
అభిప్రాయం
‘ఒక వ్యక్తి వెలిబుచ్చిన అభిప్రాయాలు చాలా మందికి నచ్చనప్పటికీ ఆ అభిప్రాయాలు వ్యక్తీకరించే వ్యక్తి హక్కులను గౌరవించాలి. అంతేకాదు రక్షించాలి.’ ‘ఏ ఖూన్ కే ప్యాసే బాత్ సునో’ అన్న జీవిత నేపథ్యం కలిగివున్న ఒక వీడియో క్లిప్‌ను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసినందుకుగాను కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్ గఢీపై గుజ రాత్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్.ఐ.ఆర్.ను గత మార్చి 28వ తేదీన సుప్రీంకోర్టు కొట్టివేస్తూ అన్న మాటలు అవి. జస్టిస్ అభయ్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం ప్రతాప్ గఢీ దాఖలు చేసిన పిటీషన్‌ను అనుమతిస్తూ... ‘ఆ పోస్ట్ ప్రచురించడం వల్ల ఎలాంటి నేరం జరగలే’దని పేర్కొంది. భావప్రకటనా స్వేచ్ఛ, వ్యక్తీకరణ స్వేచ్ఛలను రక్షించాల్సిన బాధ్యత కోర్టుల మీద, పోలీసుల మీద ఉందని కోర్టు నొక్కి చెప్పింది.
గతంలో భారత రాజ్యాంగ సభలో కమ్యూ నిస్ట్ పార్టీ ప్రతినిధిగా ఉన్న సోమ్‌నాథ్ లహరి ‘ప్రాథమిక హక్కుల అధ్యాయం ఒక పోలీస్ కాని స్టేబుల్ దృక్కోణం నుండి రూపొందించి నట్టు అనిపిస్తుం’దని వ్యాఖ్యానించారు. ఈ హక్కుల వినియోగం చట్టబద్ధమైనదా కాదా అన్నది నిర్ణ యించేది పోలీసులే అని ఆయన అన్నారు. ఈ అభిప్రా యంతో మనం ఏకీభవించకపోవచ్చు. కానీ ఇప్పుడు దేశంలో ఉన్న పరిస్థితులను చూస్తే ఆయన వ్యాఖ్యలు గుర్తుకు వస్తున్నాయి.
ఇమ్రాన్ ప్రతాప్ గఢీపై 2024 డిసెంబర్‌లో ఓ క్రిమినల్ కేసును పోలీసులు నమోదు చేశారు. దాన్ని సుప్రీంకోర్టు 2025 మార్చిలో కొట్టివేసింది. ఒక సామూహిక వివాహ కార్యక్రమం వీడియోను ఇమ్రాన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రచురించారు. ఆ వీడియో నేపథ్యంలో అతను రాసిన కవిత చది వారు. ఈ కవిత వివిధ వర్గాల ప్రజలను రెచ్చ గొట్టే విధంగా ఉందనీ, వారి మధ్య శత్రుత్వం, ద్వేషాన్ని రేపేదిగా ఉందనీ ఎఫ్‌ఐఆర్‌లో ఆరోపించారు.
అందుకని ఆయనపై భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్లు 196, 197 (1), 302, 299, 57, 3 (5) కింద కేసును నమోదు చేశారు. అంటే ప్రజా సమూహాల మధ్య శత్రుత్వం లేదా ద్వేషాన్ని కలిగించే చర్యలను, జాతీయ సమైక్య తకు భంగం కలిగించే చర్యలనీ; మత విశ్వా సాలను అవమానించడం, గాయపరచడం చేస్తుందనీ ప్రథమ సమాచార నివేదికలో ఆరోపించారు. ఈ ఎఫ్‌ఐఆర్‌ను సవాలు చేస్తూ హైకోర్టులో దర ఖాస్తుని దాఖలు చేశారు. దర్యాప్తు ప్రారంభ దశలో ఉందని హైకోర్టు పేర్కొంటూ దర ఖాస్తును కొట్టివేసింది.
గుజరాత్ హైకోర్టు ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయడాన్ని విమర్శిస్తూ సుప్రీంకోర్టు ఇలా వ్యాఖ్యానించింది: ‘‘భారత రాజ్యాంగం అభయం ఇచ్చిన ప్రాథమిక హక్కు లను బలపరచడం, అమలు చేయడం కోర్టుల విధి. వాళ్ళు మాట్లాడిన మాటలు, రాసిన రాతలు న్యాయమూర్తులమైన మనకు నచ్చకపోవచ్చు. అయినప్పటికీ ఆర్టికల్ 19 (1) అభయం ఇచ్చిన భావ ప్రకటన, వ్యక్తీకరణ హక్కులను కాపాడా ల్సిన బాధ్యత కోర్టుల మీద ఉంది. రాజ్యాంగాన్ని, రాజ్యాంగ ఆదర్శాలను నిలబెట్టాల్సిన బాధ్యత న్యాయమూర్తుల మీద ఉంది. ప్రాథమిక హక్కులను కాపాడటం కోర్టుల విధి... ఈ హక్కులు ప్రజాస్వామ్యంలో పౌరులకు ఉండే అతి ముఖ్యమైన హక్కులు.’’
ఇక పోలీసుల నిర్వాకాన్నీ కోర్టు గర్హించింది. ‘‘పోలీసు అధికారి రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలి. రాజ్యాంగ ఆదర్శాలను గౌరవించాలి... దేశ పౌరులందరూ భావప్రకటనా స్వేచ్ఛను కలిగి వున్నారు. అది మన రాజ్యాంగ ఆదర్శాలలో ఒకటి. పోలీసులు కూడా దేశ ప్రజలే. వారు కూడా రాజ్యాంగానికి, అందులోని హక్కులకు కట్టుబడి ఉండాలి. ఇమ్రాన్ రాసిన కవిత ఏ మతాన్ని, కులాన్ని, భాషను ప్రస్తావించదు. ఏ మతానికి చెందిన వ్యక్తులను కూడా కవిత ప్రస్తావించదు. ఏ రకంగా చూసినా గ్రూపుల మధ్య శత్రుభావాన్ని ఈ కవిత కలిగించదు. జాతీయ ఐక్యతకి అవి ఎలా హాని కలిగిస్తాయో అర్థం కాదు’’ అని కోర్టు అభిప్రాయపడింది.
నేర సమాచారం రాగానే కానిస్టేబుల్ కేసు నమోదు చేయాలని క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ చెబుతుంది. ప్రాథమిక విచారణను చేయడానికి వెసులుబాటును ‘భారతీయ నాగరిక సురక్షా సంహిత’ కల్పించింది. ఈ కేసులో ప్రాథమిక విచారణ కూడా అవసరం లేదు. గుర్తించదగిన నేరమే జరగనప్పుడు ప్రాథమిక విచారణ అవసరం లేదు. సాహిత్యం, కళలు మన జీవితాలను అర్థవంతం చేస్తాయి. భావప్రకటనా స్వేచ్ఛ గౌరవప్రదమైన జీవితాన్ని ఇస్తుంది. ఇదే ఇమ్రాన్ ప్రతాపగఢీ కేసులో సుప్రీం తీర్పు సారాంశం.
డా‘‘ మంగారి రాజేందర్
వ్యాసకర్త గతంలో జిల్లా సెషన్స్ జడ్జి