భారీగా పెరిగిన రూఫ్‌టాప్ వినియోగదారుల అక్టోబర్ కరెంట్ బిల్లులు
నెట్ మీటరింగ్‌కు బదులు నెట్ బిల్లింగ్ విధానంలో బిల్లుల జారీ
నెట్ బిల్లింగ్‌కు ఈఆర్సీ అనుమతి లేకున్నా టీజీఎస్పీడీసీఎల్ బాదుడు
ఈఆర్సీకి ఇంధన శాఖ మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఫిర్యాదు
ఇంధన శాఖ మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సురేశ్ చందా తన సోలార్ రూఫ్‌టాప్ సిస్టమ్ ద్వారా జూలైలో 124 యూనిట్ల విద్యుత్‌ను గ్రిడ్‌కు సరఫరా చేసి తిరిగి గ్రిడ్ నుంచి 309 యూనిట్ల విద్యుత్‌ను వాడుకున్నారు. ఈ రెండింటినీ సర్దు బాటు చేశాక ఆ నెలకు ఆయనకు 179 యూనిట్ల వినియోగానికి సంబంధించి రూ. 877 బిల్లును టీజీఎస్పీడీసీఎల్ జారీ చేసింది. కానీ అక్టోబర్ నెలలో మాత్రం 158 యూనిట్లను గ్రిడ్‌కు ఎక్స్‌పోర్ట్ చేసి గ్రిడ్ నుంచి 330 యూనిట్ల విద్యుత్‌ను వాడుకున్నందుకు ఆయనకు 172 యూనిట్ల వినియోగానికే బిల్లు జారీ చేయాల్సి ఉంది. కానీ టీజీఎస్పీడీసీఎల్ మాత్రం రూ. 1,444 బిల్లు పంపింది.
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) అనుమతించకపోయినా సోలార్ రూఫ్‌టాప్ వినియోగదారుల విద్యుత్ బిల్లులను దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్) ఏకపక్షంగా పెంచేసింది. రాష్ట్ర ఇంధన శాఖ మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సురేశ్ చందా శనివారం ఈఆర్సీకి చేసిన ఫిర్యాదుతో ఈ విషయం వెలుగులోకి వచి్చంది.
నెట్ మీటరింగ్ బదులు..
రాష్ట్రంలో సోలార్ రూఫ్‌టాప్ వినియోగదారులకు నెట్ మీటరింగ్ విధానంలో బిల్లులను జారీ చేస్తున్నారు. వినియోగదారులు తమ సోలార్ రూఫ్‌టాప్ సిస్టం ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను గ్రిడ్‌కు సరఫరా చేస్తారు. దీన్ని ఎక్స్‌పోర్ట్ చేసిన విద్యుత్ అంటారు. గ్రిడ్ నుంచి విద్యుత్‌ను తమ అవసరాలకు వాడుకుంటారు. దీన్ని ఇంపోర్ట్ చేసుకున్న విద్యుత్ అంటారు. ఎక్స్‌పోర్ట్ చేసిన విద్యుత్‌తో పోలిస్తే ఇంపోర్ట్ చేసుకున్న విద్యుత్ ఎక్కువ ఉన్నప్పుడు రెండింటి మధ్య ఉండే తేడాను తీసి దాని ఆధారంగా వినియోగదారులకు బిల్లులను జారీ చేయాలి. దీన్నే నెట్ మీటరింగ్ విధానం అంటారు.
కానీ అక్టోబర్ నెలకు సంబంధించి సోలార్ రూఫ్‌టాప్ వినియోగదారులకు టీజీఎస్పీడీసీఎల్ నెట్ మీటరింగ్‌కు బదులుగా నెట్ బిల్లింగ్ విధానంలో బిల్లులు జారీ చేసింది. అంటే వినియోగదారుడు ఉత్పత్తి చేసి గ్రిడ్‌కు ఎక్స్‌పోర్ట్ చేసిన విద్యుత్‌కు, గ్రిడ్ నుంచి వినియోగదారుడు తీసుకున్న విద్యుత్‌కు వేర్వేరుగా చార్జీలను లెక్కించింది. ఈ రెండు చార్జీలను సర్దుబాటు చేసి తుదకు మిగిలే మొత్తాన్ని వినియోగదారులకు బిల్లులుగా జారీ చేసింది. వినియోగదారులు ఎక్స్‌పోర్ట్ చేసే విద్యుత్‌కు టీజీఎస్పీడీసీఎల్ ఇచ్చే «చార్జీలతో పోలిస్తే వినియోగదారులు ఇంపోర్ట్ చేసుకునే విద్యుత్‌పై విధించే చార్జీలు అధికంగా ఉన్నాయి. దీంతో వినియోగదారుల బిల్లులు భారీగా పెరిగిపోయాయి. దీనిపై వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈఆర్సీ తిరస్కరించినా...
సోలార్ రూఫ్‌టాప్‌కు సంబంధించి కొత్త మార్గదర్శకాలను ఈఆర్సీ నవంబర్ 15న ప్రకటించింది. నెట్ మీటరింగ్ విధానానికి బదులు నెట్ బిల్లింగ్ విధానంలో బిల్లుల వసూళ్లకు అనుమతించాలని టీజీఎస్పీడీసీఎల్ విజ్ఞప్తి చేయగా ఈఆర్సీ తిరస్కరించింది. తుది రెగ్యులేషన్‌లో నెట్ మీటరింగ్ విధానాన్నే కొనసాగించాలని స్పష్టం చేసింది. అయినా అందుకు విరుద్ధంగా టీజీఎస్పీడీసీఎల్ వినియోగదారులపై నెట్ బిల్లింగ్ విధానంలో బిల్లులను పెంచేయడం గమనార్హం.


