
అభిప్రాయం
ఏదైనా కేసుపై విచారణ జరుగుతున్నా, లేదా కేసు కోర్టులో పెండింగ్‌లో ఉన్నా ... ఆ కేసును మీడియా ప్రస్తావించడం, చర్చించడం, విమర్శించడం తప్పు కాదని సుప్రీంకోర్టు ఇటీవల ఒక కేసు విషయంలో అభిప్రాయపడింది. ఇప్పటివరకూ అలా ప్రసార మాధ్యమాల్లో ప్రస్తావించడం తప్పుగా భావించేవారు. ప్రజాస్వామ్యంలో పటిష్ఠమైన చర్చలు, నిర్మాణాత్మక విమర్శలను స్వాగతించాల్సిన అవసరం ఉందనీ, బలమైన చర్చలతోనే ఆత్మపరిశీలన సాధ్యమవుతుందనీ కూడా కోర్టు పేర్కొంది. న్యాయవ్యవస్థ, మీడియా ప్రజాస్వామ్య మూల స్తంభాలనీ, ఇవి రెండూ పరస్పరం అనుబంధంతో కొనసాగాలనీ, అప్పుడే స్వేచ్ఛాయుత ప్రజా స్వామ్యం పరిఢవిల్లు తుందనీ సుప్రీం పేర్కొంది.
వికీమీడియా ఫౌండేషన్‌పై ఏషియన్ న్యూస్ ఇంటర్నేషనల్ (ఏఎన్‌ఐ) ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన పరువునష్టం దావా పిటిషన్ విచారణలో ఉంది. అయినా ఆ ఫౌండేషన్ తాను నడుపుతున్న ‘వికీపీడియా’ వెబ్‌సైట్‌లో ఆ కేసు వివరాలు పోస్ట్ చేసింది. దీంతో ఏఎన్‌ఐ అభ్యర్థన మేరకు హైకోర్టు ఈ కేసు వివరాలున్న వెబ్ పేజీని తొలగించాలని వికీమీడియాను ఆదేశించింది. వికీమీడియా ఈ విషయంలో సుప్రీం కోర్టు మెట్లెక్కడంతో అత్యు న్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేస్తూ హైకోర్టు ఆదేశాలను రద్దుచేసింది.
న్యాయస్థానాలు ప్రజలకు సంబంధించిన బహిరంగ వ్యవస్థలనీ, అక్కడ జరిగే అంశాలు, ప్రస్తావనలు ప్రజలు తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతారనీ, అందువల్ల వాటిని గోప్యంగా ఉంచా ల్సిన అవసరం లేదనీ సుప్రీం పేర్కొంది. అలాగని మీడియా విచ్చలవిడిగా వ్యవహరిస్తే కోర్టులు సహించవని సున్నితంగా హెచ్చరించింది. భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో న్యాయస్థానాలను అప్రతి ష్ఠపాలు చేసినా, న్యాయ వ్యవస్థకు మచ్చ తెచ్చేలా వార్తలు రాసినా, చర్చలు జరిపినా తీవ్రంగా పరిగ ణిస్తామని స్పష్టం చేసింది.
ప్రజాస్వామ్యంలో ఏ వ్యవస్థ మెరుగుపడాలన్నా ఆత్మపరిశీలన అవస రమనీ, అప్పుడే మెరుగైన ఫలితాలు వెలువడే అవకాశాలు ఉంటాయనీ పేర్కొంటూ, ఇందుకు న్యాయ వ్యవస్థ కూడా మినహాయింపు కాదని స్పష్టం చేసింది. జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన సుప్రీం ధర్మాసనం ఈ సంచలనాత్మక తీర్పు వెలువరించింది.
ఈ తీర్పు అనేక ప్రశ్నలు లేవనెత్తుతోంది. మీడియాకు మరింత స్వేచ్ఛ సమకూరడం ఆహ్వా నించదగిన పరిణామమే. అయితే భద్రతా కార ణాల రీత్యా ‘రహస్యం’ (ఇన్ కెమెరా)గా నిర్వహించే విచారణకు ఈ తీర్పు ‘పెనుముప్పు’గా మారే అవకాశం లేకపోలేదు. ముఖ్యంగా, ఎటు వంటి నియంత్రణా లేని సామాజిక మాధ్యమాలకు అడ్డూ అదుపు ఉంటాయా? సంచలనాల పేరుతో మరింత చెలరేగి పోయేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పటికే విచ్చలవిడిగా, బాధ్యతా రాహిత్యంతో వ్యవహరిస్తున్న ‘కొన్ని’ సోషల్ మీడియా వేదికలు మరింత రెచ్చిపోయే అవకాశం ఉంది. ప్రాణాలకు తెగించి వార్తా ప్రసారాలు చేసే చానళ్లు, వార్తలు ప్రచురించే పత్రికలు ఈ తీర్పును మరింత బాధ్యతాయుతంగా ఉపయోగించుకుంటాయనడంలో ఎటువంటి సందేహమూ లేదు.
ఈ సందర్భంగా రాజ్యాంగంలోని ‘గోప్యత హక్కు’ (రాజ్యాంగ అధికరణం 21), అధికారిక రహస్యాల చట్టం, కోర్టు ధిక్కార చట్టం (1971) ఇత్యా దిగా గల చట్టాల సంగతి ఏం కాను? సుప్రీం తాజా తీర్పును ‘యథాతథం’ (ట్రూ స్పిరిట్ )గా అర్థం చేసుకుంటే సానుకూల ఫలితాలు చారెడు. విపరీతా ర్థాలు తీసి, ఇష్టానుసారం వక్రీకరిస్తే అనర్థాలు బారెడు. అందుకే సంయమనంతో మీడియా సంస్థలు వ్యవహరించాల్సి ఉంటుంది.
ప్రొ‘‘ పీటా బాబీ వర్ధన్
వ్యాసకర్త మీడియా విశ్లేషకులు