
ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్‌లో భారత నంబర్‌వన్ సుమిత్ నగాల్ శుభారంభం చేశాడు. పారిస్‌లో మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌లో ప్రపంచ 170వ ర్యాంకర్ సుమిత్ 6–1, 6–1తో ప్రపంచ 141వ ర్యాంకర్ మిచెల్ క్రుగెర్ (అమెరికా)పై గెలుపొందాడు. 74 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సుమిత్ ఒక ఏస్ సంధించి, ఒక డబుల్ ఫాల్ట్ చేశాడు. తన సర్వీస్‌ను ఒక్కసారి కూడా కోల్పోని సుమిత్ ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేశాడు.
సుమిత్ నెగ్గిన మొత్తం 59 పాయింట్లలో 22 విన్నర్స్ ఉన్నాయి. 14 అనవసర తప్పిదాలు చేసిన సుమిత్ నెట్ వద్దకు 10 సార్లు దూసుకొచ్చి ఎనిమిది సార్లు పాయింట్లు గెలిచాడు. రెండో రౌండ్‌లో ప్రపంచ 225వ ర్యాంకర్ జురిజ్ రొడియోనోవ్ (ఆ్రస్టియా)తో సుమిత్ తలపడతాడు. 27 ఏళ్ల సుమిత్ తన కెరీర్‌లో ఎనిమిదిసార్లు గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించాడు.
ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో మూడుసార్లు, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్‌లో ఒక్కోసారి, యూఎస్ ఓపెన్‌లో మూడుసార్లు అతను మెయిన్ ‘డ్రా’లో పోటీపడ్డాడు. 2020 యూఎస్ ఓపెన్‌లో, 2024 ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో రెండో రౌండ్‌కు చేరడం సుమిత్ గ్రాండ్‌స్లామ్ కెరీర్‌లో అత్యుత్తమ ప్రదర్శనగా ఉంది.