
ఐర్లాండ్ లో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ఐర్లాండ్‌లో స్థిరపడిన తెలంగాణ ఎన్నారైలు అల్లే శ్రీనివాస్, బలరాం కొక్కుల ఆధ్వర్యంలో డబ్లిన్ నగరంలో మంగళవారం సద్దుల బతుకమ్మ వేడుకలు కన్నుల పండువగా నిర్వహించారు. ఈ బతుకమ్మ వేడుకలకు సుమారు 750 మంది హాజరయ్యారు. దుర్గా పూజతో ప్రారంభమైన ఈ వేడుకల్లో ఆడపడుచులు బతుకమ్మ, కోలాటం, దాండియా కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. పిల్లలకు బతుకమ్మ పండుగ విశేషాలను వివరించారు.
చిన్నారుల కోసం ప్రత్యేకంగా మ్యాజిక్ షో ఏర్పాటు చేశారు. బతుకమ్మను అందంగా పేర్చిన ఆడపడుచులకు బహుమతులు కూడా ప్రధానం చేశారు. వేడుకలకు హాజరైన వారందరికీ ప్రసాదంతోపాటు రుచికరమైన వంటలు ఏర్పాటు చేశారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను తమ భవిష్యత్తు తరాలకు కూడా తెలియచేయాలనే లక్ష్యంతో తెలంగానైట్స్ ఆఫ్ ఐర్లాండ్ (Telanganites Of Ireland) ఆధ్వర్యంలో గత 13 ఏళ్లుగా ఏటా ఈ బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తున్నారు. సుమారు 40 మంది వాలంటీర్లు, 50 మంది దాతలు ముందుకొచ్చి బతుకమ్మ వేడుకల నిర్వహణకు ఏటా సహాయ సహకారాలు అందిస్తున్నారు.