
సాక్షి,న్యూఢిల్లీ: కాలిన నోట్ల కట్టల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మకు పదవి నుంచి ఉద్వాసన పలికే సమయం ఆసన్నమైంది.
రేపటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సమావేశాల ప్రారంభానికి ఒక రోజు ముందే జస్టిస్ యశ్వంత్ వర్మను అభిశంసన ద్వారా తొలగించే ప్రక్రియపై 100 మంది పార్లమెంట్ సభ్యులు సంతకాలు పెట్టినట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అధికారికంగా ప్రకటించారు.
ఇంట్లో కాలిన నోట్ల కట్టలు.. విచారణకు సుప్రీం
ఈ ఏడాది మార్చి నెలలో జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో భారీ ఎత్తున కాలిన నోట్ల కట్టలు వెలుగులోకి వచ్చాయి. దీంతో జస్టిస్ వర్మపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇదే అంశంపై సుప్రీం కోర్టు త్రిసభ్య కమిటీతో విచారణ చేపట్టింది. ఈ విచారణలో కాలిన నోట్ల కట్టలు జస్టిస్ యశ్వంత్ వర్మవేనన్న సాక్షులు,ఆధారాలు వెలుగులోకి వచ్చాయి.
అభిశంసన చర్యలు
వీటిని పరిగణలోకి తీసుకున్న అత్యున్నత న్యాయస్థానం నియమించిన త్రిసభ్య కమిటీ సైతం జస్టిస్ వర్మను అభిశంసన ద్వారా తొలగించాలని సిఫారసు చేసింది. త్రిసభ్య కమిటీ నిర్ణయాన్ని తప్పుబట్టిన జస్టిస్‌వర్మ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. కమిటీ ఇచ్చిన నివేదికను రద్దు చేయాలని అత్యున్నత న్యాయ స్థానంలో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. అలాగే తనపై అభిశంసన చర్యలు ప్రారంభించాలంటూ అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా చేసిన సిఫార్సులను సైతం సవాలు చేశారు.
త్రిసభ్య కమిటీ రిపోర్టుపై సవాలు
నోట్ల కట్టల వ్యవహారంలో తన వాదన పూర్తిగా వినకుండానే నివేదిక రూపొందించారని అంతర్గత ఎంక్వైరీ కమిటీ తీరును ఆయన తప్పుపట్టారు. ఈ దర్యాప్తులో లోపాలు ఉన్నాయని స్పష్టం చేశారు. తనకు వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాధారాలు కమిటీకి లభించలేదన్నారు.
ఏకమైన అధికార,ప్రతి పక్షాలు
తనను దోషిగా తేల్చాలన్న ముందస్తు వ్యూహంతోనే నివేదిక సిద్ధంగా చేశారని విమర్శించారు. తనపై దర్యాప్తు ప్రక్రియ మొత్తం రాజ్యాంగవిరుద్ధంగా సాగిందని, తన ప్రాథమిక హక్కులు ఉల్లంఘనకు గురయ్యాయని ఆందోళన వ్యక్తంచేశారు. నివేదికపై తాను అధికారికంగా స్పందించకముందే దాన్ని మీడియాకు లీక్ చేశానని, తన ప్రతిష్టను దెబ్బతీయాలన్న కుట్ర జరిగిందని జస్టిస్ వర్మ మండిపడ్డారు. అందుకే ఈ నివేదికను రద్దు చేయాలని అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు. అయినప్పటికీ జస్టిస్ వర్మపై అభిశంసన తీర్మానం ప్రవేశ పెట్టేందుకు అధికార,ప్రతి పక్షాలు ఏకమయ్యాయి.
అభిశంసన తీర్మానం ద్వారా
భారత రాజ్యాంగం ప్రకారం.. అవినీతి ఆరోపణల ఆధారంగా రాష్ట్రపతి ఉత్తర్వు ద్వారా మాత్రమే సుప్రీంకోర్టు న్యాయమూర్తిని పదవి నుండి తొలగించవచ్చు.అటువంటి ఘటనల్లో అభిశంసన తీర్మానాన్ని రాజ్యసభలో కనీసం 50 మంది సభ్యుల మద్దతు లేదంటే లోక్‌సభలో కనీసం 100 మంది సభ్యుల మద్దతు ఉంటేనే ఆమోదిస్తారు. ఈ తీర్మానాన్ని ఆమోదించడానికి సభలోని మూడింట రెండు వంతుల ఎంపీల మద్దతు అవసరం.
మంత్రి కిరణ్ రిజిజు ఏమన్నారంటే?
ఇప్పుడు ఇదే పద్దతిలో జస్టిస్ వర్మ తొలగింపునకు అధికార,ప్రతిపక్ష లోక్ సభ,రాజ్య సభ సభ్యులు సంతకాలు పెట్టారు. న్యాయవ్యవస్థలో అవినీతి అనేది చాలా సున్నితమైన విషయం. ఈ అంశంపై అన్ని రాజకీయ పార్టీలు ఐక్యంగా ఉన్నాయి. వర్షాకాల సమావేశంలో జస్టిస్ యశ్వంత్ వర్మపై ప్రభుత్వం అభిశంసన తీర్మానాన్ని ప్రవేశ పెట్టనున్నాం’ అని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అన్నారు.
అభిశంసన తీర్మానంలో అనూహ్య పరిణామం
ఈ అభిశంసన తీర్మానంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. పార్లమెంటు సమావేశాల్లో బీజేపీ, కాంగ్రెస్‌లు పరస్పరం విభేదిస్తుంటాయి. కానీ న్యాయవ్యవస్థలో అవినీతి వంటి సున్నితమైన అంశంపై పార్టీలకు అతీతంగా స్పందించడం, ప్రజాస్వామ్యానికి మద్దతుగా నిలుస్తూ.. 100 మంది ఎంపీలు అభిశంసన తీర్మానంపై సంతకాలు చేయడం, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో సహా 35 మంది కాంగ్రెస్ ఎంపీలు సైతం సంతాలు చేసినట్లు సమాచారం.