రెండో టెస్టులోనూ ఓడిన ఐర్లాండ్
కర్టీస్ కాంపెర్ పోరాటం వృథా
మిర్పూర్: బ్యాటర్ల విజృంభణకు బౌలర్ల సహకారం తోడవడంతో... ఐర్లాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను బ్లంగాదేశ్ క్లీన్‌స్వీప్ చేసింది. ఆదివారం ముగిసిన రెండో టెస్టులో ఆతిథ్య బంగ్లాదేశ్ 217 పరుగుల తేడాతో ఐర్లాండ్‌ను చిత్తు చేసింది. తద్వారా రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 2–0తో చేజిక్కించుకుంది. 509 పరుగుల భారీ లక్ష్యఛేదనలో 176/6తో ఆదివారం ఆఖరి రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఐర్లాండ్ చివరకు 113.3 ఓవర్లలో 291 పరుగులకు ఆలౌటైంది.
కర్టీస్ కాంపెర్ (259 బంతుల్లో 71 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) మ్యాచ్‌ను ‘డ్రా’ చేసేందుకు శతవిధాలా ప్రయత్నించాడు. చివరి వరుస బ్యాటర్లతో కలిసి చక్కటి పోరాటంతో బంగ్లాదేశ్‌ను విసిగించాడు. ఆఖరి రోజు దాదాపు 60 ఓవర్ల పాటు క్రీజులో నిలిచిన అతడు మ్యాచ్‌ను కాపాడలేకపోయినా... తన అసమాన పోరాటంతో ఆకట్టుకున్నాడు.
జోర్డాన్ నీల్ (46 బంతుల్లో 30; 5 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి 85 బంతుల్లో 48 పరుగులు జోడించిన కాంపెర్... ఆ తర్వాత పదో స్థానంలో బ్యాటింగ్‌కు వచి్చన గవిన్ హోయ్ (104 బంతుల్లో 37; 4 ఫోర్లు)తో సుదీర్ఘంగా బ్యాటింగ్ చేశాడు. ఈ జోడీ 9వ వికెట్‌కు 191 బంతులాడి 54 పరుగులు చేసింది. బంగ్లా స్పిన్నర్లు ఎంతగా పరీక్షిస్తున్నా ఈ జంట సహనం కోల్పోలేదు.
దీంతో ఐర్లాండ్ మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకునేలా కనిపించినా... హసన్ మురాద్ వరుస బంతుల్లో గవిన్, మాథ్యూ (0)ను అవుట్ చేసి ఐర్లాండ్ ఆశలపై నీళ్లు చల్లాడు. బంగ్లా బౌలర్లలో తైజుల్ ఇస్లామ్, హసన్ మురాద్ చెరో 4 వికెట్లు పడగొట్టారు. అంతకుముందు బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 476 పరుగులు చేయగా... ఐర్లాండ్ 265 పరుగులకు ఆలౌటైంది.
అనంతరం బంగ్లా 297/4 వద్ద రెండో ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. కెరీర్‌లో వందో టెస్టులో సెంచరీతో మెరిసిన ముష్ఫికర్ రహీమ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’, తైజుల్ ఇస్లామ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డులు దక్కాయి. ఇరు జట్ల మధ్య గురువారం నుంచి టి20 సిరీస్ ప్రారంభం కానుంది.


