
సాక్షి, హైదరాబాద్: శంకర నేత్రాలయ USA ఆధ్వర్యంలో అడాప్ట్-ఎ-విలేజ్‌కి అనూహ్య స్పందన లభిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో.. ఎన్నారై దాతల సహకారంతో గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించిన ఈ ఉచిత కంటి వైద్య శిబిరాల్లో వేల మంది చికిత్స అందుకుంటున్నారు. మరిన్ని గ్రామాల్లో ఉచిత మొబైల కంటి శిబిరాలు(Mobile Eye Surgical Unit) నిర్వహించేందుకు ఇంకొందరు ముందుకు వస్తున్నారు
శంకర నేత్రాలయ USA అక్టోబర్ 17న అడాప్ట్-ఎ-విలేజ్ దాతలతో ముఖాముఖి సమావేశం నిర్వహించింది. శంకర నేత్రాలయ USA అధ్యక్షుడు బాల రెడ్డి ఇందుర్తి నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో అనేక దాతలు తమ అనుభవాలను పంచుకున్నారు. అమెరికా, సింగపూర్, యూకే నుంచి ఎన్నారైలు ఈ సేవా కార్యక్రమాన్ని మద్దతు ప్రకటించారు. తమ వంతుగా సాయం అందించడంపై సంతోషం వ్యక్తం చేశారు.


ఈ కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో కంటి శిబిరాలు నిర్వహించి వీలైనంత మందికి ఉచిత చికిత్స అందించబోతున్నారు. దాతలు తమ స్వగ్రామాల్లో శిబిరాలు నిర్వహణకు స్పాన్సర్లుగా వ్యవహరిస్తున్నారు. వందల మందికి కంటి శస్త్రచికిత్సలు, స్క్రీనింగ్‌లు, భోజనం, రవాణా సేవలు ఉచితంగా అందజేస్తారు. అక్టోబర్ 30వ తేదీ దాకా 11 రోజులపాటు అడాప్ట్ ఏ విలేజ్ కార్యక్రమం జరగనుంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వస్థలం కొండా రెడ్డిపల్లిలో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ విద్యా శాఖ మేనేజింగ్ డైరెక్టర్ గణపతి రెడ్డి ఇందుర్తి, రేవంత్ సోదరుడు కృష్ణారెడ్డి, హూస్టన్‌కు చెందిన రియల్టర్ రాఘవేంద్ర రెడ్డి సుంకిరెడ్డి తదితరులు హాజరయ్యారు. దాతలు ముందుకు రావడంతో పాటు.. స్థానిక వైద్యులు, రోటరీ క్లబ్స్, పలువురు నాయకుల సహకారంతో ఈ శిబిరం విజయవంతంగా ముందుకు సాగుతోందని బాలరెడ్డి తెలిపారు.