
పురుషులతో పోల్చితే రెండురెట్లు మానసిక ఒత్తిడులు.. మహిళల్లోని జన్యు వైవిధ్యాలే అందుకు కారణం
‘సెక్స్–స్ట్రాటిఫైడ్ జీనోమ్’అధ్యయనంలో వెల్లడి
మహిళలు, పురుషులకు వేర్వేరు చికిత్స విధానాలు అవసరమని సూచన
సాక్షి, హైదరాబాద్: కుంగుబాటు, మానసిక ఒత్తిడి సమస్యలు పురుషుల కంటే మహిళల్లో రెండురెట్లు అధికంగా ఉన్నాయని ఓ అంతర్జాతీయ అధ్యయనం తేల్చింది. స్త్రీలలో ఉండే వేలాది ప్రత్యేకమైన జన్యు వైవిధ్యాలే ఇందుకు కారణమని గుర్తించారు. ఈ ప్రత్యేక జన్యు నిర్మాణం మహిళలను సామాజిక, పర్యావరణ ఒత్తిళ్లకు అధికంగా ప్రభావితం చేస్తోంది. ఇటీవల నేచర్ కమ్యూనికేషన్స్ జర్నల్‌లో ప్రచురితమైన ‘సెక్స్–్రస్టాటిఫైడ్ జీనోమ్–వైడ్ అసోసియేషన్ మెటా–అనాలిసిస్ ఆఫ్ మేజర్ డిప్రెసివ్ డిజార్డర్’అనే పరిశోధన పత్రంలో ఈ అంశం వెల్లడైంది.
మేజర్ డిప్రెసివ్ డిజార్డర్ (ఎండీడీ)తో ముడిపడి ఉన్న ఏడు వేల కంటే ఎక్కువ జన్యు వైవిధ్యాలు పురుషుల్లో ఉంటే.. అందుకు అదనంగా మహిళలు ఆరు వేల జన్యు వైవిధ్యాలను కలిగి ఉన్నారని తేలింది. ఈ అధ్యయనంలో భాగంగా కుంగుబాటు (డిప్రె షన్)తో బాధపడుతున్న 1.3 లక్షల మంది మహిళలు, 65 వేల మంది పురుషుల జన్యు డేటాను పరిశోధకులు విశ్లేషించారు. అలాగే డిప్రెషన్‌లో లేని 2.9 లక్షల మందికి చెందిన జన్యు డేటాను కూడా విశ్లేషించారు. ఈ సర్వేలో ఆ్రస్టేలియా, నెదర్లాండ్స్, యూకే, యూఎస్‌లకు చెందినవారు అధికంగా పాల్గొన్నారు.
ఏమిటీ జన్యు వైవిధ్యాలు?
» జన్యు వైవిధ్యం అంటే కేవలం డీఎన్‌ఏ క్రమంలో మార్పు. వీటిలో కొన్ని వైవిధ్యాలు అంత ప్రమాదకరం కాదు. మరికొన్ని కుంగుబాటు, నిరాశతో సహా అనారోగ్యాల ప్రమాదాన్ని పెంచుతాయి. ఈ వైవిధ్యాలు తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా రావొచ్చు లేదా ఆకస్మికంగా సంభవించవచ్చు. మహిళల్లో ఈ వైవిధ్యాలు మెదడు అభివృద్ధి, హార్మోన్లు, జీవక్రియ వంటి ప్రక్రియలతో సంకర్షణ చెందుతాయి. దీనివల్ల వారు కుంగుబాటుతోపాటు ఇతర రుగ్మతలకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
కుంగుబాటుతో బరువు పెరుగుదల, నిద్రలేమి..
» కుంగుబాటు, ఒత్తిడితో బాధపడుతున్న మహిళలు బరువు పెరగటం, నిద్రలేమి, అలసట వంటి సమస్యలు ఎదుర్కొంటారని సర్వేలో పేర్కొన్నారు.
» మహిళల నిరాశ లక్షణానికి జన్యు మార్పులు కారణమని పరిశోధకులు కనుగొన్నారు.
» దీనికి విరుద్ధంగా నిరాశతో బాధపడుతున్న పురుషులు తరచుగా కోపం, దూకుడు ప్రదర్శిస్తారు
» డిప్రెషన్–లింక్డ్ డీఎన్‌ఏ తేడాలు వారసత్వంగా రావచ్చు లేదా ఆకస్మికంగా సంభవించవచ్చు.
» ఇవి పుట్టుకతో వచ్చే డీఎన్‌ఏ తేడాలు అని పరిశోధకులు చెప్పారు.
» ఈ పరిశోధన ఫలితాలు కుంగుబాటు నిర్ధారణ, చికిత్సకు లింగ నిర్దిష్ట విధానాల అవసరాన్ని నొక్కిచెబుతున్నాయి.
» ఉదాహరణకు మహిళలకు జీవక్రియ మార్గాలను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా మంచి చికిత్స అందించవచ్చు
» పురుషులకు వారి ప్రవర్తన లేదా న్యూరోకాగ్నిటివ్ నమూనాలపై దృష్టి పెట్టడం ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చు.