
ఏపీ సీఎం చంద్రబాబుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి
రోజుకు 3 టీఎంసీలు తీసుకునే ఆ ప్రాజెక్టు విషయంలో ఉదారత చూపండి
పాలమూరు ప్రాజెక్టులు అడ్డుకోకుండా పూర్తి చేసేందుకు సహకరించండి
మీరు బాధ్యతగా ఉండండి.. మమ్మల్ని బతకనివ్వండి.. మీ మేలు మరిచిపోం
మేం విజ్ఞప్తులు చేస్తాం.. వినకుంటే ఎలా పోరాడాలో తెలుసు
నేను రెండున్నరేళ్లలో పాలమూరు ప్రాజెక్టులు పూర్తి చేయిస్తా
నాగర్‌కర్నూల్ జిల్లా జటప్రోలులో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్‌కు శంకుస్థాపన
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్/సాక్షి, నాగర్‌కర్నూల్: ‘ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు విజ్ఞప్తి చేస్తున్నా.. పాలమూరు ప్రాజెక్టులను అడ్డుకోవద్దు. పాలమూరు–రంగారెడ్డి, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, డిండి, ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టులను పూర్తి చేసుకునేందుకు సహకరించండి. ఈ ప్రాజెక్టులను అడ్డుకోవడం న్యాయమా? ఒకనాడు పాలమూరు జిల్లాను దత్తత తీసుకున్నామని మీరు చెప్పారు. మీరు బాధ్యతగా ఉండి, మమ్మల్ని బతకనివ్వండి. మా ప్రాజెక్టులను పూర్తి చేసుకోనివ్వండి. ఉమ్మడి రాష్ట్రంలో ఏపీ శ్రీశైలం బ్యాక్‌వాటర్ నుంచి 4 టీఎంసీల నీరు తీసుకునేది..ఇప్పుడు 9.5 టీఎంసీల నీరు తీసుకెళ్లేందుకు ప్రాజెక్టులు పెట్టుకున్నరు. రోజుకు 3 టీఎంసీలు తీసుకునే రాయలసీమ ప్రాజెక్టును రద్దు చేసి ఉదారత చూపండి.
రెండు తెలుగు రాష్ట్రాలను, తెలుగువారిని సమానంగా అభివృద్ధి చేయాలన్న మీ ఆలోచన నిజమైతే రాయలసీమ ప్రాజెక్టును రద్దు చేయండి. పాలమూరు ప్రాజెక్టులు పూర్తయ్యేందుకు సహకరించండి. పాలమూరు బిడ్డలం మీ మేలు మర్చిపోం. మేం విజ్ఞప్తులు చేస్తాం. వినకపోతే ఎలా పోరాటం చేయాలో పాలమూరు బిడ్డలకు తెలుసు. పాలమూరు ప్రాజెక్టులను రెండున్నరేళ్లలో పూర్తిచేసేలా నేను బాధ్యత తీసుకుంటా..’ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. శుక్రవారం నాగర్‌కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండలం జటప్రోలు గ్రామంలో రూ.200 కోట్లతో చేపట్టనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఇక్కడి మదనగోపాలస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిర్వహించిన భారీ బహిరంగ సభలో మాట్లాడారు.
మేం అన్నం పెడితే.. నువ్ సున్నం పెట్టావు..
‘పాలమూరు నుంచి 2009లో ఎంపీగా గెలిచిన కేసీఆర్ ఈ ప్రాంతానికి చేసింది, ఇచ్చింది ఏంటో చెప్పాలి. కరీంనగర్ నుంచి పారిపోయి పాలమూరుకు వలస వస్తే ఇక్కడి బిడ్డలు భుజాలపై పెట్టుకున్నారు. పదేళ్ల కాలం పాటు సీఎంగా ఉన్నా పాలమూరు ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేదు? ఉమ్మడి రాష్ట్రంలో కన్నా కేసీఆర్ పాలనలోనే పాలమూరుకు అన్యాయం జరిగింది. పాలమూరు బిడ్డలు అన్నం పెడితే, కేసీఆర్ వారికి సున్నం పెట్టారు. పాలమూరు బిడ్డ సీఎం అయితే కేసీఆర్‌కు దు:ఖం వస్తోంది.
