
ఆర్థిక పాఠాలు తల్లిదండ్రుల నుంచే
ఇంటి పెద్దలను అనుకరించే పిల్లలు
వారసత్వంగా ఖర్చులు, పొదుపు తీరు
ఈ తరం పిల్లలు.. చాలా స్పీడు. వాళ్ల జోరుకు తగ్గట్టు తల్లిదండ్రులు వారికి మంచీ చెడూ చెప్పాలి. చెప్పడం కాదు.. తల్లిదండ్రులు స్వయంగా అలా నడుచుకోవాలి. ఎందుకంటే పిల్లలు ముందు అనుసరించేదీ, అనుకరించేదీ పేరెంట్స్‌నే. డబ్బుల విషయంలో మరీనూ! అందుకే, తల్లిదండ్రులు ముందు ఆర్థిక పాఠాలు నేర్చుకోవాలి.. ఆచరించాలి..వాటిని పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలి! ఇంతకీ వాటిని ఎలా చెప్పాలి?
మాటలకు.. చేతలకు..
విచ్చలవిడిగా ఖర్చు చేయకూడదని మీ పిల్లలకు చెప్పి.. మీరు మాత్రం డిస్కౌంట్ సేల్ ఉందని కొనుగోలు చేశారా? ఆర్థిక అత్యవసర సమయంలో ఇంట్లో ఎవరికీ తెలియకుండా ఏ లోన్ యాప్‌లోనో లేదా స్నేహితుల దగ్గరో అప్పు చేసేశారా? మీ ఆదాయం ఎంతో పిల్లలకు తెలిసినప్పుడు.. మీరు చేస్తున్న ఖర్చు ఎక్కువన్న విషయాన్ని మీ పిల్లలు గమనించడం లేదనుకుంటే ఎలా?
నిత్యం ‘డబ్బు’ గొడవలు
భార్యాభర్తలిద్దరూ సంపాదించే వారైతే.. డబ్బు గురించి గొడవలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. భార్యాభర్తల్లో ఒకరు ఎక్కువగా ఖర్చు చేస్తూ మరొకరు పొదుపుగా ఉండే కుటుంబాలు కూడా ఎన్నో. ఇలాంటి కారణాల వల్ల ప్రతి ఆర్థిక నిర్ణయం గురించి వాదించుకుంటూ, ఇద్దరూ తరచుగా తగాదాలకు దిగుతుంటారు.
ఆర్థిక విషయాల దాటవేత
చాలామంది భారతీయులు పిల్లలతో డబ్బు గురించి మాట్లాడటం సరికాదని భావిస్తారు. మరీ ముఖ్యంగా ఆర్థిక సమస్యలను పిల్లలకు చెప్పకుండా దాచేస్తారు.
పాకెట్ మనీ
చాలామంది తల్లిదండ్రులు.. ఒక వయసు దాటాక కూడా పిల్లల ప్రతి ఆర్థిక నిర్ణయంలో తలదూరుస్తుంటారు. వారిపై నమ్మకం ఉంచరు. పిల్లలకు పాకెట్ మనీ ఇవ్వడానికి ఇష్టపడరు. ఒకవేళ ఇచ్చినా.. దాని గురించి సవాలక్ష ప్రశ్నలు, ఎలా ఖర్చు చేశారంటూ విచారణలు!
మీ తరం.. ఈ తరం..
మీ తల్లిదండ్రుల తరంతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ భిన్నంగా ఉంది. తరాలు మారుతున్నా.. ఆర్థిక వ్యవస్థ మారుతున్నా.. అది గుర్తించకుండా ఇప్పటికీ చాలామంది తల్లిదండ్రులు పాత పాఠాలే చెప్తుంటారు.
పిల్లలపై ప్రభావం ?
మీ మాటలకు, చేతలకు పొంతన లేకపోతే ఆర్థిక విషయాల్లో పిల్లలకు గందరగోళం ఏర్పడుతుంది. మీరు ఎక్కువ వడ్డీలకు అప్పులు చేసి, ప్రతినెలా వాటికే మీ జీతంలో ఎక్కువ మొత్తం ఖర్చు చేస్తున్నారని వారికి తెలిస్తే వారిలో ఆర్థిక క్రమశిక్షణ తప్పిపోతుంది. మీరు చెప్పే మాటలను పిల్లలు నమ్మకపోవచ్చు.
