
కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా
త్రివిధ దళాల్లో రాణిస్తున్న ధీరవనితలు
2024 నాటికి ఆర్మీలో 4.12%
ఎయిర్‌ఫోర్స్‌లో 13.40%
నేవీలో 6.81%
రక్షణ పరిశోధన రంగంలో 15.53%
పోలీసు విభాగంలో 9.74% అతివలే
కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్.. ఇప్పుడు యావత్ భారతదేశం మారుమోగుతున్న పేర్లు. ఆపరేషన్ సిందూర్ వివరాలు తెలిపేందుకు ఏర్పాటుచేసిన అధికారిక విలేకరుల సమావేశానికి ఇద్దరు మహిళా అధికారులు నాయకత్వం వహించడం ఒక చరిత్ర. వీరిద్దరూ దేశంలో మన నారీ శక్తికి ప్రతిబింబాలు. అంతేకాదు, సాయుధ దళాల్లో పెరుగుతున్న మహిళల బలానికి ప్రతీక. దీంతో ఇప్పుడు అందరి దృష్టీ... మన మహిళా శక్తిపై పడింది. అసలు మన దేశంలో త్రివిధ దళాల్లో ఎంతమంది సివంగులు ఉన్నారు.. రక్షణ పరిశోధన రంగంలో ఎందరు మహిళా మేధావులు మన కీర్తి పతాకను అంతర్జాతీయ యవనికపై రెపరెపలాడేలా చేస్తున్నారు... పోలీసు విభాగంలో రాణిస్తున్న అతివలు ఎందరు... ఇవిగో ఆ ఆసక్తికర వివరాలు..
రక్షణ దళాల్లో రుద్రమలు
మనదేశంలోని త్రివిధ దళాల్లో అత్యధిక శాతం మహిళలు ఉన్నది ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో. అందులో 2024 నాటికి 13.40 శాతం అతివలే. ఆ తరువాత.. ఇండియన్ నేవీలో అత్యధిక శాతం మహిళలు ఉన్నారు. 2020లో 5.53 శాతం నారీ శక్తి ఉంటే.. 2024 నాటికి అది 6.81 శాతానికి పెరిగింది. ఇక, ఆర్మీలో 2020లో 3.84 శాతం వీరనారీమణులు ఉంటే.. 2024కి అది 4.12 శాతానికి పెరిగింది.

రక్షణ పరిశోధన రంగంలోనూ...
రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ.. డీఆర్‌డీఓలో మహిళా ప్రాతినిధ్యం చాలా ఎక్కువగా ఉంది. హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిని అయిన జే.మంజుల.. డీఆర్‌డీఓలో శాస్త్రవేత్తగా అడుగుపెట్టి అంచెలంచెలుగా ఏకంగా ఆ సంస్థ డైరెక్టర్ పదవినే చేపట్టారు. ఇలా శాస్త్రవేత్తలుగా, వివిధ విభాగాల్లో రాణిస్తున్న మహిళలు డీఆర్‌డీఓలో అత్యధిక శాతంలో ఉన్నారు. 2020 నుంచి చూస్తే సగటున 3,000 మంది.. అంటే మొత్తం ఉద్యోగుల్లో సగటున 15 శాతానికిపైగా మహిళలే ఉన్నారు.

పోలీసు బలగం దేశంలో 2023 జనవరి
1 నాటికి 31,50,331 మంది పోలీసు సిబ్బంది ఉంటే.. అందులో మహిళలు 3,06,748. అంటే మొత్తం సిబ్బందిలో 9.74 శాతం. ఇందులో కూడా సివిల్ పోలీస్ విభాగంలో అత్యధికంగా 14.97 శాతం ఉన్నారు. డిస్ట్రిక్ట్ ఆర్మ్‌డ్ రిజర్వ్ పోలీస్ (డీఏఆర్‌పీ) విభాగంలో 11.31 శాతం, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్)లో 9.22 శాతం, కేంద్ర పారిశ్రామిక భద్రతా దళంలో (సీఐఎస్‌ఎఫ్) 7.04 శాతం అతివలే.