
సాక్షి, విశాఖ: విశాఖ డిప్యూటీ మేయర్ ఎంపిక విషయమై కూటమిలో ట్విస్ట్ చోటుచేసుకుంది. డిప్యూటీ మేయర్ ఎంపిక కూటమిలో చిచ్చు రాజేసింది. జనసేనకు డిప్యూటీ మేయర్ కేటాయింపుపై టీడీపీ కేడర్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దీంతో, పలువురు టీడీపీ నేతలు ఎన్నికకు హాజరు కాకపోవడంతో డిప్యూటీ మేయర్ ఎన్నిక రేపటికి వాయిదా పడింది.
వివరాల ప్రకారం.. విశాఖ డిప్యూటీ మేయర్ పదవిని జనసేనకు కేటాయించడంపై పచ్చ పార్టీ నేతలు మండిపడుతున్నారు. జనసేనకు చెందిన డల్లి గోవింద రెడ్డికి డిప్యూటీ మేయర్ అవకాశం ఇవ్వడంపై టీడీపీ నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే ఈరోజు జరిగిన సమన్వయ సమావేశం నుంచి కాపు, యాదవ సామాజిక వర్గాలకు చెందిన కార్పొరేటర్లు అలిగి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
డిప్యూటీ మేయర్ ఎన్నికకు ఈ వర్గానికి చెందిన కార్పొరేటర్లు హాజరుకాలేదు. కోరం సరిపడకపోవడంతో ఎన్నికను అధికారులు వాయిదా వేశారు. డిప్యూటీ మేయర్ ఎన్నికకు కావలసిన సంఖ్యాబలం 56 కావాల్సి ఉండగా.. 54 మంది హాజరయ్యారు. దీంతో, ఎన్నికను రేపటికి వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో అలకబూనిన కౌన్సిలర్లతో టీడీపీ హైకమాండ్ చర్చించే అవకాశం ఉంది.
మరోవైపు.. జీవీఎంసీ డిప్యూటీ మేయర్ సతీష్ మాట్లాడుతూ..‘అధికార దాహంతో జీవీఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్‌ను పదవి నుంచి దింపేశారు. నగర అభివృద్ధిపై కూటమికి చిత్తశుద్ధి లేదు. కూటమి నేతల మధ్య సమన్వయ లోపం ఉంది. డిప్యూటీ మేయర్ ఎన్నికకు కోరం సభ్యులు కూడా లేరు. మేము చేసిన అభివృద్ధిని కూటమి ఖాతాలో వేసుకుంటుంది. రేపు కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. సామాజిక వర్గాల వారీగా జీవీఎంసీ కార్పొరేటర్లు విడిపోయారు. వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు అంతా ఒకే మాట మీద ఉన్నాం’ అని అన్నారు.