
దేశవ్యాప్తంగా 7.2 శాతం మేర పెరిగిన నేరాలు
మహిళలపై 0.7 శాతం, చిన్నారులపై 9.2 శాతం నేరాల పెరుగుదల
31.2 శాతం పెరిగిన సైబర్ నేరాలు
2023లో మొత్తం 18,236 సైబర్ కేసుల నమోదు
వెల్లడించిన ఎన్‌సీఆర్‌బీ 2023 నివేదిక
సాక్షి, హైదరాబాద్ : దేశవ్యాప్తంగా 2023లో నేరాల్లో 7.2 శాతం పెరుగుదల నమోదైంది. అన్ని రకాల నేరాలు కలిపి దేశవ్యాప్తంగా 2022లో 58,24,946 కేసులు నమోదు కాగా..2023లో 62,41,569 కేసులు నమోదైనట్టు ఎన్‌సీఆర్‌బీ (నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో) 2023 నివేదిక వెల్లడించింది. ఆ ఏడాది నమోదైన వాటిల్లో 27,53,235 కేసుల్లో చార్జ్ïÙట్ పూర్తయింది. ప్రతి లక్ష మంది జనాభాకు 2022లో 422.2గా ఉన్న నేర నమోదు శాతం..2023లో 448.3కి పెరి గినట్టు గణాంకాలు వెల్లడించాయి.
తెలంగాణలో 2022లో 1,65,830 కేసులు నమోదు కాగా, 2023 నాటికి అది 1,83,644కి చేరినట్టు నివేదిక పేర్కొంది. ఈ మేరకు నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో 2023 వార్షిక నివేదికను సోమవారం విడుదల చేసింది. అందులో పేర్కొన్న ప్రకారం దేశవ్యాప్తంగా పలు రకాల నేరాలకు సంబంధించిన గణాంకాలు ఇలా..
హత్యలు తగ్గాయి
2023లో మొత్తం 27,721 హత్య కేసులు నమోదదయ్యాయి. 2022తో పోలిస్తే 2023లో 2.8 శాతం తగ్గుదల కనిపించింది. హత్య కేసుల్లో అత్యధికంగా వివాదాలు (9,209 కేసులు) ప్రధాన కారణంగా ఉన్నాయి, ఆ తర్వాత ‘వ్యక్తిగత శత్రుత్వం లేదా ద్వేషం’(3,458 కేసులు), ‘వ్యక్తిగత లబ్ధి లేదా లాభం (1,890 కేసులు) కారణంతో జరిగాయి.
5.6 శాతం పెరిగిన కిడ్నాప్ కేసులు
2022, 1,07,588 కిడ్నాప్ కేసులు నమోదు కాగా 2023లో 1,13,564 కేసులు నమోదయ్యాయి. 2022తో పోలిస్తే 2023లో 5.6% పెరుగుదల నమోదైనట్టు ఎన్‌సీఆర్‌బీ నివేదిక వెల్లడించింది. 2023లో కిడ్నాపైన వారిలో 1,40,813 మంది జాడను పోలీసులు గుర్తించగా, వీరిలో 1,39,164 మంది బతికి ఉన్నారు. మరో 1,649 మంది చనిపోయినట్టు గుర్తించారు.
మహిళలపై నేరాల్లో స్వల్ప పెరుగుదల
మహిళలపై నేరాల్లో స్వల్ప పెరుగుదల నమోదైంది. 2022లో 4,45,256 కేసులు నమోదు కాగా..2023లో 4,48,211 కేసులు మహిళలపై నేరాలకు సంబంధించి నమోదయ్యాయి. ఇందులో భర్త లేదా అత్తింటివారి దాడులకు సంబంధించి 1,33,676 కేసులు, మహిళల కిడ్నాప్‌నకు సంబంధించి 88,605 కేసులు, లైంగిక వేధింపులకు సంబంధించినవి 83,891 కేసులు, పోక్సో యాక్టు కింద 66,232 కేసులు నమోదయ్యాయి.
చిన్నారులపై నేరాల నమోదులో 9.2 శాతం పెరుగుదల
చిన్నారులపై నేరాల నమోదులో 2022తో పోలిస్తే 2023లో 9.2 శాతం పెరిగింది. 2023లో పిల్లలపై మొత్తం 1,77,335 నేరాలు నమోదయ్యాయి. వీటిలో పిల్లల కిడ్నాప్‌నకు సంబంధించినవి 79,884 కేసులు, లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ చట్టం (పోక్సో చట్టం) కింద 67,694 కేసులు నమోదయ్యాయి.
సైబర్ నేరాల్లో 31.2 శాతం పెరుగుదల నమోదు
సైబర్ నేరాల్లో భారీగా పెరుగుదల నమోదవుతోంది. 2022తో పోలిస్తే 2023లో సైబర్ నేరాల్లో 31.2 శాతం పెరుగుదల నమోదైంది. 2023లో దేశవ్యాప్తంగా మొత్తం 86,420 సైబర్ క్రైం కేసులు నమోదయ్యాయి. 2023లో నమోదైన వాటిలో 68.9 శాతం మోసం, లైంగిక దోపిడీ 4.9 శాతం కేసులు, దోపిడీ 3.8శాతం కేసులు ఉన్నాయి.
ఆరు శాతం పెరిగిన ఆర్థిక నేరాలు
ఆర్థిక నేరాల్లోనూ గత ఏడాదితో పోలిస్తే..ఆరు శాతం పెరుగుదల నమోదైనట్టు ఎన్‌సీఆర్‌బీ 2023 నివేదిక వెల్లడించింది. 2023 మొత్తం 2,04,973 కేసులు నమోదయ్యాయి. వీటిలో నమ్మక ద్రోహం, ఫోర్జరీ, మోసం కేసులు ఎక్కువగా ఉన్నాయి.
ఈసారి ఎంతో ఆలస్యంగా నివేదిక..:
ఎన్‌సీఆర్‌బీ నివేదిక ‘క్రైం ఇన్ ఇండియా’సాధారణంగా ఏడాది మధ్యలో విడుదల చేస్తారు. కానీ, 2023 నివేదికల ప్రచురణ చాలా ఆలస్యమైంది. డేటా సేకరణలో ఆలస్యం కారణంగానే 2023 నివేదిక ఆలస్యం అవుతోందని ఇటీవల కేంద్ర హోంశాఖ సైతం పార్లమెంట్‌లో ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పింది. కాగా, 2022 సంవత్సరానికి సంబంధించిన నివేదిక సైతం డిసెంబర్ 2023లో విడుదలైంది.