2034 వరకు ఇంకో పదేళ్ల పాటు పాలమూరు బిడ్డనే ముఖ్యమంత్రిగా ఉంటారు. పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పాలమూరు, కల్వకుర్తి, బీమా, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులను పూర్తిచేసే బాధ్యత నేను తీసుకుంటా. డిసెంబర్ 9 కల్లా అన్ని ప్రాజెక్టుల భూసేకరణ పూర్తిచేసి, నిర్వాసితులకు పూర్తిస్థాయిలో నష్టపరిహారం చెల్లిస్తాం. ఆయన అసెంబ్లీకి వచ్చి ప్రతిపక్షంలో కూర్చుని మేము చేస్తున్న పనులు చూడాలి..’ అని రేవంత్‌రెడ్డి అన్నారు.
రెండున్నరేళ్లలో లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు
‘కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కేసీఆర్ రూ.లక్ష కోట్లు ఖర్చు చేశాడు. ఒకే ఒక్క ప్రాజెక్టు కోసం లక్ష కోట్లు పెట్టిన పరిస్థితి ఎక్కడా లేదు. ఎవరైనా గుడిసె కట్టుకున్నా పదేళ్లు ఉంటది. కానీ కాళేశ్వరం 2019లో కడితే 2023లో కూలింది. మూడేళ్లకే ప్రాజెక్టు కూలుతుందా? బీఆర్‌ఎస్ పాలనలో 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా భర్తీ చేయలేదు. తన ఇంటినిండా మాత్రం కొలువులు నింపుకున్నాడు. మా ప్రభుత్వం ఏర్పడిన తొలి ఏడాదిలోనే 60 వేల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం. రెండున్నరేళ్ల కాలంలో మొత్తం లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తాం. ఎస్సీ వర్గీకరణ నేపథ్యంలో మాదిగ ఉప కులాలకు న్యాయం జరిగేలా చూసే క్రమంలో నోటిఫికేషన్ల జారీ ఆలస్యం అవుతోంది. ఆరు నెలలు ఆలస్యమైనా వారికి న్యాయం జరుగుతుంది. యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్లు దేశానికే తలమానికంగా నిలువబోతున్నాయి..’ అని సీఎం చెప్పారు.
మా పాలనలో మహిళలకు అందలం
‘కేసీఆర్ పాలనలో 2018 వరకు ఒక్క మహిళా మంత్రి కూడా లేరు. ఇలాంటి పరిస్థితి దేశంలో ఎక్కడా లేదు. ఆడవాళ్లు వంటింటికే పరిమితం కావాలన్న దుర్మార్గమైన ఆలోచన బీఆర్‌ఎస్‌ది. మా ప్రభుత్వం రాష్ట్రంలోని కోటిమంది మహిళలను కోటీశ్వరుల్ని చేసేలా పనిచేస్తోంది. అమ్మ ఆదర్శ పాఠశాలల్లో బడిపంతుళ్ల హాజరు లెక్కలు చూసే అధికారం అక్కలకే ఇచ్చాం. పెట్రోల్ బంకులు, ఆర్టీసీ బస్సులు, సోలార్ విద్యుత్ ప్లాంట్లు, ఇందిరా మహిళాశక్తి క్యాంటీన్ల ద్వారా మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతున్నాం..’ అని ముఖ్యమంత్రి తెలిపారు.
రాష్ట్రంలోని పేదల విద్య, ఆరోగ్యం ప్రభుత్వ బాధ్యతేనని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. 2011లో వైఎస్సార్ మహిళలకు వడ్డీలేని రుణాలను అందించారని, బీఆర్‌ఎస్ పాలనలో ఈ రుణాలను నిర్వీర్యం చేశారని విమర్శించారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా తమ ప్రభుత్వం ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు చేపడుతోందని మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి చెప్పారు.
పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు ఒక్క మోటారు ఆన్‌చేసి కేసీఆర్ ఎన్నికల డ్రామా ఆడారని మండిపడ్డారు. కాగా స్వయం సహాయక బృందాలకు చెందిన మహిళలకు వడ్డీలేని రుణాల కింద రూ.344 కోట్లను సీఎం ఈ సందర్భంగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, రాజేశ్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, అనిరుధ్‌రెడ్డి, పరి్ణకారెడ్డి, మేఘారెడ్డి, వీర్లపల్లి శంకర్, కలెక్టర్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు.