ఏక 'తాటి'గా ఫలాలు..రైతులకు ఆదాయ సిరులు.. | Dr. YSR Horticultural Research achieving good results in palm-based products | Sakshi
Sakshi News home page

ఏక 'తాటి'గా ఫలాలు..రైతులకు ఆదాయ సిరులు..

May 20 2025 12:48 PM | Updated on May 20 2025 12:48 PM

Dr. YSR Horticultural Research achieving good results in palm-based products

ఆంధ్రప్రదేశ్‌ అల్లూరి జిల్లాలోని పందిరిమామిడి డాక్టర్‌ వైఎస్సార్‌ ఉద్యానవన పరిశోధన స్థానం మంచి ఫలితాలు సాధిస్తోంది. తాటి ఉత్పత్తుల తయారీపై జరిపిన విస్తృత పరిశోధనల ఫలితంగా జాతీయస్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందింది. 2024–25కు సంబంధించి ఉత్తమ అవార్డు పొందింది. దీంతో ఇక్కడ 32 ఏళ్లుగా జరిపిన పరిశోధనలకు సార్థకత లభించింది. దేశంలో ఉన్న నాలుగు పరిశోధన స్థానాల్లో మేటిగా నిలుస్తూ గిరిజనుల ఆర్థిక పురోభివృద్ధికి బాటలు వేస్తోంది.

రంపచోడవరం: పందిరిమామిడి డాక్టర్‌ వైఎస్సార్‌ ఉద్యానవన పరిశోధన స్థానం (హెచ్‌ఆర్‌ఎస్‌)కు జాతీయస్థాయిలో గుర్తింపు లభించింది. తాటి పరిశోధనల ఫలితంగా ఉత్తమ పరిశోధన స్థానంగా గుర్తింపు పొందింది. ఈ అవార్డును  ఈనెల 7 నుంచి 9 వరకు మధురైలో జరిగిన కార్యక్రమంలో పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డా. వీసీ వెంగయ్య స్వీకరించారు.  

1993లో నిధుల కేటాయింపుతో.. 
అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం సమీపంలోని పందరిమామిడిలో 1986లో ఏర్పాటైన ఈ ఉద్యానవన పరిశోధన స్థానానికి 1993లో ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ అగ్రికల్చర్‌ రిసెర్చ్‌ సెంటర్‌ న్యూఢిల్లీ (ఐసీఏఆర్‌) తాటి పరిశోధనలకు నిధులు కేటాయించింది. అప్పటినుంచి 32 ఏళ్లుగా తాటి చెట్లకు సంబంధించి నిరంతరంగా వివిధ దశల్లో పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి.  

272 తాటి రకాలతో.. 
దేశంలో వివిధ ప్రాంతాలనుంచి 272 రకాల తాటి చెట్ల టెంకలను సేకరించి ఇక్కడ నాటారు. తరువాత దశలో తాటి చెట్ల నుంచి నీరా సేకరణపై పరిశోధనలు సాగాయి. ఆధునిక పద్ధతులను అవలంభించి నీరాను విజయవంతంగా సేకరిస్తున్నారు. తాటి నుంచి ఆహార ఉత్పత్తుల తయారీపై కూడా ఇక్కడి శాస్త్రవేత్తలు దృష్టి సారించారు. దీనిలో భాగంగా నీరా నుంచి తాటి బెల్లం, తాటి సిరప్, తాటి తేగల నుంచి నూక,పిండి, తాటి గుజ్జు నుంచి జెల్లీ వంటి 20 రకాల ఆహార పదార్థాలను విజయవంతంగా తయారు చేశారు. గిరిజనులకు తాటి ఆధారిత ఉత్పత్తుల తయారీపై ప్రత్యేక శిక్షణ ఇచ్చి పరిశోధనల ఫలితాలను చేరువ చేశారు.  

తాటి తేగలతో పిండి, నూక (రవ్వ) తయారు చేసిన మైదా స్థానంలో వీటిని వినియోగించి పోషక విలువలతో కూడి ఆహార పదార్థాలు తయారు చేస్తున్నారు. వీటితో కేకులు, బిస్కెట్లు, జంతికలు, బ్రెడ్, నూడల్స్, రవ్వ లడ్డు, పిజ్జా బేస్‌ తదితర పదార్థాలను వాణిజ్య పరంగా తయారు చేస్తున్నారు.  

చింతూరు కేంద్రంగా పనిచేస్తున్న ఓ స్వచ్ఛంద సంస్థ ప్రిన్సిపల్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ వెంయ్య సహకారంతో మూడు టన్నుల తేగల పిండిని లండన్‌కు పంపించింది. తరువాత కోవిడ్‌ కారణంగా నిలిచిపోయింది. మళ్లీ పంపించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.  

దేశంలో 32 వన్య పంట విభాగాలు ఉండగా వీటిలో కొబ్బరి పరిశోధన స్థానాలు 20, ఆయిల్‌పామ్‌ రీసెర్చ్‌ సెంటర్లు, వక్క రీసెర్చ్‌ సెంటర్, తాటి పరిశోధన స్థానాలు నాలుగు ఉన్నాయి. వీటికి సంబంధించి ఏటా ఉత్తమ రీసెర్చ్‌ సెంటర్లకు అఖిల భారత వన్య పంటల విభాగంలో అవార్డు అందజేస్తారు. దీనిలో భాగంగా 2024–25కు సంబంధించి పందిరిమామిడి ఉద్యాన పరిశోధన కేంద్రానికి అవార్డు దక్కింది.  

ఎంతో సంతోషంగా ఉంది
తాటి పరిశోధనల్లో అనేక అంశాల్లో ముందడుగు వేయగలిగాం. తమ పరిశోధన స్థానంలో 32 ఏళ్లుగా తాటిపై జరిపిన పరిశోధనలు, వాటి ఫలితాలపై జాతీయ స్థాయిలో మధురైలో జరిగిన కార్యక్రమంలో ప్రజెంటేషన్‌ ఇవ్వడం జరిగింది. తమ పరిశోధన స్థానానికి తొలిసారి జాతీయస్థాయి గుర్తింపు రావడం సంతోషంగా ఉంది. 

తాటి ఫరిశోధనల ఫలితంగా కొత్త రకం తాటి రకాలను త్వరలో తీసుకువస్తాం.జాతీయ వేదికపై తాటికి సంబంధించి పుస్తకాన్ని కూడా ఆవిష్కరించాం. 2014, 2017, 2023లో వ్యక్తిగతంగా జాతీయ స్ధాయిలో అవార్డులు వచ్చాయి.    
–డా. వీసీ వెంగయ్య, ప్రధాన శాస్త్రవేత్త, పందిరిమామిడి ఉద్యానవన పరిశోధన స్థానం

(చదవండి: సోలార్‌ కంచె.. కొన్ని జాగ్రత్తలు!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement