
చండీఘడ్: గూఢచర్యం ఆరోపణలతో అరెస్టైన జ్యోతి మల్హోత్రా కేసులో పలు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏఎన్‌ఐ విచారణలో ఆమె పాకిస్తానీ ఏజెంట్లతో నేరుగా సంబంధాలు కొనసాగించిందని, వాటిని రహస్యంగా ఉంచేందుకు పలు ఎన్‌క్రిప్టెడ్ డివైజ్‌లు వినియోగించినట్లు తేలింది.
ఎన్ఐఏ విచారణలో ఆమె సోషల్ మీడియాను వీడియోలు పోస్టు చేస్తూ ప్రపంచానికి తాను వ్లాగర్‌గా ప్రమోట్ చేసుకుంటుంది. కానీ అసలు విషయం ఏంటంటే? ఎన్‌క్రిప్టెడ్ డివైజ్‌లను ఉపయోగించి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ద్వారా పాకిస్తానీ ఏజెంట్లతో క్రమం తప్పకుండా టచ్‌లో ఉండేదని హర్యానా పోలీసులు తెలిపారు.
హర్యానా రాష్ట్రం హిస్సార్‌కు చెందిన జ్యోతి ‘ట్రావెల్ విత్ జో’పేరిట ఒక యూట్యూబ్ ఛానెల్‌ను నిర్వహిస్తున్నారు. ఈ ఛానెల్‌కు 3.77 లక్షల మంది సబ్‌స్కైబర్లు ఉన్నారు. ఈమె ట్రావెల్‌విత్‌జో1 ఇన్‌స్టా గ్రామ్ ఖాతాకు 1,32,000 మంది ఫాలోవర్లు ఉన్నారు. చైనా, పాకిస్తాన్, ఇండోనేసియాల్లోనూ వీడియోలు తీసింది. అమె తీసిన యూట్యూబ్ వీడియోలు, సోషల్ మీడియా పోస్టుల్లో భారతీయులకు పాకిస్తాన్ మంచి దేశంగా చూపించే ప్రయత్నం చేయడం,ఉగ్రదాడికి ముందు పహల్గాంలో పర్యటన, ఢిల్లీలోని పాక్ దౌత్య కార్యాలయం ఉద్యోగి ఇషాన్ దార్‌తో సన్నిహితంగా ఉండడంతో మే 16న జ్యోతిపై సివిల్ లైన్స్ పోలీస్‌స్టేషన్‌లో ఎఫ్ ఐఆర్ నమోదైంది.
గూఢచర్యం కేసులో ఆమెను కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారిస్తున్నాయి. ఈ విచారణలో ఈషాన్ దార్‌తో సన్నిహిత సంబంధాలు, పాకిస్తాన్‌లో పర్యటన, ఐఎస్‌ఐతో సంబంధాలపై ఆరా తీస్తున్నారు. దీంతో పాటు పహల్గామ్ ఉగ్రదాడికి ముందు కశ్మీర్ సందర్శన, కశ్మీర్ పర్యటనకు ముందు పాకిస్తాన్‌కు వెళ్లడం, ఈ రెండు పర్యటనల మధ్య సంబంధం ఉందా? అన్న కోణంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు తమ విచారణను వేగవంతం చేశాయి.
ఈ క్రమంలో జ్యోతి మల్హోత్రా అరెస్ట్‌పై ఆమె తండ్రి హరీష్ మల్హోత్రాను మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు పొంతనలేని సమాధానాలు చెప్పడం కొత్త అనుమానాలకు తెరతీసినట్లైంది.
ఒక సారి తన కుమార్తె జ్యోతి మల్హోత్రా యూట్యూబ్ కోసం వీడియోలు షూట్ చేసేందుకు ఢిల్లీ వెళుతున్నట్లు తనకు చెప్పిందని, కానీ పాకిస్తాన్‌కు వెళ్లిన విషయం తనకు తెలియదని చెప్పారు. మరోసారి ఢిల్లీకి కాదు తాము ఉంటున్న ఇంట్లోనే వీడియోలు తీసేదని చెప్పారు. ఇంకోసారి తన కూతురు తాను ఏం చేస్తుందో ఎప్పుడూ చెప్పలేదని జ్యోతి తండ్రి హరీష్ మల్హోత్రా చెప్పడంపై చర్చాంశనీయంగా మారింది.