
నియంత్రణకు కొత్త చట్టం
బిల్లుపై ట్రంప్‌తో పాటు మెలానియా సంతకం
వాషింగ్టన్: ఆన్‌లైన్‌లో అశ్లీల కంటెంట్‌పై అమెరికా కొరడా ఝళిపించింది. దాని నియంత్రణకు ‘టేకిట్ డౌన్’ పేరిట కొత్తం చట్టం తెచ్చింది. దీనిప్రకారం వ్యక్తుల తాలూకు అశ్లీల, అభ్యంతరకర ఫొటోలు, వీడియోలను వారి అనుమతి లేకుండా ఆన్‌లైన్, సోషల్ మీడియా వేదికల్లో పోస్ట్ చేయడానికి వీల్లేదు. సోషల్ ప్లాట్‌ఫాంలు అలాంటి కంటెంట్‌ను తమ దృష్టికి రెండు రోజుల్లోగా తొలగించాల్సి ఉంటుంది.
ఈ నిబంధన డీప్‌ఫేక్ కంటెంట్‌కు కూడా వర్తిస్తుంది. ఈ చట్టం కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భార్య మెలానియా ఎన్నాళ్లుగానో కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సంబంధిత బిల్లుపై సోమవారం ఆమె సమక్షంలోనే ట్రంప్ సంతకం చేశారు. అనంతరం ఆయన కోరిక మేరకు మెలానియా కూడా బిల్లుపై సంతకం చేయడం విశేషం. ‘‘దీనికోసం మెలానియా ఎంతగానో పోరాడింది. కనుక ఆమె సంతకానికి అర్హురాలు’’ అని అధ్యక్షుడు చెప్పుకొచ్చారు.