⇒ తల్లిదండ్రుల గొడవల వల్ల పిల్లల్లో డబ్బు గురించి ఆందోళన, ఒత్తిడి పెరుగుతాయి. ఆర్థిక విషయాలంటే పిల్లల దృష్టిలో.. గొడవలకు దారితీసేవిగా మారిపోవచ్చు. దీంతో డబ్బు గురించి చర్చ అంటేనే భయపడవచ్చు.
⇒ దీనివల్ల పిల్లలకు డబ్బు గురించి అవగాహన లేకుండా పోతుంది. డబ్బు గురించి ఏమీ తెలియకపోవడం వల్ల.. దాని గురించి మాట్లాడాలంటేనే సిగ్గు, ఎవరికీ తెలియకుండా రహస్యంగా ఆర్థిక లావాదేవీలు చేయాలన్న ఆలోచనలు పెరుగుతాయి.
⇒ ఇది మంచి–చెడు గురించి నేర్చుకోకుండా చేయడమే కాకుండా భవిష్యత్తులో వారు తల్లిదండ్రులపై ఆర్థికంగా ఆధారపడేలా చేస్తుంది. ఆ అసంతృప్తి.. తెలిసీ తెలియని వయసులోనే ‘అప్పుల’వైపు వారి మనసును మళ్లేలా చేయవచ్చు.
⇒ పాతకాలం నాటి సిద్ధాంతాలతో మీ ఎంపికలను గుడ్డిగా అమలు చేయడం వల్ల పిల్లలు కొత్త ఆర్థిక పాఠాలు నేర్చుకోలేరు. అదే సమయంలో వారి స్నేహితుల్లో కొందరు ఆర్థిక విషయాల్లో చురుగ్గా వ్యవహరిస్తుండటం వీరి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే అవకాశం ఉంది. ఆర్థిక విషయాలను మీకు చెప్పాలన్నా సంకోచిస్తారు.
ఎలా నివారించాలి ?
మీ పిల్లలు తెలివిగా ఖర్చు చేయాలనుకుంటే మీరు బడ్జెట్‌ను ఎలా తయారు చేస్తారో వారికి ప్రత్యక్షంగా చూపించండి.
ముందుగా అత్యవసరమైన వస్తువులకే ప్రాధాన్యత ఇవ్వండి. ఖర్చు చేయదగ్గ డబ్బులు మిగిలితే తక్కువ అవసరం ఉన్న వస్తువులను ఎంచుకోండి. ప్రతినెలా పొదుపు చేయడమూ నేర్పించండి.
⇒ ఆర్థిక విషయాల గురించి భార్యాభర్తలు కూర్చుని మాట్లాడుకోవాలి. కుటుంబ సాధారణ లక్ష్యాలు, పిల్లల చదువుకు పొదుపు చేయడం, ఇంటికి కావాల్సిన ముఖ్యమైన వస్తువులు ప్రాధాన్యతగా ఉండాలి. ఇదే విషయాన్ని పిల్లలకు చెప్పడం అవసరం.
⇒ పిల్లల వయసుకు తగ్గట్టుగా వారితో ఆర్థిక విషయాలు చర్చించాలి. ఇంట్లో ప్రతినెలా ఎంత ఆదాయం వస్తోంది, ఏయే విషయాలకు ఎంత ఖర్చు చేస్తున్నారు.. ఇవన్నీ చర్చించాలి. డబ్బు జీవితంలో ఎంత ముఖ్యమైనదో వారికి అర్థమైతే.. ఆర్థిక క్రమశిక్షణ దానంతట అదే వస్తుంది.
⇒ పాకెట్ మనీ పిల్లలకు కొద్దిగా ఇవ్వండి. దీనిని వారు ఎలా ఖర్చు చేస్తున్నారో.. ఏదో ఇంటరాగేషన్ చేస్తున్నట్టు కాకుండా, సరదా సంభాషణల్లో తెలుసుకోవాలి. దీనివల్ల వారిలో ఆత్మవిశ్వాసం,మీపై నమ్మకం, గౌరవం పెరుగుతాయి. స్వతంత్ర ఆర్థిక నిర్ణయాలు తీసుకుంటూ డబ్బును బాధ్యతగా ఖర్చు చేస్తారు.
⇒ ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ, ఇప్పుడున్న ఆర్థిక సాధనాల గురించి ముందుగా మీరు కొంతైనా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా సొంత నిర్ణయాలు తీసుకోవడానికి వారిని అనుమతించండి. చిన్న చిన్న ఆర్థిక వ్యవహారాల్లో వాళ్లు తప్పులు చేసినా ఫర్వాలేదు. వాటి నుంచి నేర్చుకుంటారు.