
ఆన్ లైన్ మోసాల్లో ఇలాంటివే ఎక్కువ
సైబర్ వేధింపులు, ప్రొఫైల్ హ్యాకింగ్ కూడా
నాలుగేళ్లలో మూడురెట్లు పెరిగిన ఫిర్యాదులు
ఎన్ సీఆర్‌పీలో వెల్లువెత్తుతున్న కంప్లయింట్స్
నకిలీ ప్రొఫైల్, సైబర్ వేధింపులు, ప్రొఫైల్ హ్యాకింగ్.. తీరు ఏదైనా సైబర్ నేరాల సంఖ్య భారత్‌లో ఏటా పెరుగుతూనే ఉంది. జనం డిజిటల్‌కు పెద్ద ఎత్తున మళ్లుతుండడం, అదే సమయంలో పూర్తిగా అవగాహన ఉండకపోవడం.. సైబర్ నేరగాళ్లకు కలిసి వస్తున్నాయి. ముఖ్యంగా ఆన్ లైన్ , సామాజిక మాధ్యమాల వేదికగా నకిలీ ఆన్ లైన్ ఖాతాలు తెరిచి చేస్తున్న మోసాలే ఎక్కువగా ఉంటున్నాయి. – సాక్షి, స్పెషల్ డెస్క్
ఇతర వ్యక్తులు, బ్రాండ్, సంస్థలా కనిపించడానికి నకిలీ ఆన్ లైన్ ఖాతా తెరిచి చేస్తున్న మోసాలు దేశంలో అధికంగా ఉంటున్నాయి. అక్రమంగా డబ్బు సంపాదించే లక్ష్యంతో వ్యక్తిగత సమాచారం, ఫొటోలు, వివరాలను ఉపయోగించి సైబర్ నేరస్తులు ఇతరులను మోసం చేస్తున్నారు. గతేడాది ఇలాంటి ఘటనలు నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (ఛిyb్ఛటఛిటజీఝ్ఛ.జౌఠి.జీn) ద్వారా 39,846 నమోదయ్యాయి. నాలుగేళ్లలో ఈ తరహా మోసాలు మూడు రెట్లు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఎన్ సీఆర్‌పీ వేదిక ద్వారా సైబర్ వేధింపుల ఫిర్యాదులు మూడున్నర రెట్లు పెరిగి 39,077కు చేరాయి. ప్రొఫైల్ హ్యాకింగ్, గుర్తింపు చోరీ ఘటనలు మూడింతలకుపైగా అధికమై 38,295కు పెరిగాయి. ఆన్ లైన్ జాబ్, మ్యాట్రిమోనియల్ మోసాలు కూడా పెరుగుతూ ఉన్నాయి.

కేసులు ఎన్నోరెట్లు..
అధికారిక లెక్కల ప్రకారం గతేడాది దేశవ్యాప్తంగా 22 లక్షలకుపైగా సైబర్ సెక్యూరిటీ ఘటనలు నమోదు కావడం ఆందోళన కలిగించే అంశం. ఆన్ లైన్ , సామాజిక మాధ్యమాల ద్వారా మోసాలు 2020తో పోలిస్తే 2024 నాటికి దాదాపు మూడింతలయ్యాయి. మహిళలు, పిల్లలపై జరుగుతున్న సైబర్ నేరాల సంఖ్య రెండింతలకుపైగా పెరిగి గత ఏడాది 48,475కు చేరాయి. సైబర్ నేరస్తులు ఇతర దేశాల నుంచి కార్యకలాపాలు సాగిస్తున్నట్టు వారు ఉపయోగించిన ఇంటర్నెట్ ప్రొటోకాల్ (ఐపీ) అడ్రస్‌లను బట్టి తెలుస్తోంది. సైబర్ క్రిమినల్స్ చాలా సందర్భాల్లో తప్పుడు లొకేషన్ , గుర్తింపుతో తప్పుదోవ పట్టిస్తున్నట్టు హోం మంత్రిత్వ శాఖ వర్గాలు గుర్తించాయి.
కేటాయింపులు మూడింతలు..
పౌరులు, వ్యాపారాలు, ప్రభుత్వానికి సురక్షిత సైబర్‌స్పేస్‌ను నిర్మించడానికి నేషనల్ సైబర్ సెక్యూరిటీ పాలసీ (ఎన్ సీఎస్‌పీ)ని కేంద్రం తీసుకొచ్చింది. అలాగే దేశంలోని సైబర్‌స్పేస్‌ను జల్లెడ పట్టేందుకు, సైబర్ భద్రతా ముప్పులను గుర్తించడానికి నేషనల్ సైబర్ కోఆర్డినేషన్ సెంటర్ (ఎన్ సీసీసీ) ఏర్పాటు చేసింది. డేటా సంరక్షణ కోసం డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ (డీపీడీపీ) చట్టం–2023 తీసుకొచ్చింది. ఎలక్ట్రానిక్స్, సమాచార మంత్రిత్వ శాఖ సైబర్ సెక్యూరిటీ మౌలిక వసతుల కోసం కేటాయించిన నిధులు 5 ఏళ్లలో మూడింతలకుపైగా పెరగడం గమనార్హం.