
రెండో రౌండ్‌లోకి స్పెయిన్ స్టార్
స్వియాటెక్ గెలుపు బోణీ
తొలి రౌండ్‌లోనే నిశేష్ అవుట్
న్యూయార్క్: కెరీర్‌లో ఆరో గ్రాండ్‌స్లామ్ టైటిల్ లక్ష్యంగా యూఎస్ ఓపెన్‌లో బరిలోకి దిగిన ప్రపంచ రెండో ర్యాంకర్, స్పెయిన్ స్టార్ కార్లోస్ అల్‌కరాజ్ శుభారంభం చేశాడు. అమెరికా ఆజానుబాహుడు, ప్రపంచ 67వ ర్యాంకర్ రీలి ఒపెల్కాతో మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో అల్‌కరాజ్ 6–4, 7–5, 6–4తో గెలుపొందాడు. 2 గంటల 5 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో అల్‌కరాజ్ నాలుగు ఏస్‌లు సంధించి, ప్రత్యర్థి సరీ్వస్‌ను మూడుసార్లు బ్రేక్ చేశాడు.
నెట్ వద్దకు 13 సార్లు దూసుకొచ్చి పదిసార్లు పాయింట్లు గెలిచాడు. 19వ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఆడుతున్న అల్‌కరాజ్ ఏనాడూ తొలి రౌండ్‌లో ఓడిపోలేదు. మరోవైపు 6 అడుగుల 11 అంగుళాల ఎత్తు, 102 కేజీల బరువున్న ఒపెల్కా 14 ఏస్‌లతో విరుచుకుపడ్డా... తొమ్మిది డబుల్ ఫాల్ట్‌లు, 32 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకున్నాడు. ఐదో సీడ్ డ్రేపర్ (బ్రిటన్), పదో సీడ్ లొరెంజో ముసెట్టి (ఇటలీ), 11వ సీడ్ హోల్గర్ రూనె (డెన్మార్క్), 12వ సీడ్ కాస్పర్ రూడ్ (నార్వే) కూడా రెండో రౌండ్‌లోకి ప్రవేశించారు.
తొలి రౌండ్‌లో డ్రేపర్ 6–4, 7–5, 6–7 (7/9), 6–2తో ఫెడెరికో గోమెజ్ (అర్జెంటీనా)పై, ముసెట్టి 6–7 (3/7), 6–3, 6–4, 6–4తో పెరికార్డ్ (ఫ్రాన్స్)పై, రూడ్ 6–1, 6–2, 7–6 (7/5)తో ఆఫ్నెర్ (ఆ్రస్టియా)పై, రూనె 6–3, 7–6 (7/4), 7–6 (7/2)తో జాండ్‌షుల్ప్ (నెదర్లాండ్స్)పై గెలిచారు. తెలుగు సంతతికి చెందిన అమెరికా ప్లేయర్ నిశేష్ బసవరెడ్డి తొలి రౌండ్‌లోనే ని్రష్కమించాడు. ‘వైల్డ్ కార్డు’తో పోటీపడ్డ 20 ఏళ్ల నిశేష్ 7–6 (7/5), 3–6, 5–7, 1–6తో తొమ్మిదో సీడ్ ఖచనోవ్ (రష్యా) చేతిలో పోరాడి ఓడాడు. తొలి రౌండ్‌లో ఓడిన నిశే‹Ùకు 1,10,000 డాలర్లు (రూ. 96 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి.
వీనస్ తొలి రౌండ్‌లోనే...
మహిళల సింగిల్స్ విభాగంలో అమెరికా వెటరన్ స్టార్ వీనస్ విలియమ్స్ పోరాటం తొలి రౌండ్‌లోనే ముగిసింది. 2000, 2001లలో విజేతగా నిలిచిన 45 ఏళ్ల వీనస్‌కు నిర్వాహకులు ఈసారి ‘వైల్డ్ కార్డు’ కేటాయించడంతో 25వ సారి ఆమె యూఎస్ ఓపెన్ టోర్నిలో బరిలోకి దిగింది. ప్రపంచ 13వ ర్యాంకర్ కరోలినా ముకోవా (చెక్ రిపబ్లిక్)తో జరిగిన తొలి రౌండ్‌లో వీనస్ 3–6, 6–2, 1–6తో ఓటమి పాలైంది.
రెండు గంటలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో వీనస్ పది డబుల్ ఫాల్ట్‌లు, 24 అనవసర తప్పిదాలు చేసింది. మరోవైపు రెండో సీడ్ స్వియాటెక్ (పోలాండ్), ఐదో సీడ్ మీరా ఆండ్రీవా (రష్యా), తొమ్మిదో సీడ్ రిబాకినా (కజకిస్తాన్) శుభారంభం చేశారు. తొలి రౌండ్‌లో స్వియాటెక్ 6–1, 6–2తో ఎమిలియానా అరాంగో (కొలంబియా)పై, ఆండ్రీవా 6–0, 6–1తో అలీసియా పార్క్స్ (అమెరికా)పై, రిబాకినా 6–3, 6–0తో జూలియెటా పరీజా (అమెరికా)పై నెగ్గగా... 12వ సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్) తొలి రౌండ్‌లో 2–6, 4–6తో అనా బొండార్ (హంగేరి) చేతిలో ఓడిపోయింది.