అమెరికా డల్లాస్‌లో కాల్పులు.. తెలంగాణ విద్యార్థి మృతి | Harish Rao condoled Hyderabad Student’s family killed in Dallas shooting | Sakshi
Sakshi News home page

అమెరికా డల్లాస్‌లో కాల్పులు.. తెలంగాణ విద్యార్థి మృతి

Oct 4 2025 3:35 PM | Updated on Oct 4 2025 7:05 PM

Harish Rao condoled Hyderabad Student’s family killed in Dallas shooting

సాక్షి, హైదరాబాద్‌: అమెరికాలో గన్‌ కల్చర్‌ మరో నిండు ప్రాణం బలి తీసుకుంది. టెక్సాస్‌ స్టేట్‌ డల్లాస్‌ నగరంలో జరిగిన కాల్పుల ఘటనలో తెలంగాణకు చెందిన చంద్రశేఖర్‌ పోలే(27) కన్నుమూశాడు(Telangana Student Dies Dallas Gun Fire). భారత కాలమానం ప్రకారం.. శనివారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. 

చంద్రశేఖర్‌ పోలే స్వస్థలం హైదరాబాద్‌ ఎల్బీనగర్‌ బీఎన్‌ రెడ్డి. బీడీఎస్‌ పూర్తయ్యాక 2023లో ఉన్నత చదువుల కోసం చంద్రశేఖర్‌ డల్లాస్‌ వెళ్లాడు. ఆరు నెలల కిందటే అతని మాస్టర్స్‌ డిగ్రీ పూర్తైంది. అయితే ఫుల్‌టైం ప్లేస్‌మెంట్‌ కోసం ఎదురు చూసే క్రమంలో స్థానికంగా ఓ గ్యాస్‌ ఫిల్లింగ్‌ స్టేషన్‌లో జాబ్‌ చేస్తున్నాడు. అమెరికా కాలమానం ప్రకారం.. శుక్రవారం రాత్రి విధుల్లో ఉన్న అతనిపై కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో బుల్లెట్‌ గాయాలతో చంద్రశేఖర్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. 

ఈ ఘటనలో బీఎన్‌ రెడ్డిలోని చంద్రశేఖర్‌ కుటుంబం నివాసం ఉండే కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘటన గురించి సమాచారం తెలుసుకున్న బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత హరీష్‌రావు, ఎమ్మెల్యే సుధీర్‌ రెడ్డితో కలిసి బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. అనంతరం ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ ఎక్స్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారాయన. 

‘‘బీడీఎస్ పూర్తి చేసి.. ఉన్నత పై చదువుల కోసం అమెరికా (డల్లాస్) వెళ్ళిన ఎల్బీనగర్ కు చెందిన దళిత విద్యార్థి చంద్ర శేఖర్ పోలే ఈరోజు తెల్లవారు జామున దుండగులు జరిపిన కాల్పులో మృతి చెందటం విషాదకరం. ఉన్నత స్థాయిలో ఉంటాడనుకున్న కొడుకు ఇక లేడు అన్న విషయం తెలిసి తల్లిదండ్రులు పడుతున్న అవేదన చూస్తే గుండె తరుక్కు పోతున్నది..

.. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని చంద్ర శేఖర్ పార్థీవ దేహాన్ని వీలైనంత త్వరగా స్వస్థలానికి తరలించేందుకు కృషి చేయాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం’’ అని అన్నారాయన.

సీఎం రేవంత్‌ విచారం
అమెరికాలో హైదరాబాద్‌కు చెందిన చంద్రశేఖర్‌ మృతి చెందడంపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘‘అమెరికాలో పోలే చంద్రశేఖర్‌ మరణం ఆవేదన కలిగించింది. చంద్రశేఖర్‌ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది. అతని మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకువచ్చేందుకు సహకారం అందిస్తాం అని ఒక ప్రకటనలో తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement