతో దిగిన ఫొటోలు, వీడియోలు స్టేటస్‌లో పెట్టుకొని ఫోన్ స్విచ్చాఫ్ చేశాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు మొదట కృష్ణా, ఆ తర్వాత శక్తినగర్ పోలీసులకు సమాచారం అందించారు.
అయితే కృష్ణానదిలో పడి ఆత్మహత్య చేసుకున్నాడేమో అని గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో స్థానికుల సహాయంతో కృష్ణానదిలో గాలింపు చర్యలు చేపట్టగా.. ఆచూకీ లభించలేదు. యువకుడి అదృశ్యం ఘటనకు సంబంధించి శక్తినగర్ ఎస్‌ఐ తిమ్మణ్ణను వివరణ కోరగా.. ఈ విషయంపై బెంగళూరులో కేసు నమోదైందని త తెలిపారు. తాము స్థానికంగా వెతికినా ఆచూకీ లభించలేదన్నారు. ఇప్పటికే బెంగళూరులో కేసు నమోదైనందున తాము కేసు చేయలేదని తెలిపారు.