ఐఎస్‌ఐ ఏజెంట్‌ జ్యోతి మల్హోత్రా! | Pakistan ISI was using spy Haryana YouTuber to identify Indian agents | Sakshi
Sakshi News home page

ఐఎస్‌ఐ ఏజెంట్‌ జ్యోతి మల్హోత్రా!

May 21 2025 4:03 AM | Updated on May 21 2025 4:04 AM

 Pakistan ISI was using spy Haryana YouTuber to identify Indian agents

ఇండియన్‌ అండర్‌కవర్‌ ఏజెంట్లను గుర్తించే యత్నం  

అస్త్రంగా వాడుకున్న పాక్‌ నిఘా సంస్థ 

దర్యాప్తు ముమ్మరం చేసిన అధికారులు  

చండీగఢ్‌/న్యూఢిల్లీ: ఇండియన్‌ అండర్‌కవర్‌ ఏజెంట్లను గుర్తించడానికి పాకిస్తాన్‌ నిఘా సంస్థ ఇంటర్‌ సర్వీసెస్‌ ఇంటెలిజెన్స్‌(ఐఎస్‌ఐ) హరియాణా యూట్యూబర్‌ జ్యోతి మల్హోత్రా(Jyoti Malhotra)(33)ను వాడుకుందా? నిజమేనని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. ఐఎస్‌ఐ హ్యాండ్లర్‌ అలీ హసన్‌తో వాట్సాప్‌లో జ్యోతి చేసిన చాటింగ్‌లను వెలికి తీశారు. ఇద్దరి మధ్య కోడ్‌ భాషలో ఈ చాటింగ్‌లు జరిగాయి. ఒక చాటింగ్‌ను పరిశీలిస్తే.. భారత అండర్‌కవర్‌ ఏజెంట్ల వివరాలు, వారి ఆపరేషన్ల గురించి అలీ హసన్‌ ఆమెను ప్రశ్నించాడు.

భారత్‌–పాక్‌ సరిహద్దు అయిన అటారీ బోర్డర్‌ను సందర్శించినప్పుడు ప్రత్యేక ప్రోటోకాల్‌ ఉన్న అండర్‌కవర్‌ ఏజెంట్లను చూశావా? అని ప్రశ్నించగా, అలాంటిదేమీ లేదని జ్యోతి బదులిచ్చింది. ప్రోటో కాల్‌ అందుకున్నవారే అండర్‌ కవర్‌ ఏజెంట్లు కావొ చ్చు అని అలీ హసన్‌ చెప్పగా, అలాంటి వారిని తాను చూడలేదని పేర్కొంది. భారత నిఘా ఏజెంట్ల గుట్టుమట్లు తెలుసుకోవడానికి జ్యోతిని అస్త్రంగా ఉపయోగించినట్లు అంచనా వేస్తున్నారు. ఐఎస్‌ఐ కోసమే పని చేస్తున్నట్లు ఆమెకు పూర్తి అవగాహన ఉందని పేర్కొంటున్నారు. పాకిస్తాన్‌కు సంబంధించిన భారీ గూఢచార ముఠాలో ఆమె ఒక కీలక సభ్యురాలని నిర్ధారణకు వచ్చారు. జ్యోతి తొలిసారిగా 2023లో బైశాఖి పండుగ సమయంలో పాకిస్తాన్‌లో పర్యటించింది.  

ఈ సరిహద్దులు ఇంకా ఎన్నాళ్లో..  
జ్యోతి మల్హోత్రా వ్యక్తిగత డైరీ దర్యాప్తు అధికారుల చేతికి చిక్కింది. ఆమె తన ఆలోచనలు, పర్యటనల గురించి ఇందులో రాసుకుంది. పాకిస్తాన్‌ ప్రస్తావన సైతం ఉంది. డైరీలో 11 పేజీల్లో రాయగా.. 8 పేజీల్లో సాధారణ అంశాలు, 3 పేజీల్లో పాకిస్తాన్‌ గురించి హిందీ, ఇంగ్లిష్‌ భాషలో రాతలు కనిపిస్తున్నాయి. ‘‘పాకిస్తాన్‌ ప్రజల ఆదరణ, వారి అతిథి మర్యాదలు నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. పాకిస్తాన్‌లో భారతదేశ హిందువుల పర్యటనలు ఇంకా పెరగాలని కోరుకుంటున్నా. పాకిస్తాన్‌లోని తమ పూరీ్వకుల గ్రామాలను హిందువులు సందర్శించాలి.

అక్కడి హిందూ ఆలయాలు, గురుద్వారాలకు సులువుగా వెళ్లొచ్చే పరిస్థితులు రావాలి. 1947లో దేశ విభజన తర్వాత విడిపోయిన కుటుంబాలు మళ్లీ కలిస్తే బాగుంటుంది. పాకిస్తాన్‌లో పది రోజుల పర్యటన పూర్తి చేసుకొని ఈ రోజే ఇండియాకు తిరిగొచ్చా. రెండు దేశాల మధ్య ఈ సరిహద్దులు ఇంకా ఎన్ని రోజులు ఉంటాయో తెలియదు. బాధపడే హృదయాలకు ఉపశమనం కలగాలి. మనమంతా ఒకే దేశం, ఒకే నేలకు చెందినవాళ్లం’’ అని జ్యోతి తన డైరీలో రాసుకుంది. మరోవైపు ఆమె కశీ్మర్‌ పర్యటనల వీడియోలు, సీసీటీవీ ఫుటేజీలను అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు.

అర్ధరాత్రి పొద్దుపోయే దాకా పనిచేయడం ఆమెకు అలవాటు అని గుర్తించారు. రాత్రి ఒంటి గంట సమయంలో వీడియోలను ఎడిటింగ్‌ చేసి, సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేస్తుండేదని చెప్పారు. చాలా సందర్భాల్లో ఢిల్లీకి వెళ్తున్నానని ఇంట్లో వాళ్లకు చెప్పి మరోచోటుకి వెళ్లినట్లు గుర్తించారు. జ్యోతి వ్యవహారం తెలిసి కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంట్లో ఆమె ఫోటోలన్నీ తొలగించారు. తన బిడ్డ సంగతి తనకు తెలియదని, దీనిపై తనను ఏమీ ప్రశ్నించవద్దని జ్యోతి తండ్రి స్పష్టం చేశారు. 

నిందితురాలిపై ప్రశ్నల వర్షం
యూట్యూబర్‌ జ్యోతి మల్హోత్రా వ్యవహారంపై అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ)తోపాటు ఇంటెలిజెన్స్‌ బ్యూరో(ఐబీ), మిలటరీ ఇంటెలిజెన్స్‌ అధికారులు ఆమెను విచారిస్తున్నారు. పూర్తి సమాచారం రాబట్టానికి భిన్న కోణాల్లో ప్రశ్నిస్తున్నారు. జ్యోతి మల్హోత్రా ఆర్థిక లావాదేవీలు, ప్రయాణాల వివరాలపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్లు అధికారులు మంగళవారం వెల్లడించారు. ఆమె పాకిస్తాన్, చైనాతోపాటు ఇతర దేశాల్లో పర్యటించినట్లు తెలుస్తోంది. ‘ట్రావెల్‌ విత్‌ జో’ అనే యూట్యూబ్‌ చానల్‌ నిర్వహిస్తూ గూఢచర్యానికి పాల్పడుతున్నట్లు ఆరోపణలు రావడంతో ఈ నెల 16న ఆమెను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. భారతీయ న్యాయ సంహిత(బీఎన్‌ఎస్‌)లోని అధికారిక రహస్యాల చట్టం కింద కేసు నమోదు చేశారు. గూఢచర్యం ఆరోపణల నేపథ్యంలో పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్‌లో గత రెండు వారాల్లో మొత్తం 12 మందిని అరెస్టు చేశారు.  

ఆదాయానికి, ఖర్చులకు పొంతనేదీ?
ఇదిలా ఉండగా, నిందితురాలు జ్యోతి మల్హోత్రా ఎప్పుడెప్పుడు, ఎక్కడెక్కడ పర్యటించింది, ఎవరిని కలిసిందీ పూర్తి వివరాలు తెలిస్తే వాటన్నింటినీ క్రోడీకరిస్తామని, దానివల్ల దర్యాప్తు వేగంగా ముందుకు సాగుతుందని అధికారులు పేర్కొంటున్నారు. యూట్యూబ్‌ చానల్‌ ద్వారానే తనకు ఆదాయం వస్తోందని నిందితురాలు చెబుతుండగా, అధికారులు విశ్వసించడం లేదు. ఆమెకు వచ్చిన ఆదాయానికి, విదేశీ పర్యటనలకు అయిన ఖర్చులకు పొంతన లేదని అంటున్నారు. అందుకే ఆర్థిక వ్యవహారాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. వివరాలు కూపీ లాగుతున్నారు.

జ్యోతి ల్యాప్‌టాప్‌పై ఫోరెన్సిక్‌ విశ్లేషణ జరుగుతోందని అధికారులు చెప్పారు. పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత భారత్‌–పాకిస్తాన్‌ మధ్య నాలుగు రోజులపాటు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో జ్యోతి మల్హోత్రా ఢిల్లీలోని పాకిస్తాన్‌ హైకమిషన్‌లో పనిచేసే ఓ అధికారిని తరచుగా కలిసింది. పాకిస్తాన్‌ ఇంటెలిజెన్స్‌ సిబ్బందితో ఆమెకు ప్రత్యక్షంగా సంబంధాలు ఉన్నట్లు ఓ పోలీసు అధికారి చెప్పారు. సోషల్‌ మీడియా ద్వారా జనంలో గుర్తింపు పొందినవారిని నియమించుకొని, దేశ రహస్యాలు కొల్లగొట్టడం ఆధునిక యుద్ధరీతిలో ఒక భాగంగా మారిందని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement