
అమెరికాలో తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో తెలుగు సాహిత్యంలో కవితా వైభవం.. డా. గోరటి వెంకన్న మాట – పాట సాహితీసభ జరిగింది. ఆటా , డాటా , డి–టాబ్స్, జిటిఎ, నాట్స్ , టాన్ టెక్స్ , టిపాడ్ సంస్థల సహకారంతో.. డాలస్ లో పెద్ద సంఖ్యలో సాహిత్యాభిమానులతో ఈ కార్యక్రమం ఉత్సాహంగా, ఉల్లాసంగా జరిగింది.
గోరటి వెంకన్న కుటుంబ సభ్యుల సమక్షంలో ఆయనకు మనకాలపు మహాకవి అనే బిరుదును ప్రదానం చేశారు. సన్మానపత్రం, కిరీటం, దుశ్శాలువాతో, పుష్పగుచ్చాలతో అందరి హర్షాతిరేకాలమధ్య ఘనంగా సన్మానించారు.


అంతకు ముందు.. తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర అందరి హర్షధ్వానాల మధ్య గోరటి వెంకన్న ను వేదికపైకి ఘనంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో డా. గోరటి వెంకన్న అనేక పాటలను గానం చేశారు. గల్లీ చిన్నది, గరీబోళ్ల కథ పెద్దది లాంటి ఎన్నో పాటలతో రెండున్నర గంటలపాటు అందరినీ మంత్రముగ్దుల్ని చేశారు.

డా. గోరటి వెంకన్న మాట్లాడుతూ.. ప్రసాద్ తోటకూర సభానిర్వహణ ఆద్యంతం అందరినీ ఆకట్టుకుందని, తాను చిందులెయ్యకుండా నిలబెట్టి రెండున్నర గంటలపాటు పాటలను, దానిలో ఉన్న సాహిత్యాన్ని రాబట్టిన ఘనత ప్రసాద్ దేనని, ఇలాంటి కార్యక్రమం చెయ్యడం ఇదే తొలిసారి అన్నారు. ఎంతో ప్రేమతో అన్ని సంఘాలను ఒకే వేదికమీదకు తీసుకువచ్చి ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించిన డా.తోటకూర ప్రసాద్ కు, వివిధ సంఘాల ప్రతినిధులకు, అధిక సంఖ్యలో తరలివచ్చిన సాహిత్యాభిలాషులకు పేరు పేరునా గోరటి వెంకన్న కృతజ్ఞతలు తెలియజేశారు.