
వ్యవసాయ, పారిశ్రామిక, సామాజిక రంగాల్లో ఏటేటా పెరుగుతున్న రుణాలు
2023–24తో పోలిస్తే 2024–25 ఆర్థిక సంవత్సరంలో పెరిగిన రూ.58 వేల కోట్ల రుణాలు
విద్య కోసం తీసుకునే రుణాల్లో తగ్గుదల... 2023–24తో పోలిస్తే తగ్గిన రూ.300 కోట్లు
గృహ రుణాలూ తక్కువే... 2024–25లో రూ.30 వేల కోట్లు దాటిన హౌస్ లోన్లు
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చే రుణాల్లో మాత్రం పెరుగుదల
సాక్షి, హైదరాబాద్: బ్యాంకులు వివిధ రంగాలకు ఇచ్చే రుణాలు ఏటేటా పెరుగుతున్నాయి. తాజాగా రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) విడుదల చేసిన నివేదిక ప్రకారం 2024–25 ఆర్థిక సంవత్సరంలో అన్ని రకాల రుణాలు కలిపి రూ.10 లక్షల కోట్లకు పైగా బ్యాంకులు విడుదల చేశాయి.
ఇందులో రూ.1.5 లక్షల కోట్లు వ్యవసాయ సంబంధిత రుణాలు కాగా, రూ.1.37 లక్షల కోట్ల వరకు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల రుణాలున్నాయి. అన్ని రకాల రుణాలు కలిపి 2023–24 ఆర్థిక సంవత్సరంలో రూ.9.79 లక్షల కోట్లకు పైగా రుణాలివ్వగా, అంతకంటే రూ.58 వేల కోట్లు ఎక్కువగా 2024–25 ఆర్థిక సంవత్సరంలో రుణాలు విడుదల కావడం గమనార్హం.
ఆ రెండు రంగాల్లోనే వృద్ధి
బ్యాంకుల ద్వారా ఇచ్చే రుణాల విషయంలో వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో వృద్ధి కనిపిస్తోంది.
» 2023–24లో వ్యవసాయానికి రూ.1.39 లక్షల కోట్లకు పైగా రుణాలివ్వగా, 2024–25లో రూ.1.59 లక్షల కోట్ల వరకు అప్పులు మంజూరయ్యాయి. అంటే గత ఏడాది కంటే రూ.20 వేల కోట్ల మేర ఈసారి వ్యవసాయ రుణాలు పెరిగాయన్నమాట.
» సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్‌ఎంఈ) కూడా రుణ పరపతి పెరిగింది. 2023–24లో రూ.1.19 లక్షల కోట్లకు పైగా పారిశ్రామిక రుణాలను బ్యాంకులివ్వగా, 2024–25లో రూ.1.37లక్షల కోట్లకు పెరిగింది. అంటే గతం కంటే రూ.18 వేల కోట్ల పారిశ్రామిక రుణాలు పెరిగాయి.
» విద్య, గృహ నిర్మాణం కోసం తీసుకునే రుణాల్లో తగ్గుదల కనిపించింది. విద్య కోసం 2023–24లో తీసుకున్న దాని కంటే రూ. 300 కోట్లకు పైగా తక్కువగా 2024– 25లో తీసుకున్నారని ఎస్‌ఎల్‌బీసీ గణాంకాలు చెబుతున్నాయి. గృహ రుణాల విషయంలోనూ ఇదే స్థాయిలో తగ్గుదల కనిపించింది. హౌస్ లోన్ల కింద 2023–24లో తీసుకున్న రుణాల కంటే 2024–25లో రూ.1500 కోట్ల వరకు తగ్గాయి.
వ్యక్తిగత రుణాలు ఎక్కువే
ఎస్‌ఎల్‌బీసీ నివేదికలో పేర్కొన్న గణాంకాల ప్రకారం మహిళలకు వ్యక్తిగత రుణాలు ఈసారి భారీగానే పెరిగాయి. మహిళలతోపాటు ఎస్సీ, ఎస్టీలు, బలహీనవర్గాలు, మైనార్టీలు.. ఇలా సామాజికవర్గాల వారీగా ఇచి్చన వ్యక్తిగత రుణాలన్నింటిలో పెరుగుదల కనిపించింది. ఇక, స్వయం సహాయక సంఘాలకు రుణాలు కూడా పెద్ద ఎత్తున మంజూరు చేసినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
» 2023–24లో దాదాపు రూ.35వేల కోట్లు రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాలకు రుణాలివ్వగా, 2024–25లో అది రూ. 39,072 కోట్లకు చేరింది. అప్పుల లెక్క అలా ఉంటే... రాష్ట్రంలోని అన్ని బ్యాంకుల్లో కలిపి రూ.8.40 లక్షల కోట్ల డిపాజిట్లు ఉన్నాయి. ఈ లెక్కన డిపాజిట్లతో పోలిస్తే 128 శాతం అప్పులు ఉండడం గమనార్హం.