
అటవీ జంతువులు, పశువుల నుంచి పంటలను కాపాడుకోవటానికి సోలార్ ఫెన్సింగ్ ఉపయోగపడుతుంది. చిన్న కమతాల్లో ఏర్పాటు చేసుకున్న రైతులను క్షేత్రస్థాయిలో గమనించినప్పుడు రైతులు చేస్తున్న కొన్ని పొరపాట్లను గమనించామని వాటర్‌లైవ్‌లిహుడ్స్ ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రామ్‌మోహన్ తెలిపారు. సోలార్ ఫెన్సింగ్ నిర్వహణలో ఏ పనులు చెయ్యాలి? ఏ పనులు చెయ్యకూడదు? వంటి అంశాలపై కొన్ని సూచనలు ఇక్కడ పొందుపరుస్తున్నాం.
సోలార్ కంచె వ్యవస్థలో సోలార్ ప్యానల్, బ్యాటరీ, ఎనర్‌జైజర్, ఫెన్సింగ్ వైర్లు ఉంటాయి. 8–10 అడుగుల దూరంలో ΄పొలం చుట్టూ కట్టెలు, బొంగులు లేదా సిమెంటు స్థంభాలు పాతి కంచె ఏర్పాటు చేసుకోవచ్చు. రెండు రకాల యూనిట్లు మార్కెట్లో ఉన్నాయి. 1. సౌర విద్యుత్తును లాక్ చేసే ఎన్‌క్లోజర్ వున్నది. 2. ఎన్‌క్లోజర్ లేనిది. ఎనర్‌జైజర్, బ్యాటరీని రక్షించుకోవటానికి రైతు ఒక షెల్టర్‌ను నిర్మించుకోవాల్సి ఉంటుంది. సోలార్ బ్యాటరీలోని లోవోల్టేజి పవర్‌ను ఎనర్‌జైజర్ హైవోల్టేజ్ పవర్‌గా మార్చి కంచె తీగలకు సరఫరా చేస్తుంది. 40 వాట్స్ ప్యానళ్లు 5–8 ఎకరాల చుట్టూ కంచెకు సరిపోతాయి. 12 వోల్టులు, 18 అంప్రె (గంటకు) స్టోరేజ్ గల బ్యాటరీ పెట్టుకోవాలి.
ఈ విద్యుత్‌ను ఎనర్‌జైజర్ 8 వేలు– 10 వేల వోల్టుల హైవోల్టేజి విద్యుత్‌గా మార్చి తీగలకు సరఫరా చేస్తుంది. ఇది పల్సేటింగ్ విద్యుత్తు. అంటే.. నిరంతరం విద్యుత్తు ప్రసరించదు. 1 – 1.2 సెకండ్లకు ఒకసారి మిల్లీ సెకండ్ మాత్రమే విద్యుత్తు ఆగి, ఆగి ప్రసరిస్తుంది. అందువల్లే పశువులకు కూడా గట్టి షాక్ తగులుతుంది. కానీ,ప్రాణాంతకం కాదు. షాక్‌కు షాక్‌కు మధ్య గ్యాప్ ఉంటుంది. కాబట్టి, ఒకటి రెండుసార్లు షాక్ తగలగానే పశువు అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోవటానికి వీలుంటుంది. ఎర్త్ విధిగా ఏర్పాటు చేయాలి. సోలార్ కంచెకు సంబంధించి అవగాహన పెంచుకొని, జాగ్రత్తగా నిర్వహించుకుంటే రైతులు దీర్ఘకాలం ప్రయోజనం పొందవచ్చు.
ఇదీ చదవండి: Yoga: ప్రాణాయామంతో అమోఘమైన ఆరోగ్య ఫలితాలు
చేయవలసినవి
ఎనర్‌జైజర్‌పైన కనిపించే బ్యాటరీ వోల్టేజిని గమనించండి. వోల్టేజి 10 వోల్టుల కన్నా తక్కువకు తగ్గిపోతుంటే.. గడ్డి, చెట్లు సోలార్ కంచె వైర్లకు తగులుతున్నందున విద్యుత్తు నష్టం జరుగుతోందని గుర్తించాలి.
→ కండక్టర్ వైర్‌కు అనుసంధానం చేసిన ఇన్సులేటర్లు పాడయ్యాయేమో అని తరచూ చూసుకోండి.
→ స్థానికంగా దొరికే వెదురు బొంగులు పాతి సోలార్ కంచె ఏర్పాటు చెయ్యండి. ఇనుప / సిమెంటు స్థంభాల కన్నా ఇవి చవక.
→ పది అడుగులకో బొంగు పాతాలి. అంతకన్నా దూరం అయితే గాలి, వానలకు ఇబ్బంది అవుతుంది.
→ బ్యాటరీకి ఒక చిన్న డిసి బల్బును అమర్చితే పురుగులను నశింపజేసే దీపపు ఎరగా పనికొస్తుంది.
→ యూనిట్‌ను వాన, ఎండ, దొంగల నుంచి రక్షించుకోవటానికి పక్కా షెల్టర్ నిర్మించాలి.
→ సోలార్ ప్యానల్‌పైన దుమ్మును నెలకోసారైనా తుడవండి.
→ ఎర్త్ సిస్టం బాగుందా లేదా అని నెలకోసారైనా చూడండి. నీరు పోయండి.
→ రాత్రుళ్లు మనుషులు సోలార్ కంచెను ΄పొరపాటున తాకకుండా ఉండేందుకు రిఫ్లెక్టివ్ రేడియం టేపు లేదా స్టిక్కర్లు ఏర్పాటు చేయండి.
చేయకూడనివి
కంచె వైర్లను అడుగుకన్నా ఎత్తులో కట్టండి. పంట మొక్కలు/చెట్లకు కొంచెం దూరంగా ఏర్పాటు చేయండి. లేకపోతే కలుపు మొక్కలు ఫెన్సింగ్‌కు తగిలి, విద్యుత్తు నష్టానికి కారణమవుతాయి.
→ ఫెన్సింగ్ వైరు కింద కలుపు పెరగనివ్వకండి. ΄్లాస్టిక్ మల్చింగ్ షీట్ లేదా వీడ్ మ్యాట్ వేసుకోవటం మేలు.
→ చెట్టు, ఇంటి నీడలో సోలార్ ప్యానల్‌ను పెట్టకూడదు. ఇది దక్షిణం వైపు తిరిగి ఉంటే మంచిది.
→ తుపాను సమయాల్లో, పిడుగుపాటుకు అవకాశం ఉన్నప్పుడు ఎనర్‌జైజర్‌ను ఫెన్సింగ్ వైరు నుంచి ముందుజాగ్రత్తగా వేరు చెయ్యండి.
→ కంచెకు దగ్గరగా మొక్కలు నాటకండి. చెట్ల కొమ్మలు వైర్లను తాకనివ్వకండి.
→ మనుషులు సోలార్ కంచెను తాకకుండా జాగ్రత్త తీసుకోండి. తాకితే ఆగి ఆగి షాక్ కొడుతుంది.
→ పిల్లలను కంచెకు దూరంగా ఉంచండి. చిన్న వయస్కులు తాకితేప్రాణాపాయం రావచ్చు లేదా గాయాలవ్వవచ్చు.
→ వైర్లలో హై వోల్టేజ్ పల్స్ కరెంట్ ప్రసరిస్తూ ఉంటుంది. దీన్ని టెస్ట్ చేయటానికి సాధారణ టెస్టర్లు లేదా వోల్టు మీటర్లు వాడకూడదు. మీటర్లు పాడవుతాయి. వాడితే షాక్ తగులు తుంది.