
సురక్షితంగా లేమంటున్న 40 శాతం మహిళలు
యువతులపై వేధింపులు గతేడాది కన్నా ఎక్కువ
ఫిర్యాదులపై నమ్మకం లేనివారు 75 శాతం మంది
మహిళల భద్రతా నివేదిక ‘నారీ–2025’
దేశంలోని ప్రతి 10 మంది మహిళల్లో నలుగురు.. తాము ఏమంత సురక్షితంగా లేరని భావిస్తున్నారట. యువతుల్లో భయాందోళనలు గత ఏడాది కంటే పెరిగాయి. ఫిర్యాదు ఇస్తే న్యాయం జరుగుతుందన్న ఆశ బాధిత మహిళల్లో చాలా తక్కువగా ఉందట. పని చేసే చోట భద్రత గురించి మాత్రం.. సురక్షితమైన వాతావరణం ఉందని అత్యధికులు చెప్పారు. దేశంలోని మహిళల భద్రతా స్థితిగతులపై జాతీయ మహిళా కమిషన్.. ‘నారీ 2025 వార్షిక నివేదిక, భద్రతా సూచిక’ పేరిట విడుదుల చేసిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. -సాక్షి, స్పెషల్ డెస్క్
వీధి లైట్లు.. ప్రజా రవాణా!
⇒ ‘ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ హెరాస్‌మెంట్’ గురించి విన్నవారిలో చాలా మంది, ఆఫీసులలో అలాంటి యంత్రాంగం ఒకటి ఉంటుందన్న అవగాహన మహిళలకు భద్రత కల్పిస్తుందని అభిప్రాయపడ్డారు.
⇒ మహిళల భద్రత అంటే కేవలం వారికి భౌతిక రక్షణను మాత్రమే ఇవ్వటం కాదని; వారి మానసిక, ఆర్థిక, డిజిటల్ భద్రతలను కూడా కల్పించాలని నివేదిక సూచించింది.
⇒ స్థలాన్ని, సమయాన్ని బట్టి కూడా భద్రత అర్థం మారుతుందనీ, పగటిపూట సురక్షితమైన వాతావరణాన్ని నైట్ షిఫ్టులలో ఆశించలేమని మహిళలు అన్నారు.
⇒ వీధి లైట్లు లేకపోవటం, సరిగా లేని ప్రజా రవాణా వ్యవస్థ కూడా రాత్రివేళ మహిళలకు భద్రత లేకపోవటానికి కారణమని వారు తెలిపారు.
దేశంలోని 31 నగరాల్లో 12,770 మంది మహిళల అభిప్రాయాలు సేకరించి జాతీయ మహిళా కమిషన్ ‘నారీ 2025 వార్షిక నివేదిక, భద్రతా సూచిక’ రూపొందించింది. సర్వేలో దాదాపు 60 శాతం మంది మహిళలు తమ నగరాల్లో తాము సురక్షితంగా ఉన్నట్లు చెప్పగా, 40 శాతం మంది అంత సురక్షితంగా లేమని లేదా సురక్షితంగా అస్సలు లేమని భావిస్తున్నట్లు తెలిపారు.
యువతులలోని భయాందోళనలు గత ఏడాది కంటే పెరగటాన్ని కూడా నివేదిక గుర్తించింది. 2024లో సర్వేలో పాల్గొన్న మహిళల్లో 7 శాతం మంది బహిరంగ వేధింపులను గురయ్యామని చెప్పగా, 24 ఏళ్లలోపు యువతుల్లో ఇలా చెప్పిన వారి సంఖ్య గరిష్ఠంగా 14 శాతంగా ఉంది. ముఖ్యంగా చదువుకునే అమ్మాయిలు, ఉద్యోగినులైన యువ నిపుణులు, సామాజిక వేడుకల్లో పాలుపంచుకున్న మహిళలు వేధింపులకు గురైనట్లు సర్వే పేర్కొంది.
ముగ్గురిలో ఒక్కరే ఫిర్యాదు!
ఫిర్యాదు ఇస్తే న్యాయం జరుగుతుందన్న ఆశ బాధిత మహిళల్లో చాలా తక్కువగా ఉందని నివేదిక తెలిపింది. సర్వే ప్రకారం, వేధింపులకు గురైన ముగ్గురిలో ఒకరు మా త్రమే ఫిర్యాదు చేశారు. 75 శాతం మహిళలు.. తమ ఫిర్యాదులను అధికారులు పరిష్కరిస్తారని నమ్మటం లేదు. వేధింపులు, ఇతర ఘటనల్లో 22 శాతం వరకే కేసులు నమోదు కాగా, వాటిల్లో పరిష్కారం అయినవి కేవలం 16 శాతం మాత్రమే. వ్యవస్థపై అపనమ్మకం, బాధితుల మౌనం ఏ స్థాయిలో ఉన్నాయో ఈ లెక్కలు చెబుతున్నాయి. వేధింపు ఘటనల్లో 32 శాతం.. తెలిసిన ప్రాంతాలలో జరుగుతుండగా, 29 శాతం ప్రయాణ సమయాలలో సంభవిస్తున్నాయని నివేదిక తెలిపింది.
కోహిమాలో సురక్షితం
నగరాల వారీ భద్రతా అసమానతలను కూడా నివేదిక పొందుపరిచింది. కోహిమా, విశాఖపట్నం, భువనేశ్వర్.. భద్రతా సూచికలో అగ్రస్థానంలో ఉన్నాయి, తరువాత ఐజ్వాల్, గ్యాంగ్‌టక్, ఇటానగర్ ముంబై ఉన్నాయి. ఇందుకు భిన్నంగా పట్నా, జైపుర్, ఫరీదాబాద్, ఢిల్లీ, కోల్‌కతా, శ్రీనగర్, రాంచీ మరీ దిగువ స్థానాల్లో ఉన్నాయి. రాంచీ అంత సురక్షితమైనది కాదని 44 శాతం మంది మహిళలు భావిస్తుండగా, ఢిల్లీ ఫరీదాబాద్‌లలో ఈ శాతం దాదాపు 42గా ఉంది. దేశంలోని మహిళల భద్రతను పట్టణ పరిస్థితులు, అక్కడి పాలనా యంత్రాంగం పనితీరు ప్రభావితం చేస్తున్నట్లు ‘నారీ 2025’ తేల్చి చెప్పింది.
పనిచేసే చోట భద్రమే
పని చేసే చోట భద్రత గురించి 91 శాతం మంది మహిళలు.. కార్యాలయంలోని వాతావరణం సురక్షితంగా ఉందని తెలిపారు. అయితే వారిలో దాదాపు సగం మంది, తమ సంస్థ తప్పనిసరి ‘లైంగిక వేధింపుల నివారణ’ (పి.ఓ.ఎస్.హెచ్. – ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ హెరాస్‌మెంట్) యంత్రాంగాన్ని అమలు చేస్తోందో లేదో తమకు తెలియదని చెప్పారు.
వేధింపులు
⇒ బహిరంగ వేధింపులకు గురయ్యామని చెప్పిన మహిళలు 7 శాతం. 24 ఏళ్లలోపు యువతుల్లో ఇది 14 శాతం.
⇒ వేధింపు ఘటనల్లో 32 శాతం తెలిసిన ప్రాంతాల్లోనే జరుగుతున్నాయి.
⇒ ముఖ్యంగా 38% ఇరుగు పొరుగు వారి వల్లే జరుగుతున్నాయి.
⇒ 29 శాతం ప్రయాణాల సమయాలలో సంభవిస్తున్నాయి.
⇒ వేధింపుల్లో మాటలతో అత్యధికంగా 58 శాతం చోటు చేసుకుంటున్నాయి.
⇒ వేధింపులకు గురైనవారిలో ప్రతి ముగ్గురిలో కేవలం ఒక్కరే ఫిర్యాదు చేస్తున్నారు.